మధురాపురంలో కొన్ని గంటలు!;-- యామిజాల జగదీశ్
 మా మావగారు, అత్తగారు చిన్ననాట గడిపిన ఓ పల్లెను మే ఎనిమిదో తేది (2022) ఆదివారంనాడు సందర్శించొచ్చాం. అక్కడ కన్పించిన ఓ బోర్డు నన్ను ఆకట్టుకుంది. 
"సుస్వాగతం...
సంపూర్ణ అక్షరాస్యతా గ్రామం మధురాపురం (గుర్విందపల్లి పంచాయతి)"
మా మావగారైన ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణగారు (గండూరి) జన్మస్థలం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలానికి చెందిన గొడవర్రు గ్రామం. ఈ గ్రామాన్నే జంధ్యాల వారి గొడవర్రు అని కూడా అంటారు. అయితే ఆయన చిన్నతనంలో ఉన్నది  కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన మధురాపురం గ్రామం. ఇక్కడే మా అత్తగారుకూడా ఉండేవారు. మధురాపురం 
తోట్లవల్లూరు నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎల్ (ఇంగ్లీష్ అక్షరం L) ఆకారంలో ఉండే ఓ చిరు పల్లె మధురాపురం. గండూరి, శిష్ట్లా, వేమూరి, విష్ణుభట్ల తదితర ఇంటిపేర్లున్న కుటుంబాలిక్కడే ఉండేవి. ఈ గ్రామాన్ని నేను మొదటిసారి 1990లలో మా అత్తగారితో కలిసి సందర్శించాను. దాదాపు ముప్పై ఏళ్ళకు ఇప్పుడు రెండవసారి ఈ మధురాపురానికి వెళ్ళొచ్చాను. 
ఒకప్పుడు జన సమ్మర్దంతో ఉండిన అగ్రహారమే మధురాపురం. కానీ క్రమేపీ ఇక్కడి జనాభా తగ్గుతూ వచ్చింది. ఇందుకు కారణం చదువుసంధ్యలకోసం, ఉద్యోగాల నిమిత్తం నగరాలకు వెళ్ళిపోవడమే.
2001వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 48. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మధురా పురంలో 9 ఇళ్లుండేవి.  జనాభా 37 మంది. వారిలో మగవారి సంఖ్య 17, ఆడవారి సంఖ్య 20. అయితే ప్రస్తుతం ఇక్కడ
మూడు బ్రాహ్మణ  కుటుంబాలవారు, ఒక లంబాడీ కుటుంబం మాత్రమే ఉన్నట్టు వేమూరి మాధవరామ శర్మ తెలిపారు.  ఇద్దరు వేద విద్యార్థులతో కలుపుకొని ఈ ఊళ్ళో ఇప్పుడు ఉంటున్నది పన్నెండు మంది మాత్రమే. వేదవిద్యార్థులు ఉండే ఇల్లు మా మావగారిల్లు. కొన్నేళ్ళ క్రితం తమ ఇంటిని వేదపాఠశాలకు ఇచ్చేశారు. ఎన్నో ప్రముఖ దేవాలయాల్లో పండితులు ఇక్కడ వేద విద్యాభ్యాసం చేసిన వారే కావడం విశేషం. ఇక్కడి ఆవరణలో బోలెడన్ని తులసిమొక్కలున్నాయి. ఈ ఊళ్ళోనే మా అత్తగారు అయిదో తరగతి వరకూ చదువుకున్నారు. అలాగే ఈ మధురాపురంలోనే మా పెద్ద వదినగారు (గిరిక) పుట్టిపెరిగారు.
ఈ గ్రామంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, శ్రీ అలిమేలు మంగా పద్మావతీ సమేత వరాల వేంకటేశ్వరుల ఆలయం. ఈ ఆలయానికి ట్రస్టీ వేమూరి మాధవరామ శర్మ. మరొకటి
శ్రీ ఆంజనేయ సహిత కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర దేవస్థానం. ఈ ఆలయంలో గ్రానైట్ వేయించిన దాత శ్రీ నడిమింటి చిరంజీవి. ఈ ఆలయంలోనే మా అబ్బాయి మొక్కు తీర్చుకోవడంకోసం మేమందరం (రాజీవ, రేణుక, పవని, సాత్యకి, నేను, చిత్రాణి) వెళ్ళొచ్చాం. ఈ ఆలయ అర్చకులు ఐలూరు లీలాప్రసాద్ పూజాదికాలు నిర్వహించారు. ఈ ఆలయం వెనుకే ఓ కాలువ పారుతోంది. దానిని కరవు కాలువ అంటారు. ఆలయం పక్కనే ఓ పెద్ద రావి చెట్టు ఉంది.
ఈ ఊళ్ళో ఒక పోస్టాఫీసు కూడా ఉండటం గమనార్హం. ఒకే ఒక్క పోస్టుమాస్టరుతో నడుస్తోందీ పోస్టాఫీసు. అలాగే ఒకప్పుడు ఉండిన బడ్డీకొట్టు ఈసారి కనిపించలేదు.
జిల్లా పరిషత్తుకి చివరి గ్రామమైన ఈ మధురాపురానికి మూడు డిపోల నుంచి ఒకప్పుడు ఆర్టీసీ బస్సులు వచ్చేవి. విజయవాడ బస్సు రాత్రి పూట ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళేది. 
మేడూరు నుంచి ఇక్కడికి తారు రోడ్డు  మంజూరైనా అర్ధంతరంగా ఆ పనులు ఆగిపోయాయి. 
చీకటి పడితే ఈ గ్రామంలో గోధుమవర్ణంలో ఉండే పాములు సంచరిస్తుంటాయని లీలాప్రసాద్ చెప్పారు. అవి కనిపించడంతోనే ఓ దణ్ణం పెట్టేసుకుంటానని, అవి ఏ చడీచప్పుడూ చేయకుండా వెళ్ళిపోతాయన్నారు. 
ఈ ఊళ్ళో నుంచి వస్తూ వస్తూ మాధవరామ శర్మగారు అప్పటికప్పుడు కోసిచ్చిన మామిడికాయలతో హైదరాబాద్ చేరుకున్నాం మేము. ఇది మరచిపోలేని పర్యటన! 
కామెంట్‌లు