నిశ్శబ్ధం;-డా.నీలం స్వాతిచిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 ఎల్లలు లేని ఎడారి ప్రాంతాన వేల ఎకరాలను పండించగా, 
మైళ్ళ దూరాన మాగాణి సిద్ధమైంది...
మబ్బుల మట్టిని చదును చేయగా 
వేకువ రేఖ సాయమొచ్చింది...
వెచ్చని కిరణాలు, విత్తులు నాటగా,
మధ్యానానికి మొక్కలు మొలకెత్తగా 
బంజరు భూమి సాగుకొచ్చింది...
రవి ఉజ్వల కాంతికి చేను విస్తృతంగా విస్తరించి 
సంధ్యా సమయానికి కందితోట కోతకొచ్చింది...
కుప్పనూర్చి కాలాన్ని దోసిలి పట్టగా 
నీరులా చేజారి రేయిలా మారిపోయింది...
అనంత ఆకాశదేశాన అందంగా చుక్కల పూలు పరిమళించగా, 
తోడు లేక చందమామ విను వీధులలో ఒంటరై విహరించగా, 
గమ్యాల దారులలో విశ్రాంతి కోరి వెన్నెల నగరాన సాగర సమీరాల చల్లని పవనాల మైకంలో ఈ లోకం ఏమారిన వేళ,
చిక్కటి చీకటి పొరలను చాటు చేసుకొని ఎవరూ దరిలేని ఏకాంతాన నిగూఢమైన నిశ్శబ్ధం పురుడోసుకుంది...


కామెంట్‌లు