దాతృత్వం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకప్పుడు రాజులు మాత్రమేకాదు కవులు సామాన్య ప్రజలుకూడా దానధర్మాలు చేసేవారు .సంస్కృతమహాకవి మాఘుడు తనకావ్యం లో తొమ్మిదవ సర్గ రాస్తున్నారు. అవంతిక నగరంనించి ఓబీద బ్రాహ్మణుడు వచ్చి "అయ్యా!నాకూతురి పెళ్ళికి నాకు డబ్బు తగినంతలేదు.మీకు తోచిన సాయంచేయండి"అని దీనంగా అడిగాడు. కవి కూడా బీద వాడే.పేరు ఉంది కానీ డబ్బు లేదు. ఇంట్లో కూడా ఎలాంటి ఖరీదైన వెండి బంగారు వస్తువులు లేవు.పని చేసి అలసిపోయిన భార్య  అన్నంతిని నులకమంచం పై గాఢనిద్ర లో ఉంది. ఆమెచేతికి చెరో బంగారు గాజు మట్టి గాజుల మధ్య తళుక్కున మెరుస్తోంది.ఆమెకి నిద్రాభంగం కలగకుండా మాఘుడు  ఒకచేతి బంగారు గాజు తీసి ఆబ్రాహ్మణునికి ఇద్దామని వెళ్లబోతుండగా భార్య  హఠాత్తుగా అతని చేయిపట్టి ఆపింది. లేచి కూచుని  తన రెండో చెయ్యి కున్న బంగారు గాజు తీసి "ఇదికూడా తీసుకుని  దానంచేయండి"అంది.సంభాషణ విన్న ఆబ్రాహ్మణుడు"స్వామీ!మీరు నాతల్లి దండ్రులతో సమానం. అమ్మ ఒంటిపై సొమ్ము తో  నాకూతురి పెళ్లి చేయలేను.సంఘం నన్ను మాటల్తో కుళ్ళబొడిచినా సరే!నాబిడ్డకి నిండా ఐదేళ్ళు లేవు."అని పోబోతుండగా మాఘుడు ఆయన భార్య  అతన్ని ఓదార్చారు"చూడునాయనా! ఈగాజులవల్ల ఏమీ ఉపయోగం లేదు.అవసరార్ధం  డబ్బు కావల్సినప్పుడు బంగారు నగలు కుదువబెట్టవచ్చు అని ఆడపిల్ల పుట్టగానే చేతులు కాళ్ళ కి మెడలో గొలుసు మురుగులు కాలికి కడియాలు చేయిస్తారు.పెళ్ళికి ఒంటి నిండా నగలు పెట్టడంలోని అంతరార్ధం ఇదే!ఆడపిల్ల కి పురుడు పోయటం పండగపబ్బాలప్పుడు చీర సారె పెట్టడంలో అంతరార్ధం ఇదే"అని నచ్చజెప్పి పంపారు. మరి ఆరోజుల్లో ఆడపిల్ల కి తండ్రి ఆస్తి లో వాటా హక్కు లేదు. పైగా బాల్యవివాహాలు కావటంతో అచ్చట ముచ్చట అని  నగలతో అలంకరించి సాక్షాత్తూ లక్ష్మీ దేవి  ఇంట నడయాడుతోంది అని మురిసిపోయేవారు🌹
కామెంట్‌లు