మనసు పలికే మౌనగీతం (నాలుగో భాగం )-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 ఈ రోజూ అలాగే కూర్చుని ఉన్నాం. అంతలో తాతయ్య "ఓ మాటడుగుతా చెప్పరా దర్శన్ "అన్నాడు. 
"చెప్పండి తాతయ్య "అన్నా. 
"సంతోష్ పెళ్లికి ముందు నుండీ 
నువ్వెందుకో వొత్తిడిగా ఉన్నావు. ఏమైందిరా అందుకే పెద్దలన్నారు జ్యేష్ఠులకు చెయ్యకుండా చిన్నవారికి వివాహo కూడదు అని. "
    "అదేమీ లేదు. నేను బాగానే ఉన్నా "అనేసరికి తాతయ్య నవ్వుతూ "ఒరేయ్ అబద్దాలు నీకు చేత కాదు,మిమ్మల్ని నేను 
పెంచా, ఎప్పుడు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు, 
సంతోష్ కి నీకు మధ్య ఏమైనా.. "అంటున్న తాతయ్య 
ని కంగారుగా ఆపి "అయ్యో, వాడికేం తెలీదు. "అనేసా. 
"అలారా దారికి మరి,నువ్విపుడు క్లూ ఇచ్చి ఏం 
చెప్పకుంటే రాత్రికి నాకు నిద్రరాదు, బిపీ పెరిగిపోద్ది ఆపైన నీ ఇష్టం. ఎందుకొచ్చిన 
బాధ,విషయం చెప్పరా, నేను 
ఖాళీనే కదా నీకు సాయం చేస్తాను,బొత్తిగా లోకం తెలియదు నీకు,నీకోసం ఏమైనా చెయ్యాలని తపనగా 
ఉందిరా !అంటూ కళ్ళొత్తుకుంటూ ఉన్నారు కండువా తో... 
ఇక దాచిలాభం లేదని, సంతోష్ పెళ్లిచూపుల దగ్గరనుండీ మొత్తం చెప్పేశా !
ఇది ప్రేమపెళ్లి కావడం,వాళ్ళ కీ 
మనకీ మధ్యవర్తులెవరూ లేక 
పోవడంతో,వాళ్ళ ఇంటివిషయాలు మనకి పెద్దగా తెలియదు.ఇప్పుడు నువుచెప్పిన అమ్మాయిని నేను కూడా గమనించా,మంచి పిల్ల. 
వితంతువు,టీచర్ గా పని చేస్తుందట,పొందికైన అమ్మాయి. కానీ... ఎందుకురా 
దర్శన్?  నీకు ఇప్పుడయినా మంచి సంబంధాలు బోలెడున్నాయి,నేను కుదుర్చి 
రేపు ఎండాకాలంసెలవుల్లో చేస్తాo అంటున్నాడు తాతయ్య. 
"ఆపండి,నేను ఇంతచెప్పింది మీరు సాయం చేస్తారని,కానీ ఇదా మీరిచ్చే సలహా !"అన్నా కోపంగా. 
   " ఓరి, కోపంవొద్దులేరా,మళ్ళీ సమస్యలు రావొచ్చు,మధ్యలో 
పిల్లడు కూడా ఉండే..అనుభవంతో చెప్పే పెద్ద 
వాళ్ళ మాట వినాలి "
   "ఏంటి మీ అనుభవం?ఒకప్పుడు మీకూతురుకి మంచి 
జీవితం కోసం మళ్ళీ పెళ్లికి మీరు ఎంత ప్రయత్నం చేశారు? 
మర్చిపోయారా, మనకో పద్ధతి 
బైటవాళ్ళ కో న్యాయం చెల్లదు తాతగారూ,నేను పెళ్లo టూ చేసుకుంటే ఆమెనే. తానే నాకు 
సరైన జోడీ అనుకున్నప్పుడు ఆ బిడ్డ పరాయివాడేలా అవుతాడు. మా మొదటిబిడ్డనే 
అనుకోని పెంచుతాను !"స్థిరంగా చెప్పాను. "ఏమో,మీ అమ్మ ని రానివ్వు,తనేం చెప్తుందో ఏమైనా ఇది సమస్యగానే ఉందిరా "అంటూ తాతయ్య లేచి వరండాలో లైట్ వేసి అరచేతులు చూసుకోని కళ్లకు 
అద్దుకొని లోపలకి వెళ్ళాడు. 
   ఇంకో వారానికి అమ్మ వచ్చింది.రోజూ సంతోష్ సౌమ్యల సంగతులు చెప్తూ చాలా హుషారుగా ఉంది అమ్మ.తనవంటలూ,పద్ధతి సౌమ్యకి చాలా నచ్చాయని, కొన్ని వంటలు దగ్గర ఉండి నేర్పించానని చెప్పింది. 
