భారతీ మెస్;-- యామిజాల జగదీశ్
 కస్టమర్లే మా ఇంటి అతిథులు ....భారతీ మెస్ నినాదమిది. మద్రాసులోని తిరువల్లిక్కేణిలో ఉందీ మెస్. దీని యజమాని కణ్ణన్.
ఈ మెస్సుకో ప్రత్యేక గుర్తింపు ఉంది. మగస్ పేరులోనే కాదు, లోపల ఎటు చూసినా తమిళకవి సుబ్రమణ్య భారతియార్ మాటలూ ఫోటోలు కనిపిస్తాయి.
లోపలకు అడుగు పెట్టడంతోనే మనకు స్వాగతం పలికేవి భారతియార్ అరుదైన ఫోటోలు...కవితలు....
ఈ మెస్సు అరుదైన వాటిలో అరుదైది. ఈ మెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే రీతిలో రుచికరమైన ఆహార పదార్థాలతో ఆకలిని తీరుస్తుంది.
ఇక్కడి వంటకాలలో సోడా ఉప్పు, పామాయిల్, డాల్డా వంటివి కలపనే కలపరు.
పొట్టకు హానీ చేసే ఆహారపదార్థాలు చేయరు. కనుక నిర్భయంగా హాయిగా నిక్షేపంగా తినవచ్చంటారు ఇక్కడ తిన్న కస్టమర్లు.
ఈ నగరంలో పలు చోట్ల అన్నం తింటే కొంత కాలానికి పొట్ట దెబ్బతింటుంది. కానీ ఈ భారితీ మెస్ వల్ల అటువంటి ప్రమాదంలేదు.
ధరకూడా అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలతో ఆకలి తీర్చే భారతీ మెస్ రుచికి నాణ్యతకూ పెట్టింది పేరు.
ఇంట్లో అమ్మ చేతి వంట తిన్నట్టే ఫీలవుతామంటారు కస్టమర్లు. ఒకసారి ఇక్కడ తిన్నామంటే మరొక్క సారి వెళ్ళి తినాలనిపించేలా ఉంటుంది ఇక్కడి వంటలు.
తాను చదువుకుంటున్న రోజుల్లో భారతియార్ అంటేనూ భారతియార్ రచనలంటేనూ మహా ఇష్టమని చెప్పుకున్న కన్నన్ సమాజానికి ఏదో విధంగా తన వంతు మంచి చెయ్యాలనే ఆలోచన భారతియార్ రచనలవల్ల కలిగిందంటారు.
పత్రికా రంగంలో కొంత కాలం పని చేసిన కన్నన్ కుటుంబ పరిస్థితుల కారణంగా సొంతంగా ఏదన్నా చెయ్యాలనుకుని పత్రికారంగంలో చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పి ఆహార శాఖలో అడుగుపెట్టి భారతీ మెస్ కి పునాదివేశారు.
ఆహారమే ఔషధం అని జీవించిన తమిళులు ఈరోజు ఆహారం తర్వాత ఔషధం అనే స్థితిలో ఉన్నారు. తిరువల్లిక్కేణిలోని మాన్షన్లో ఓ రెండేళ్ళు ఉండిన కన్నన్ ఆరోగ్యానికి చేటు కలిగించని ఆహారం కోసం కష్టపడిన అనుబవాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజుల్లో మాన్షన్లలో ఉంటున్న వారినికి నాణ్యమైన ఆహారం పెట్టాలనే ఈ భారతీ మెస్ నడుపుతున్నట్టు చెప్పుకున్నారు.
భారతీళమెస్ ప్రవేశ ద్వారంలో అన్నం అంటే ఏదో రుచికే పరిమితం కాకుండా ఆరోగ్యానికీ తోడ్పడే విధంగా ఉండాలన్నదే మా ఏకైక లక్ష్యం అనే నినాదం ఈ మెస్ కొచ్చేవారిని  పలకరిస్తుంది. పారంపర్యగా వచ్చే సిరుధాన్యాలను ప్రధానంగా చేసుకుని, నీటి ఆవిరితో వంటకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన మాట. అంతేకాకుండా ఈరోజుల్లో ప్రజలలోనూ ఆహారం విషయంలో తీసుకుంటున్న జాగర్తలు తమకెంతో ప్రోత్సాహాన్నిస్తున్నాయన్నారు.
ఈ మెస్సు కష్టమర్ల పట్లేకాకుండా పని చేసే సిబ్బంది పట్లకూడా యాజమాన్యం అనుసరించే తీరులో ఓ నిజాయితీ ఉంటోంది.
