"నేను సరుగుడు చెట్టుని";-- యామిజాల జగదీశ్
 సుప్రసిద్ధ హాస్యనటుడు నాగేష్ ఆత్మవిశ్వాసం గురించి చెప్పిన విలువైన మాటలివి. ఆలిండియా రేడియో వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి.
"మీకు హాస్యనటుడిగా రావలసినంత గుర్తింపు రాకుండా ఇతరులకు ఆ గుర్తింపు లభిస్తున్నప్పుడు మీకెలా అన్పిస్తుంది" అన్నది ఆలిండియా రేడియో వారి ప్రశ్న.
ఇందుకు నాగేష్ చెప్పిన జవాబు....
"నేనందుకు ఏమాత్రం దిగులుపడను సార్. 
ఒక ఇల్లు కడుతున్నప్పుడు పొడవాటి సరుగుడు కర్రలను ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. సరుగుడు కర్రలను ఒకదానికొకటి కలుపుతూ కట్టాక  అడ్డంగా చెక్కలు వేస్తారు. వాటి మీద నిల్చుని కార్మికులు నిర్మాణపనులు చేసుకు పోతుంటారు. భవననిర్మాణమంతా పూర్తయ్యాక చెక్కలను, పొడవాటి సరుగుడు కర్రలను తీసేస్తారు.
ఇక భవన నిర్మాణానికి ఉపయోగించిన  సరుగుడు కర్రలను, చెక్కలను ఎవరి కంటికీ కనిపించనివ్వక తరలించేస్తారు. ఇంకెక్కడో పెరిగిన అరటి చెట్లను వాకిట్లో కట్టి అందరినీ ఆహ్వానిస్తారు. ఆ పచ్చని అరటి చెట్లను చూసి అందరూ ఆహా ఓహో అని చెప్పుకుంటారు.
ఇందులో ఉన్న నిజమేమిటో తెలుసా...
ఆ అరటి చెట్టు గొప్పలు మూడు రోజులే. ఆ తర్వాత వాటిని తొలగించి చెత్తకుండీలో పడేస్తారు. ఆవులూ మేకలూ తినిపోతాయి. 
ఎవరి కంటికీ కనపడనివ్వక తమను ఓ మూలపడేసినందుకు సరుగుడు కర్రలేమీ  కన్నీళ్ళు పెట్టుకోవు. పైగా మరొక భవన నిర్మాణ పనులకు ఉపయోగపడటానికి నవ్వుతూ సిద్ధపడతాయి. 
నేను అరటి చెట్టుని కాను. సరుగుడు చెట్టుని!! నన్ను గుర్తించారా లేదా అనేది పట్టించుకోను. బాధపడను. మరొక సినిమా అవకాశం లభించడంతోనే నటించడానికి నవ్వుకుంటూ ఉషారుగా వెళ్ళిపోతాను. ..."
బాగుంది కదండీ నాగేష్ ఆలోచన. ఆయన చెప్పిన మాటల్లోని నిజాన్ని గ్రహించి
ఎప్పుడూ పాజిటివ్వుగా ఆలోచించడం అలవరచుకోవాలి.
మంచినే తలుద్దాం ! మంచే జరుగుతుంది!!
అదలా ఉంటే, సరుగుడు చెట్ల గురించి ఒకటి రెండు సంగతులు చూద్దాం....సరుగుడు చెట్టు శాస్త్రీయ నామం క్యాజురినా ఈక్విసెటిఫోలియా!  ఆస్ట్రేలియా, భారత దేశం, ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం తూర్పు ఆఫ్రికాలోని ద్వీపాలలో సరుగుడు జాతి చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్టుని ఆస్ట్రేలియన్ పైన్,  ఐరన్‌వుడ్ వంటి పేర్లతోనూ పిలుస్తారు.
ఇది ఒక అలంకారమైన చెట్టు. అధిక నాణ్యత గల కలపను కలిగి ఉంటుంది. దీనిని ఫర్నిచర్, పడవల తయారీకి వాడుతారు.
సేంద్రీయ ఎరువులు లేదా ఖనిజ ఎరువులు  ఉపయోగించి ఈ చెట్లను పెంచవచ్చు. సరుగుడు ప్రతి సంవత్సరం అనేక విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలను సేకరించిన తర్వాత ఆలస్యం చేయకుండా నాటాలి. రెండు వారాలలోపే ఇవి మొలకెత్తుతాయి.

కామెంట్‌లు