మాటే మంత్రం..!;-` బోగా పురుషోత్తం.

  పూర్వం ఓ చిట్టడవిలో ఓ చిట్టెలుక నివసించేది. అది తన పిల్లలతో కలిసి కలుగులో వుండేది.
   పక్కనే ఓ చెట్టు వుండేది. ఆ చెట్టు తొర్రలో ఓ పిట్ట నివసించేది. ఆ పిట్ట దూరంగా వెళ్లి ధాన్యపు గింజలు తెచ్చి తన పిల్లలకు ఇచ్చేది. ఎలుక దీన్ని చూసింది. ఆ ధాన్యపు గింజల్ని కాజేసి తన పిల్లలకు పెట్టసాగింది. వృద్ధాప్యం సమీపిస్తున్న  ఎలుకకు బద్దకం ఎక్కువైంది. ఆహారం కోసం బయటకు వెళ్లడం మానేసింది. పిట్ట బయటకు వెళ్లినసమయం చూసుకుని ఆహారం అంతా నోటితో తీసుకెళ్లేది.
   ఆహార అన్వేషణకు వెళ్లిన పిట్ట తన గూటిలో ఆహారం లేకపోవడం  చూసి చింతించేది. 
    ఓ రోజు చెట్టుపై నక్కి దొంగ ఎవరా అని గమనించసాగింది పిట్ట. తన ఇంట్లోకి ఎలుక వచ్చి ధాన్యాన్ని తీసుకెళ్లడం చూసింది. ఆగ్రహంతో ఎలుకపై ‘‘ ఇలా చేస్తే ఎలా..?’’ అని చిందులు తొక్కింది.
     అక్కడి నుంచి అడుగు ముందుకు వేయలేకపోయింది ఎలుక. ‘‘ నేను వృద్ధాప్యంలో వున్నాను.. ఎక్కడికీ వెళ్లలేను.. ఇలా తిండి గింజలను తస్కరించడం తప్పే.. నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.. కాస్త దయదలచి ప్రాణ భిక్ష పెట్టండి..ఆపద సమయంలో ఆదుకుంటాను..’’ అని మాట ఇచ్చింది.
     పిట్ట జాలిచూపి వదిలేసింది. ఆ రోజు నుంచి పిట్ట తెచ్చిన ఆహారాన్ని ఎలుక పిల్లలు కూడా తినసాగాయి. పిట్ట దీన్ని చూసీచూడనట్లు వుండిపోయింది.
    ఓ రోజు పిట్ట ఆహారం కోసం దూర ప్రాంతానికి వెళ్లింది. దాని పిల్లలు అప్పుడే రెక్కలు రావడంతో గూటి నుంచి ఎగిరి బయటకు వెళ్లసాగాయి. ఇది గమనిస్తున్న ఓ వేటగాడు గింజలు చల్లి చెట్టు వెనుక దాక్కుని చూడసాగాడు. దీన్ని గమనిస్తున్న ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి చూడసాగింది. 
      గింజల కోసం పిట్ట పిల్లలు నేలమీద వాలాయి. వేటగాడు వల విసిరాడు. పిట్టలు వలలో చిక్కుకుని విలవిలలాడాయి.   
పైకి లేవలేక కిందపడిపోయాయి. దూరంగా నిల్చొన్న వేటగాడు పరుగున వచ్చి వలను చేతికి తీసుకున్నాడు.  అదే సమయానికి అక్కడికి వచ్చిన పిట్ట తన పిల్లలు వలలో చిక్కుకుని ఆపదలో వున్న సంగతిని పసిగట్టింది. ఏమి చేయాలో తెలియక దిక్కులు చూడ సాగింది. ఆలస్యం  చేయకుండా ఎలుక తన తెలివిని ఉపయోగించి వేటగాడు వెళుతున్న దారిలోనే వెళ్లింది. వేటగాడు కొంత దూరం వెళ్లి వలను కింద దించాడు. పిట్టలను కాల్చి ఆరగించడానికి పెద్దపెద్ద కట్టెపుల్లలను తీసుకొచ్చి మంట పెట్టాడు. బాగా రగిలిన తర్వాత ఎలుక ఓ చిన్న కట్టెను నోట పట్టుకొచ్చి వలకు అంటించింది. వల తెగిపోయింది. పిట్టలు ఆనందంగా బయటకు ఎగిరి వచ్చేశాయి. అదే సమయానికి వలలో వున్న పిట్టల్ని తీసుకోవడానికి వల వద్దకు వచ్చాడు. అప్పటికే వల తెగిపోయి పిట్టలు ఎగిరిపోవడం చూసి ఏమి జరిగిందా? అని  నిరాశతో చూస్తూ కూలబడ్డాడు.
      దూరం నుంచి దీన్ని గమనిస్తున్న పిట్ట ఎలుక దగ్గరకు వచ్చి ‘‘ నీ మేలు జన్మలో మరిచిపోలేను..తిండి తస్కరిస్తున్నావని  నిన్ను అనవసరంగా తిట్టాను.. క్షమించు.. అప్పుడు ఆదుకుంటానని నువ్విచ్చిన మాటే నేడు మంత్రంలా పనిచేసి నా పిల్లలు నాకిప్పుడు దక్కారు.. లేదంటే జీవితాంతం కుమిలిపోవాల్సి వచ్చేది..’’ అని కంట తడి పెట్టింది పిట్ట.
   ‘‘ సరే.. నువ్వు కూడా తిండి లేక అలమటిస్తున్న నా పిల్లలకు తిండిపెట్టి ఆకలి తీర్చావు..ఆ నాడు నీకిచ్చిన మాట ప్రకారం  సాయం  చేశాను.. ఇప్పుడు సమయంలేదు.. ప్రమాదం ముంచుకొస్తోంది..ఆ వేటగాడు మన దగ్గరికి రాకముందే వెళ్లి తప్పించుకుందాం..రా .. ’’ అని హెచ్చరించింది ఎలుక.
    ఎగురుతున్న తన పిల్లలను తన మీద ఎక్కించుకుని రివ్వున ఆకాశంలోకి ఎగిరి వేటగాడి ముప్పునుంచి తప్పించుకుని తన నివాసం చెట్టుపై గూడు వద్దకు చేరింది పిట్ట. ఎలుక కూడా వడివడిగా పరిగెత్తి తను నివసిస్తున్న చెట్టు వద్ద కలుగులోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది.

     
కామెంట్‌లు