"పుస్తకాల తాత మురుగేశన్!";-- యామిజాల జగదీశ్
 ఆయన పేరు మురుగేశన్. కానీ అందరూ ఆయనను "పుస్తకాల తాతా" అని ప్రేమగా పిలుస్తుంటారు. 
తమిళనాడులోని మదురై జిల్లా అలంగానల్లూరుకి సమీపాన ఉన్న తండలై అనే గ్రామంలో 1941 ఏప్రిల్ 13న జన్మించారు ఈ పుస్తకాల తాత.
తన చిన్నవయస్సులోనే తండ్రిని కోల్పోయిన మురుగేశన్ పద్నాలుగో ఏట ఓ కిరాణా సరకులు అమ్మే దుకాణంలో చేరారు. 
అయితే ఆ దుకాణానికి వచ్చే పాత పుస్తకాలను పత్రికలను చదువుతుండే ఈయన తనకు నచ్చిన వాటిని భద్రపరచి  ఇతరులకు చదవమని ఇస్తుండేవారు. 
క్రమంగా ఈ కిరాణా దుకాణం పాఠకుల వేదికగా దర్శనమిస్తుండేది. ఇక్కడికి సరుకులు కొనడానికి వచ్చినవారు ఈయన సేకరించిన పుస్తకాలను , పత్రికలను చదువుతూ ఆయన అభిమానులుగా మారారు. అంతేకాదు తాము చదివిన వాటి గురించి ఆయనతో చర్చించసాగారు.
అలా దుకాణానికి వచ్చిపోయేవారితో పరిచయాలు పెరిగి పుస్తకాలతో తనకున్న అనుబంధాన్ని మరింత విస్తరింపచేశారు.
పుస్తకాలను వెతికి వెతికి సేకరించడం మొదలుపెట్టిన ఆయన వాటిని ఓ క్రమపద్ధతిలో విభజించి భద్రపరిచేవారు. 
 
అద్దెకుండిన ఇంటి నిండా పుస్తకాలే. తీరా అక్కడ చోటు చాలకపోవడంతో ఆయన ఇల్లు మారవలసి వచ్చింది. పాతపుస్తకాల పరిమళంతో జీవించడం గొప్పగా అనుకున్న ఈ పుస్తకం తాతకు తర్వాతి కాలంలో అద్దె ఇల్లు దొరకడం కష్టమైపోయింది. పుస్తకాలను మోసుకుంటూ విద్యాలయాలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళి విద్యార్థులకు కావలసిన పుస్తకాలిచ్చి పుస్తకపఠనంపట్ల ఆసక్తిని పెంచారు. ఈ నేపథ్యంలో ఆయన పరిశోధకులకు అక్షయపాత్రగా మారారు. 
పరిశోధకులకు కావలసిన అరుదైన పుస్తకాలనుసైతం ఆయన సేకరించి ఇచ్చేవారు. ప్రొఫెసర్లు, పరిశోధకులు ఆయన ఇంటికి వెళ్ళి కలుస్తుండేవారు. ఎవరికి ఏ పుస్తకం ఇచ్చినా వాటిని ఓ నోట్ బుక్కులో రాసుకునేవారు. మళ్ళా వాటిని తీసుకునేవారు. అలా తీసుకున్న వాటిని ఇతరులకు ఇచ్చేవారు.
ఇందుకోసం ఆయన ఎవరి దగ్గరా ఒక్క పైసా తీసుకునేవారు కాదు. ఎవరైనా ప్రేమతో డబ్బులిస్తే మాత్రం తీసుకునే వారు. ఆయన కుటుంబం ఈ డబ్బులతోనే గడిచేది. 
విద్యాలయాలలో జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరై ఓ మూల కూర్చుని ఉపన్యాసకులు చెప్పే వాటిని శ్రద్ధగా వినేవారు. అక్కడికికూడా ఆయన ఉత్త చేతులతో వెళ్ళేవొరు కాదు. కొన్ని పుస్తకాలతో వెళ్ళి కావలసిన వారికి వాటిని ఇచ్చేవారు చదువుకోవడానికి.
 2020లో ఆనందవిగడన్ అనే వారపత్రిక ఎంపిక చేసిన పది మంది ప్రముఖ వ్యక్తులలో ఈయన ఒకరు. 2016లో ఈయనకు చెన్నై పుస్తక సంఘం "పుస్తకప్రేమికుడు" అనే బిరుదునిచ్చి సత్కరించింది. పుస్తక జలపాతం (2015), సీనియర్ సిటిజన్ టైటిల్ (2011), సాధనపరుడు అవార్డు (2013) వంటి అవార్డులెన్నో అందుకున్న ఈ పుస్తకాల తాతకు అరుదైన పుస్తకాలకోసం ఎంత దూరమన్నా ప్రయాణించి సేకరించి చదవడంకోసం వాటిని ఇతరులకిచ్చి ఆనందపడేవారు. తీరా ఆయన రెండో తరగతికూడా చదవలేదు. అయితేనేం ఈయన ఇచ్చిన పుస్తకాలు ఎందరో విద్యావంతులకు ఉపయోగపడేవి. తమిళ విశ్వవిద్యాలయం అధికారి మా. తిరుమలై తన "పేచ్చుకళై" (మాట్లాడే కళ) అనే పుస్తకాన్ని ఈయనకు అంకితం చేయడం విశేషం. తనను పరిచయం చేసిన కొన్ని పత్రికలలో ఆయన పలువురు విద్యావంతుల పేర్లను ప్రస్తావిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు పుస్తకాల తాత మురుగేశన్. 
ఓపిక ఉన్నంత వరకు తమిళ పుస్తకాలను మోస్తూ తిరిగిన ఈయన తన ఎనభై ఒకటో ఏట కన్నుమూశారు. కరోనా పూర్వం వరకూ రబ్బరు చెప్పులు వేసుకునే నడిచేవారు. అయితే వయోభారంతో చివరి రోజుల్లో ఇంటి దగ్గరే ఉండి తనకోసం వచ్చేవారితో పుస్తకాల గురించి మాట్లాడి ఆనందించేవారు.

కామెంట్‌లు