"పడగనీడ" ;-ఎం బిందుమాధవి
 "రాములమ్మా.....ఏం ఈ రోజు ఆలస్యమయింది. బాబుకి పరీక్షలు జరుగుతున్నాయని తెలుసు కదా! ఆ(: కానీ..త్వరగాగిన్నెలు కడిగెయి" అన్నది శైలజ, స్టవ్ మీద కూర కలుపుతూ. 


"నా అల్లుడు రాత్రి తాగొచ్చి అమ్మాయిని కొట్టిండంట. అది ఏడుస్తూ పిల్లాడిని చంకనేసుకొచ్చింది. బస్తీలో పంచాయితీ! ఏం జెయ్యలామ్మా... నా మగడూ తాగుతాడు. ఇంక అల్లుడికేం చెప్పగలడు" అన్నది. 


"ఏం చేస్తాడు నీ అల్లుడు" అనడిగింది శైలజ కూర స్టవ్ ఆపేసి, చేతిలో కాఫీ గ్లాసుతో వచ్చి గట్టు మీద కూర్చుంటూ! 


"రెండెకరాల పొలం ఉంది. బ్యాంకులో అదేదో రోజువారీ కూలీ లాగా ప్యూన్ జాబంటమ్మా....అది చేస్తున్నాడు ఎప్పటికైనాపర్మనెంట్ అవుతాడని పిల్లనిచ్చినం. మొదట్లో మంచిగనే ఎల్లిండమ్మా! నాలుగైదేళ్ళయింది బ్యాంకుకి ఎల్లబట్టి. ఎవరోదోస్తులంట...'ఎన్నాళ్ళు జేస్తవ్ ఈ ఉద్యోగం? మాతో రా పార్టీ జెండా మోస్తే రోజుకి 300 ఇస్తరు. అట్నే నెమ్మదిగా కార్యకర్తవిఅవుతవ్. నాయకుల కళ్ళల్లో పడినవంటే నీ జీవితమే మారిపోద్ది ' అని చెప్పి ఉద్దోగానికి పోకుండా జేసిన్రు." 


"ఈనిది రోజు కూలీ లాంటి ఉద్దోగం అయిపాయె! నెలలో ఎన్ని రోజులు ఎల్తే అన్ని రోజులకే జీతమిస్తరు. మద్దె మద్దెలోదోస్తులెంట పార్టీ పనులని ఎల్లిపోతుంటడు. ఆల్లు డబ్బిస్తే ఇస్తరు...లేకుంటే గింత తిండి పెట్టి, మాట్లాడకుండతాగిపిస్తరు. ఒకసారి రాజకీయాలంటూ పోతే జీవితం పరేషాన్."


"తల్లి దండ్రి, భార్య....ఇంత మంది ఉన్న సంసారమాయే! ఎట్ల నడస్తదమ్మా! డబ్బులు చాల్లేదని మాయమ్మాయ్ గొడవజేస్తే తాగొచ్చుడు, పెండ్లాముని కొట్టుడు! ఇల్లు నడవాలని మాయమ్మాయి గిట్లనే ఇండ్లల్లో పనికి బోతె ఆ డబ్బుగుంజుకుంటడు.  గిదమ్మ పంచాయితి" అని రాములమ్మ గోడు వెళ్ళబోసుకుంది. 


"మీ ఇళ్ళల్లో తాగని వాళ్ళు ఉండరేమో కదా రాములమ్మా" అన్నది శైలజ. 


"ఆ:( ఇప్పుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఏముందమ్మా! అందరి ఇళ్ళల్లోను ఇదే పంచాయితీ! చదువుకున్నోల్లు, కూలీ చేసుకునేమా బోటోల్లు, ఉద్దోగాలు చేసెటోల్లు, సదువుకునే స్టూడెంట్లు..ఆల్లు ఈల్లు అని కాదమ్మా...అందరికీ ఈ తాగుడు ఓ పాసన్అయిపోయిందమ్మా!"


"ఎక్కడు జూడు కల్లు దుకనలు, బ్రాందీ- వైన్ షాపులేనయిపాయే! ఇళ్ళ మద్దెలో పెడుతుండ్రు! జనాల్ని తాగిపించుడేసర్కారుకి సంపాదనయిపాయే! ఓ సేత్తోనేమొ ఫ్రీ వైద్దెమంటూ ఆరోగ్యశ్రీలు, చవుక బియ్యం ఇచ్చుడు.... కల్యాన లక్ష్మి, ప్రసూతి కిట్లు అంటూ కొత్త కొత్త పతకాలు... మరో పక్కన ఈ తాగుడు దుకనలు. ఈ తాగిపించుడెందుకు? దానితోసంపాదించిన డబ్బుతో ఫ్రీగా ఇస్తున్నమంటూ ఈ పతకాల లొల్లెందుకు?"


