రవీంద్ర నాథ్ ఠాగూర్ - కవిత్వ బాటసారి ;-ఎం. వి. ఉమాదేవి
నా పరాజయ పుష్పమాలికలతో 
నిన్ను అలంకరణ చేస్తాను అన్న రవీంద్రుడు... 
విశ్వ కవితా రహదారిలో సాగే బాటసారి !

దివ్యమైన నిశిరాగాలు ఆయన 
హృదయం నిండుగా 
స్వచ్ఛ కాంతులు చిమ్ముతూ.. 
ఉన్నప్పుడు... 
మృత్యువు అతిథిగా వచ్చినా 
వెరవనన్నాడు ఠాగూర్ !

బడికి వెళ్లని బాల్యం ఎంతో చదివింది లోకాన్ని.. 
అద్భుతమైన ఊహల్లో రాణించే 
అలంకారభావనలు 
రవీంద్రుని కలల కలంనుండి 
జలపాతంగా గీతాంజలిగా  ప్రవాహినియైనాయి !

శ్రామిక జీవనసౌందర్యం నుండి 
తెలుసుకున్న ఆత్మ రహస్యం 
ఆయన్ని దైవికతేజానికి దగ్గర చేసి.. 
నిరాడంబర విద్యా సామ్రాజ్యమైన
శాంతి నికేతన్ లో శుక పిక రావాలమధ్య కళా పరిశోధనయింది !
దేశభక్తి కాంతులు ఆయన కన్నుల్లో వెలుగై... 
జాతీయ గీతాల ఆలాపనగా మారింది !
పనిలో దైవాన్ని, సత్యంలో ధర్మాన్ని చూసి 
గుడికి వెళ్లకు ఆత్మలోనే దేవుని చూడు అన్నారు. నోబెల్ పురస్కారకమలం రవికిరణాలను ఆకర్షకమైంది !

మిత్రమా... జీవితమధువును 
నా కలశం లోనే ఆస్వాదించు 
అన్న హృద్యమైన చిరు కోరిక.. 
తారలనూ ఆకాశాన్నీ.. పరామర్శ చేయగల సున్నితత్వం...
నీ అడుగులు సాహసోపేతమై ఉండాలనీ, 
గొప్పవైన నక్షత్రసమూహం కన్నా 
మానవుడు వెలిగించిన దీపాలనే విధాత ప్రేమిస్తాడనీ 
మహోన్నత కవిభావనలను తర్కించిన విశ్వ కవికి... 
అక్షర పుష్పాoజలి !!కామెంట్‌లు