ప్రపంచ యాత్రతో చరిత్ర పుటల్లో ఓ మహిళ!;-- యామిజాల జగదీశ్
 ఎనభై రోజులలో ప్రపంచ పర్యటన (Around the world in 80 days) అనే నవలను ఫ్రెంచ్ రచయిత జూల్స్ గాబ్రియల్ వెర్న్  రాశారు. ఇది 1873లో వచ్చిన నవల. ఈ నవలలోని కథానాయకుడి పాత్ర ఇరవై అయిదేళ్ళ నెల్లీ బ్లయ్ ని తెగ ఆకట్టుకుంది. తాను నిజంగానే ప్రపంచ యాత్ర చేయాలనుకుంది. నెల్లీ బ్లయ్ అనేది కలం పేరు. ఈ పేరుతోనే పాఠకులకు పరిచయమైన ఆమె అసలు పేరు ఎలిజబెత్ కొచ్రాన్ సీమన్. విమాన రాకపోకలు లేనిరోజుల్లో కలిగిన తన కోరికను సాధించి  ఓ సాహస యాత్రికురాలిగా ఆమె చరిత్ర పుటలకెక్కడం విశేషం.
ప్రపంచంలో తొలి ఇన్వెస్టిగేటివ్ మహిళా జర్నలిస్టుగా ప్రసిద్ధికెక్కిన నెల్లీ బ్లయ్ కొత్తగా ఏదైనా చేయాలని ఆశ కలిగింది. 
1888లో తాను పని చేసిన న్యూయార్క్ వరల్డ్ పత్రికలో ఎనబై రోజులలోపు ప్రపంచ యాత్ర చేసి ఆ అనుభవాలను రాయాలని ఉందని సంపాదకుడితో చెప్పింది నెల్లీ బ్లయ్. కానీ ఆమె మహిళ కావడంతోనూ ఇంగ్లీషు మాత్రమే తెలియడంతోనూ నెల్లీ బ్లయ్ కోరికను పత్రిక సంపాదకులు నిరాకరిం చారు.
1889లో పత్రిక అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ పర్యటన చేపట్టే ప్రణాళికకు శ్రీకారం చుట్టింది న్యూయార్క్ వరల్డ్. అయితే అప్పటికీ ఓ మహిళ అనుభవాలా అని పెదవివిరిచారు చాలామంది. 
కానీ తన వల్ల ప్రపంచ యాత్ర సాధ్యమే అని నెల్లీ బ్లయ్ చెప్తూ ఓ సవాల్ విసిరింది.
ఎట్టకేలకు నెల్లీ బ్లయ్ కి ఆ అవకాశం లభించింది.
ఓ చిన్నపాటి లగేజీతో ఆమె ప్రపంచయాత్రకు బయలుదేరింది. తన సంచీలో ఓ ఫ్లిస్కు, ఓ కప్పు, తలకు చుట్టుకునే వస్త్రం, కొన్ని జతల దూస్తులు, కొన్ని రుమాళ్ళు, ఓ జత తెప్పులు, సూది, దారం, పెన్ను, ఓ నోటుబుక్కు సర్దుకుని బయలుదేరింది.
ప్రపంచ యాత్రకు చరిత్రలో గుర్తుండిపోయేలా తన సాహసయాత్రకు 1889 నవంబర్ 24వ తేదీన శ్రీకారం చుట్టింది నెల్లీ బ్లయ్. డెబ్బయ్ అయిదు రోజులలోనే తన ప్రపంచ పర్యటనను పూర్తి చేయాలనుకుని బయలుదేరింది. 
మొదటిసారిగా నౌకలో ప్రయాణాన్ని చేపట్టడంతో ఆమెకు వాంతులయ్యాయి. 
అయినా అట్లాగే ప్రయాణాన్ని కొనసాగించి తన ప్రయాణానికి కారణమైన Around the world in 80 days పుస్తక రచయిత జూల్స్ వెర్న్ ని ఫ్రాన్సులో కలిసి విషయం చెప్పారు. అంతేకాక ఆ రచయిత ఆశీర్వాదాలు పొందిన బ్లయ్ నౌక, రైలు, కారు ఇలా రకరకాల వాహనాలలో ప్రయాణం చేస్తూ ముందుకు సాగారు. కొన్ని చోట్ల ఆమె రిక్షా, గుర్రం, గాడిదపైకూడా ప్రయాణం చేసింది.
కాస్మోపోలిటన్ అనే పత్రిక నుంచి ఎలిజబెత్ అనే మరొక మహిళా రచయితకూడా బ్లయ్ కి పోటీగా ప్రపంచ యాత్రను మొదలుపెట్టింది. కానీ ఈ విషయం బ్లయ్ కి తెలీదు. ఆమె హాంకాంగ్ చేరుకున్నప్పుడు ఇక్కడికి మూడు రోజుల క్రితమే ఎలిజబెత్ బిస్లాండ్ వచ్చి వెళ్ళిందని ఒకరు బ్లయ్ తో చెప్పారు.
అయితే బ్లయ్ "నేను ఒకరితో పోటీకోసం ఈ యాత్ర చేరడం లేదు. డెబ్బయ్ అయిదురోజులలోపు ప్రపంచ యాత్రను పూర్తి చేయాలనే లక్ష్యంతో చేపట్టాను ఇప్పటికే అరవై రోజులు పూర్తయ్యాయి" అని చెప్పింది.
ఆయా ప్రదేశాలలో ఆమె తన యాత్రారచనకు ఉపయోగపడుతాయను కున్న విషయాలను నోట్ బుక్కులో రాసుకుంటూ సాగిన బ్లయ్  వాటిని తను పని చేసే పత్రికకు పంపుతూ వచ్చింది. ఆమె రాసిన వాటికి పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆమె విజయవంతంగా అమెరికా చేరుకుంది. ఆమెకు అన్ని వర్గాలవారు ఘనస్వాగతం పలికారు.
1890 జనవరి 25వ తేదీన ప్రపంచ యాత్రను ముగించిన బ్లయ్ మొత్తంమీద  72 రోజుల ఆరు గంటలు పర్యటించారు.
జూల్స్ వెర్న్ నవలలోని కథానాయకుడు ఎనభై రోజులు పర్యటిస్తే బ్లయ్ డెబ్బయ్ రెండు రోజులలోనే ప్రపంచ పర్యటనను పూర్తి చేయడం రికార్డయింది. ఆమెతో పోటీ పడిన ఎలిజబెత్ బిస్లాండ్ మరో నాలుగు రోజుల తర్వాత తన పర్యటననం ముగించింది.
72 రోజులలో ప్రపంచ వర్యటన పేరుతో నెల్లీ బ్లయ్ రాసిన పుస్తకానికి మంచి ఆదరణ లభించింది. 
మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆమె సెర్బియా - ఆస్ట్రేలియాకు మధ్య ఉన్న ప్రాంతం నుంచి వార్తలు రాసిన తొలి విదేశ మహిళగా చరిత్రపుటలకెక్కిన నెల్లీ బ్లయ్ వివాహానంతరం ఓ పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు.
1913లో ఓటు హక్కుకోసం మహిళలు జరిపిన ఉద్యమం గురించి ఆమె రాసిన వ్యాసంతోనే అమెరికాలో మహిళలకు ఓటుహక్కు కల్పించడానికి ఓ ముఖ్యకారణమైందని చెప్పుకునేవారు.

కామెంట్‌లు