తాత చేతి కర్ర;---డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు,నెల్లూరు.
 కర్రేగా అని చులకనగా చూడకండి 
దేని విలువ దానికి ఉంటుంది... 
ఖరీదైనదేమీ కాదుగా అని తీసి పడేయకండి,
భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది...
జాగ్రత్తగా చూసుకుంటూ... భద్రంగా దాచుకోండి....
క్షణం తీరిక లేక కష్టపడి,
సంసార నావను ఒడ్డుకి చేర్చి,
సంతతిని వృద్ధి పరిచి,
కష్టసుఖాల, లాభనష్టాల
రుచులను స్వతహాగా అనుభవించి, 
సత్తువ లేని 
శరీరాన్ని మోస్తూ, 
పెరిగిన వయసంత
అనుభవాలను మూటగట్టుకున్న 
మన ఇంటి పాలేరుకు 
మూడో కాలు ఈ చేతి కర్రే...
చేతగానితనాన్ని 
వెక్కిరిస్తూ వెర్రి కుర్రతనం విర్ర 
వీగి పైన పడితే ఆయుధమై పోరాడేది...
సొమ్ములు కూడబెట్టి 
స్పృహ లేక నిద్రపోతే 
సైనిక దళమై లంకంత కొంపను కాపాడేది...
అరుగు మీద కూర్చుని
ఆనవాలు తీస్తూ ఊరి పెద్దయి పెత్తనం చేసేది...
పళ్లెంలో అట్టును 
ఎత్తుకు పోవాలని ప్రయత్నించిన 
దొంగ కాకికి మొట్టికాయ వేసేది...
కుప్పిగంతులేస్తున్న
కోతిమూకల అల్లరిని కట్టడి చేసేది....
వేళ కాని వేళ చప్పున 
లేచి ఎక్కడికి పోవాలి అన్నా తోడుగా సాయమొచ్చేది...
ఉన్నచోట ఊసుపోక కాలు కాలిన పిల్లిలా 
ఊరంతా తిరిగొచ్చేది....
మసకబారిన కళ్ళకు దారి పరుస్తూ
పాదాలతో పరుగులు ముందుకు పెట్టించేది...
అయినవారి నోట మాట పడనీక 
వృద్ధాప్యంలో స్వాభిమానాన్ని కాపాడేది...
కాలం చెల్లి కన్ను మూసేదాక 
ముసలోడికి కాపలాగా ఉండేది...
ఈ చేతి కర్రే... బుర్ర మీసాల తాత చేతి కర్రే...


కామెంట్‌లు