గుఱ్ఱం జాషువ;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 ముక్కుపచ్చలారని పసిపాప విడిచిన, చివరి శ్వాస
నీ అక్షరాలకు అగ్గినంటించి ఆయువు పోసిందేమో తెలియదు...
కుల వివక్ష నీ చేత కలాన్ని పట్టించిందో తెలియదు...
పలువురిలో పంచముడన్న విమర్శ నీ
పదజాలాలకు, పద్య ప్రయోగాలకు బాటలు వేసిందో తెలియదు...
అందుకేనెమో!!
పేదరికం, కులవివక్ష నాకు గురువులంటూ కదిలించే కవిత్వంతో 
దరువుకొట్టి పెత్తందారుల పరువు తీశావు...
సహనమే పెట్టుబడిగా,
పట్టుదలే ప్రయత్నంగా,
జ్వలించి, జయించి చరిత్ర పుటలతో సుచరిత్రగా, 
స్వీయచరిత్రను లిఖించుకున్నావు...
కుల మతాల కుమ్ములాటలే పరువైనప్పుడు...
మంచితనం, మానవత్వమే కరువైనప్పుడు...
కన్నీటి చుక్కల వెచ్చదనాన్నీ,
రక్తపు చుక్కల ఎర్రదనాన్నీ
నీ సిరాకలంలో నింపుకొని
దళితుల వ్యధా కథనాల వృధా జీవితాలను 
కళ్ళకు కట్టినట్టు వర్ణించి, వివరించి, విమర్శించావు...
అవమానాలను, ఛీత్కారాలను పొందిన చోటే సత్కారాలను,
సన్మానాలను స్వీకరించావు...
నాటికి, నేటికి పద్యాలలో ఒదిగి విశ్వనరుడిగా నిలిచావు...కామెంట్‌లు