"ఇది ఒక దుకాణం కాదు. ఇది ఓ పుట్టిల్లు. అమ్మ ఇల్లు. ఈ ఇంటికి వచ్చేవారు అతిథులే వినియోగదారులు. కనుక వారి విషయాన్ని గుర్తుంచుకుని వంటకాలను ఎంతో శ్రద్ధగా వండాలి" అని కన్నన్ తమ సిబ్బందితో చెప్తుంటారు.
పరిశుభ్రమైన దుస్తులు ధరించి విధులకు వచ్చే సిబ్బందికి రోజూ ప్రోత్సాకంగా కొంత డబ్బు, విధులకు సరైన సమయానికి వస్తే అందుకుగాను కొంత ప్రోత్సాహకం ఇస్తుండటం విశేషం. ఇక్కడ డబ్బుకన్నా కచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నందుకు మేమిచ్చే మర్యాద అని యజమాని కన్నన్ మాట.
తిరువల్లిక్కేణిలో తమ మెస్సుకి లభించిన ఆదరణతో మైలాపూరులో కపాలీశ్వర ఆలయానికి సమీపంలోనూ ఓ మెస్ ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ మెస్ తిరువల్లిక్కేణిలోని మెస్ కన్నా కాస్తంత పెద్దది. అయినప్పటికీ తిరువల్లిక్కేణికి అద్దంపట్టే రీతిలోనే ఈ మెస్ కూడా ఉంటుంది. ఈ మైలాపూర్ మెస్సులో పని చేస్తున్న వారంతా మహిళలే. వంట చేయడం మొదలుకుని నిర్వాహకమంతా మహిళలే చూస్తున్నారని కన్నన్ చెప్పరు. 
తమ వ్యాపారంలో కనిపించే లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతుంటానని కన్నన్ మాట. ఉదాహరణకు తినడానికి వచ్చే వినియోగదారుడు ఒక్కొక్కప్పుడు పది నిముషాలో పావు గంటో వెయిట్ చేయవలసి ఉంటుంది. వారు ఓపికతో వెయిట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్తూ ఈ సమస్య తలెత్తకుండా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. అలాగే ఎంత జాగర్తగా వండుతున్నా కొన్నిసార్లు రుచిలో తేడా వుంటోందని, దీనినికూడా సరిచేసుకోవడానికి జాగర్తలు తీసుకుంటున్నామని చెప్పారు కన్నన్.
మహాకవి భారతియారుని మనసులో అనుకుని ఇక్కడి సిబ్బంది మూడు పూట్లా ప్రార్థన చేస్తారు.
"భగవంతుడా! దారి చూపు. భారతి మెస్సులో తింటే ఆరోగ్యానికి ఏ చేటూ రాదు అనే నమ్మకంతో వచ్చే వినియోగదారులకు మావల్ల చేతనైన మేరకు మంచి ఆహారం చేస్తున్నాం. మా ప్రయత్నం, కృషి విజయవంతంగా కొనసాగడానికి నువ్వే దారి చూపాలి భగవంతుడా!" అని సిబ్బంది ప్రార్థిస్తారు. లాభాలకతీతంగా శుచికీ రుచికీ ఆరోగ్యానికీ ప్రాధాన్యమిస్తూ నడుపబడుతున్న ఈ మెస్ యజమాని ఓ మాట అంటుంటారు....
"వినియోగదారులు ఇచ్చే డబ్బు మన దేహానికి చేరాలంటే మనం వడ్డించే వంటకాలు వారి దేహానికి ఆరోగ్యాన్నిచ్చే విధంగా ఉండాలి. కనుక ఎంతో శుభ్రంగా వంటలు వండాలి" అని!
ఇంతకూ ఈ మెస్ ఎక్కడుందో చెప్పలేదు కదూ....
తిరువల్లిక్కేణిలోని భారతీ రోడ్డులో ఇడ్లీ సాంబారుకి ప్రసిద్ధి రత్నాభవన్ నుంచి బీచుకి వెళ్ళే దార్లో కుడివైపున తిరిగే రోడ్డునే భారతి రోడ్డు అంటారు. ఈ రోడ్లో ఓ వంద మీటర్లు నడిస్తే ఎడంవైపున ఓ పెద్ద సైజులో భారతియార్ ఫోటో ప్రకటన కనిపిస్తుంది భారతి మెస్ అని. ఆ వీధి పేరు అక్బర్ వీధి. లోపలకు అడుగు పెట్టడంతోనే భారతియార్ ఫోటో వినియోగదారులకు స్వాగతం పలికి ఆహ్వానిస్తున్నట్టు అన్పిస్తుంది. కామెంట్‌లు