    ఓ రోజు రాత్రి భోజనాలయ్యాక అమ్మ నాగదికి వచ్చింది పడుకున్నావా అంటూ,లేదమ్మా కొద్దిగా పని ఉంటే రాస్తున్న అన్నా. 
  " తాతయ్య నీగురించి చెప్పారు "అంది ముభావంగా 
అమ్మ. 
  "మరి నీ అభిప్రాయాలూ చెప్పమ్మా "అన్నా. 
"ఏమి చెప్పాలి దర్శన్, ఆఅమ్మాయికీ ముప్పై పైనే ఉంటాయి,ఒకటే అయితే సరే.. 
మధ్య పిల్లవాడు కూడా.. ఎటు 
పొయి యెటొస్తుందో.. సమస్యలు వొస్తే ఏమి చేస్తావ్? 
చెప్పు. "ఆగిపోయిo ది అమ్మ 
  " నువ్వేనా అమ్మా, అలా అంటున్నావు,చిన్న వయసులో 
వంటరిగా బ్రతకటానికి తోడు 
లేకుండా ఉండే ధైర్యం నీకు ఉండొచ్చు.. ఇలా అన్నo దుకు 
క్షమించు అమ్మా,నా కెందుకో ఆ
అమ్మాయి హుందాతనం,నెమ్మది నచ్చాయి.చిన్న వయసే కదా.. 
పిల్లవాడున్నాడని జీవితం అలా మోడుగా ఉండాలని ఏముంది, నేను అన్నీ ఆలోచన చేశా, అసలు ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటో తెలియదు.సౌమ్య సంతోష్ ల ద్వారా కొద్దిగా తెలియపరిచాను.ఇక మీరు మాట్లాడటం మంచిది. "అన్నా. 
అమ్మ చాలాసేపు మౌనంగా ఉండి,పాలు తోడు పెట్టాలి "అంటూ లేచి వెళ్లిపోయింది. 
   చాలా నిరాశ అనిపించింది. 
ఇన్నాళ్లు నేనేo కోరుకోలేదు, ఇప్పుడు... ఇప్పటికి నాకు ఈ చిన్న సంతోషం దక్కదా..? ఎలా, ఈ జీవితంలో ఎన్ని మలుపులు,నేను చదివిన కథల్లో సాహిత్యం లో ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు లేదు.. నేను అన్న మాటలకీ అమ్మ అభిమానం దెబ్బతిన్నదా... అయ్యో,భగవంతుడా తల్లిని నొప్పించానా... రాత్రి అంతా 
ఆలోచనలే. 
    యాంత్రికంగా కాలేజీకీ వెళ్లి వస్తున్నా. హఠాత్ గా ఒక ఆదివారం పొద్దున్నే కాలింగ్బెల్ 
మోగుతూ ఉంటే తలుపుతీశా. 
సంతోష్,సౌమ్య ఎదురుగా నవ్వుతూ.. 
  " అరె, రారా లోపలకీ"అంటూ 
బ్యాగ్ లు హాల్లోకి తీసుకొని వెళ్ళా. సౌమ్య కిచెన్ లోకి వెళ్ళింది అమ్మని పలకరింపుకి 
తమ్ముడు షూస్ విప్పుకొని సోఫాలో వెనక్కి వాలి ఉన్నాడు 
కాస్త వొళ్ళు వొచ్చి అందంగా ఉన్నాడిప్పుడు.మనసు నిండిపోయింది నాకు సంతోషంతో. అమ్మని కాఫీ కలపాలని చెప్పాను,అబ్బా లాంగ్ జర్నీ తలనొప్పిగా ఉంది అంటూ తమ్ముడు కాఫీ తాగి 
వాళ్ళగదిలోకి వెళ్ళాడు.
  తాతయ్య కొత్త ధోవతీ,ఖద్దరు 
చొక్కా కండువాలో వచ్చి సోఫా
లో కూర్చుంటూ "అరేయ్, దర్శన్,నువ్వు కూడా రెడీ అవ్వు "అంటున్నారు.
"ఎందుకు "అంటున్న నావైపు 
నవ్వుతూ చూసిన అమ్మ "ఇప్పుడు మనం కవిత వాళ్ళ 
ఇంటికి వెళ్తున్నాము. "అంది. 
"కానీ,కవితని అడిగారాఅసలు"కంగారుగా 
అంటున్న నాభుజం చరిచి 
"అంతా ఓకె రా పిచ్చోడా "అంటున్న తాతయ్య నాకు 
గీతాకారుడిలా కనిపించాడు!
********
      (సమాప్తం )

కామెంట్‌లు