తిండిపోతు రప్పాయి;-- యామిజాల జగదీశ్
 ఇడ్లీలు ఓ ఆరు మహా అయితే ఎనిమిది తినగలనేమో చట్నీ బాగుంటే. కానీ ఆయన ఏకంగా 250 ఇడ్లీలు తినడమేకాకుండా, పదిహేను కిలోల పాయసం తాగి బహుమతికూడా కొట్టేసారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇందుకు కారణమైన ఆ వ్యక్తి పేరు తీట్టా రప్పాయి. 
పుట్టుకతో ఆయన కేరళీయుడు. 1939 ఏప్రిల్ ఇరవయ్యో తేదీన త్రిసూరులో కురియప్పన్, తండమ్మా దంపతులకు పెద్దకొడుకుగా జన్మించారు. 
చిన్నతనంలో తిండిమీద పెద్ద ధ్యాస ఉండేది కాదు. కానీ ఉన్నట్టుండి తినడం ఎక్కువైన రప్పాయి దేశ విదేశాలలో తిండి పోటీలు పెడితే పాల్గొనేవారు. 
ఆయన ఉదయం పూట బ్రెక్ ఫాస్టుగా డెబ్బయ్ అయిదు ఇడ్లీలు తినేవారు. ఇక లంచ్ వేళ బక్కెట్ల కొద్దీ అన్నం, కూరలూ లాగించేసేవారు. మళ్లీ మధ్యాహ్నం 3.30 గంటలకు దోసెలు, పరాటాలు తిని టీ తాగేవారు. రాత్రిపూట అరవై చపాతీలు తినేసేవారు. మాంసాహారం తినేవారు కాదు.
మరొకసారి డెబ్బయి అయిదు ఇడ్లీలు, రెండున్నర కిలోల అప్పం తినడంతోపాటు బక్కెట్ల కొద్దీ పాయసం జుర్రుకున్నారు రప్పాయి.
కేరళతోపాటు వివిధ ప్రాంతాలలో ఈటింగ్ పోటీలు పెడుతున్నారంటే ఆయన తప్పనిసరిగా పాల్గొనేవారు. ఆయన మహా తిండిపోతు రాముడుగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పుటల్లోకి మూడుసార్లెక్కారు.
త్రిసూరులో ఓ రెస్టారంటులో సవాల్ విసిరిన ఆయన మీరెంత పెట్టినా తింటానన్నారు. వారందుకు ఒప్పుకున్నారు. మూడు బక్కెట్ల అన్నం, ఓ బక్కెట్టు చేపల కూర, పది కిలోల వండిన మాంసం లాగించేసి ఇంకా ఆకలి తీరలేదన్నారు. ఛాలెంజ్ మాట దేవుడెరుగు అనుకున్న రెస్టారంట్ వారు ఇక లాభం లేదనుకుని పోలీసులను రప్పించారు. ఈ క్రమంలో ఆయన పేరు కేరళ అంతా పాకింది. 
అనంతరం వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తేల్చిందేమిటంటే మెదడులో ఉన్న హైపోథా లమస్ డిస్ఫంక్షన్ లోపం వల్ల రప్పాయికి తీరని ఆకలి సమస్య ఎదురైందని, ఈ లోపం ఉన్నవారికి ఎంత తింటున్నామన్న ధ్యాస ఉండదని, పెట్టిన కొద్దీ తింటూ ఉంటారని చెప్పారు.  అరవై నాలుగో ఏట ఆయనకు మధుమేహంతో బాధపడ్డారు. కీళ్లలో నొప్పులు మొదలయ్యాయి. వీటన్నింటికీ ఊబకాయం కారణమే అని తేలింది. చివరి రోజుల్లో ఆయన చేతులు, కాళ్ళు బలహీనపడ్డాయి.
కానీ 2006 జూలై నెలలో విపరీతమైన పొట్టతో వివిధ సమస్యలు తలెత్తడంతో రప్పాయి తినడం తగ్గించకతప్పలేదు. అంతేకాదు ఆయన పోటీలలో పాల్గనటం మానేసి తక్కువ మోతాదులో తినవలసి వచ్చింది. మరి కొన్ని నెలలకే అంటే అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన త్రిసూర్ నగరంలోని జూబ్లీ మిషన్ ఆస్పత్రిలో ఉదయం నాలుగున్నర గంటల వేళ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు అరవై ఏడేళ్ళు. 
ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఎందుకు చేసుకు లేదని అడిగితే తన తిండికే భారీగా ఖర్చవుతుంటే పిల్లాపీచు అంటూ వారికి మరెంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందోనని నవ్వేవారు.
గిన్నిస్ రికార్డు పుటలకెక్కాలనుకున్న ఆశ తీరకుండానే మరణించిన నాటికి ఆయన 120 కిలోల బరువున్నారు. ఆయన భారీ భౌతికకాయం కోసం కుటుంబసభ్యులు ప్రత్యేకించి శవపేటికను తయారు చేయించారు.
త్రిసూరులోని లౌర్డెస్ చర్చి ఆవరణలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
ఆయన సోదరుడొకరు మాట్లాడుతూ, చివర్లో కొన్ని రోజులపాటు తన అన్నయ్య మంచాన పడ్డాడని, వైద్యుల సూచన మేరకు తక్కువ ఆహారం తీసుకున్నాడని చెప్పారు.
దేవుడంటే భయపడే రప్పాయి ఆదివారాలు తప్పనిసరిగా ప్రార్థనలకు హాజరయ్యేవారు. ఎందుకంటే దేవుడు తన కడుపు నింపడంలో ఎప్పుడూ లోటు చేయలేదని అనేవారాయన. తనకిటువంటి జీవితాన్నిచ్చినందుకు ఆయన దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.
కేరళ దర్శకుడు విను రామకృష్ణన్ రప్పాయి టైటిల్ తో 2018లో ఓ సినిమా తీశారు. రామకృష్ణన్ సోదరుడు కళాభవన్ మణి "రప్పాయి పాత్ర" లో నటించారు.


కామెంట్‌లు