"ఇది జెబితే పిల్లలకి అర్దం కాదు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే తీసుకోక ఊకె పంచాయితీ ఎందుకు అని కొట్లాటకి నామీదికి ఉరికొస్తడమ్మా మా అబ్బాయి. అంతో ఇంతో సదువుకుంటే ఆయన్నే మంచి ఉజ్జోగం సంపాదించుకోవచ్చు గదమ్మా. ఆయన ధైర్యం ఆయనకే ఉంటుంది" అన్నది బట్టలు దబ దబా బాదుతూ. 


"ఓ రాములమ్మా... నీ ఘోష బానే ఉంది కానీ బట్టలు చిరిగిపోతై చూడు" అన్నది శైలజ బయటికొచ్చి. 


"అవ్ అమ్మా... ఈ సర్కారు ఇప్పుడుండచ్చు! నాలుగేళ్ళయినంక ఈల్లు పోయి ఇంకొకరొస్తే ఈ పతకాలు తీసేసి, కొత్తవిపెట్టచ్చు. ఈ పార్టీ జెండాలు మోసినోల్లని ఆల్లు పట్టించుకుంటారా? అప్పుడు ఈని గతేందమ్మా? ఎంత జెప్పినఇంటలేడమ్మా... నా కొడుకు గూడా ఇస్కూలు మానేసి బావ ఎంట తిరగ బట్టిండు. నిండ పదిగేనేండ్లులేవు..అప్పుడప్పుడు తాగొస్తున్నడు."


"నా మగడు కూడా తాగుతాడాయె. ఇంక కొడుక్కేం చెప్తడు..అల్లునికేం చెప్తడు? మేమెంత రెక్కలు ముక్కలు జేసుకున్నఇంట్లొ ఆడోల్ల బతుకు ఇట్నే తెల్లారుతదమ్మా!" అన్నది. 


"సరిలే ఆ రెండిడ్లీలు తిను. చాయ్ ఇస్తాను" అన్నదిశైలజ. 


చాయ్ తాగుతున్న రాములమ్మతో "రాములమ్మా నువ్వు చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళావా? చదువుకున్న వాళ్ళ లాగాఆలోచిస్తున్నావ్! నువ్వు అన్నట్టు నా బోటి వాళ్ళు చెబితే నన్నే తప్పు పడతారు కానీ అందులో నిజం ఆలోచించరు" అన్నది శైలజ. 


"ఏం సదువులమ్మా...చిన్నప్పుడు ఓ ఏడాది స్కూల్ కి ఎల్లిన. నాకు సెల్లె బుట్టింది. అమ్మకి సాయం కావాల్నని స్కూల్మానిపించిన్రు. నేను జీవితాన్నే సదివిన్నమ్మా! ఇంగ స్కూల్ చదువులెందుకు. నీ లెక్కనే ఇంకో అమ్మ ఉండె. ఆమెతోమాట్లాడుతూ ఇయన్నీ తెలుసుకున్ననమ్మా! పేదోల్లం అని మాకు సర్కారోల్లిస్తే ఈల్లకెందుకు కడుపు మంటఅనుకునేదాన్ని. ఇవరంగ సెప్పగ నాకు తెలిసింది."


"ఇప్పుడు సర్కారోల్లు జేసే సంక్సేమం అంతా "పడగ నీడ" లాంటిదమ్మా! ఎప్పుడు జీవితాలు ఆగమాగమవుతయోతెలవదు. మగడు మంచిగుంటే ఆడపిల్లలు ఏరే వోల్లతో ఎల్లిపోవటం అనేది జరగదు కదమ్మా! ఆ లేపుకుపోయినోడుగూడ ఈని కంటే మంచోడేం గాదు. కానీ అమాయకపు ఆడపిల్లలకి అంత ఆలోసన రాదమ్మ! ఆడేదోనెత్తినెట్టుకుంటాడనుకుంటారు. ఆడి వంకర బుద్ది బయటపడినంక ఏదోకటి మింగి సచ్చిపోతరు! మా బస్తిలో రోజుకొకటిఇదే పంచాయితి అమ్మా" అన్నది. 


"సరిలే మనమెంత మొత్తుకున్నా మన ఘోష ఎవరికిపడుతుంది రాములమ్మా. కొన్ని సమస్యలకి పరిష్కారం అంతతేలికగా దొరకదు. కాలానికి కొంత మంది బలి అవ్వాలిసిందే! మనింటి దగ్గర ఆడపిల్లలకి శిక్షణ ఇచ్చే సెంటర్ ఉన్నది. ఇలా మీ అల్లుడి లాగా తాగి ఇంటికొచ్చి పెళ్ళాన్ని కొట్టే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తారు. ముందు మీ అమ్మాయినిఅందులో చేర్చు. తరువాత మీ అల్లుడు, కొడుకు సంగతి చూద్దాం" అన్నది శైలజ. కామెంట్‌లు