సంగీత దర్శకుడు జి. రామనాథన్;-- యామిజాల జగదీశ్
 జి. రామనాథన్ - తమిళ సినిమా చరిత్రలో సంగీత దర్శకుడిగా ఓ ప్రత్యేక స్థానం గడించారు.  సంగీత మేధావిగా, సంగీత చక్రవర్తిగా పేరుప్రఖ్యాతులు పొందిన జి. రామనాథన్ ని అందరూ "జి.ఆర్." అని పిలిచేవారు.
తమిళ సినిమా ప్రపంచంలో గొప్ప నటుడిగా ఖ్యాతి చెందిన ఎం.కె. త్యాగరాజ భాగవతార్ చిత్రాలకు, సేలంకు చెందిన మోడర్న్ థియేటర్స్, కోయంబత్తూర్ సెంట్రల్ స్టూడియోస్ వంటి మేటి సంస్థలు నిర్మించిన చిత్రాలకు సంగీతం స్వరపరచిన వ్యక్తిగా అందరి మన్ననలందుకున్న జి. ఆర్. 1950లలో విడుదలైన శివాజీ గణేశన్, ఎంజిఆర్ వంటి అగ్రశ్రేణి హీరోల సినిమాలకు జి.ఆర్. సంగీతదర్శకత్వం వహించారు.
తమిళనాడులోని తిరుచ్చి సమీపాన గల పిచ్చాండార్ కోవిల్ అనే ఊళ్ళో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జి. రామనాథన్ తండ్రి గోపాలసామి అయ్యర్ ఇండియన్ రైల్వేస్ లో పని చేశారు. 
అయిదో తరగతి వరకే చదువుకున్న జి. ఆర్. 1942లో పెళ్ళి చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు. సత్యసాయిబాబా మీది భక్తితో వారికి సాయి, బాబా అనే పేర్లు పెట్టారు.
పద్దెనిమిదో ఏట భారత గాన సభ అనే నాటక బృందంలో హార్మోనియం వాయించేందుకు చేరారు. అనంతరం సుప్రసిద్ధ వి.ఎ. చెల్లప్పా నాటక బృందంలో హార్మోనియం వాయించడంతోపాటు నేపథ్యగాయకుడిగా పాటలు పాడారు.
1932లో కలకత్తాలో నిర్మించిన కాలవరిసి అనే తమిళ సినిమాకు మొదటిసారిగా ఓ వాయిద్యాన్ని వాయించారు.
1938లో ఎం.కె. త్యాగరాజ భాగవతార్ నటించి నిర్మించిన సత్యశీలన్ అనే సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 
ఆయిరం తలై వాంగియ అపూర్వ చింతామణి అనే సినిమాలో సన్యాసి పాత్రలో నటించిన జి. ఆర్. శాస్త్రీయబద్ధంగా కర్నాటక సంగీతం నేర్చుకున్న వారు కాదు.కానీ వినికిడి జ్ఞానంతోనూ, శాస్త్రీయ సంగీతం పట్ల ఉన్న మక్కువతోనూ స్వరాలు సమకూర్చే శక్తిని సమకూర్చుకున్నారు.
ఆయన సంగీతం సమకూర్చడం మొదలుపెట్టిన 1940లలో తమిళనాట సినిమాలలాగే నాటకాలుకూడా ఎక్కువగా ప్రదర్శిస్తుండేవారు. కనుక ఈ రెండింట్లోనూ ఆయన సంగీతం సమర్పిస్తుండేవారు. 
ఆయన సంగీతం సమకూర్చిన రోజుల్లో కర్నాటక సంగీత బాణీనే అనుసరించేవారు. 
అయినప్పటికీ సినిమా సంగీతాన్ని శాస్త్రీయ సంగీతానికి సమానంగా భావించేవారు కాదు. అయితే ఈ అభిప్రాయం సరికాదనే రీతిలో ఎం.కె. త్యాగరాజ భాగవతార్ నటించిన హరిదాస్ చిత్రంలో మన్మధ లీలయై వెండ్రార్ ఉండో ....అనే పాటకు జి.ఆర్ సమకూర్చిన సంగీతం శాస్త్రీయ సంగీతాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించినదే అని అనుకునేవారు.
జి.ఎన్. బాలసుబ్రమణ్యం, ఎం.ఎల్. వసంతకుమారి, మహారాజపురం విశ్వనాథ అయ్యర్ గాత్రం అంటే ఎంతో ఇష్టమున్న జి.ఆర్. కి హిందీ సంగీతదర్శకుడు నౌషాద్ సంగీతంపట్ల ప్రత్యేక అభిమానముండేది. 
తన సంగీత దర్శకత్వంలో పాడిన ఎస్. వరలక్ష్మి, జిక్కి స్వరాలంటే ఆయనకు మహాప్రియం. అలాగే త్యాగరాజ భాగవతార్ గొంతంటేనూ చాలా చాలా ఇష్టం.
జి.ఆర్. ఓ మంచి గాయకుడు కూడా. తన సంగీతదర్శకత్వంలో రూపొందిన పొన్ముడి సినిమాలో టి.వి. రత్నంతో కలిసి పాడిన జి.ఆర్.  "అల్లి పెట్ర పిళ్ళై" అనే సినిమాలోనూ పాట పాడారు. ఈ సినిమాకు కె.వి. మహదేవన్ సంగీతదర్శకత్వం వహించారు.
జి.ఆర్. తాను సంగీతం సమకూర్చేముందర గాయనీగాయకులెంతటివారైనా వారికి ఎలా పాడాలో వివరించేవారు.
పుదుయుగం అనే సినిమాను నిర్మించిన జి.ఆర్. సంగీతం సమకూర్చిన ఆఖరి చిత్రం - దైవత్తిన్ దైవం.
 
అరుణగిరినాథర్ అనే సినిమాకు సంగీతదర్శకత్వం వహిస్తున్న రోజుల్లో గుండెపోటుతో మరణించారు జి.ఆర్. అనంతరం ఈ సినిమాకు టి.ఆర్ పాపా సంగీతం సమకూర్చారు. 
 
హరిహరమాయా, పరశురామర్, ఆర్యమాలా, శివకవి, తూక్కి తూక్కి, వీరపాండియ కట్టబొమ్మన్ వంటి ఎన్నో మేటి చిత్రాలకు సంగీతం సమకూర్చిన జి.ఆర్ సంగీత బాణీ చిరస్మరణీయమే.
కైరో, ఆఫ్రికా, ఆసియా చలనచిత్రోత్సవాలలో ఉత్తమ నటుడిగా శివాజీగణేశన్  (వీరపాండియ కట్టబొమ్మన్) ని సత్కరించినవారు మేటి సంగీత దర్శకుడిగా జి. ఆర్ నికూడా ఘనంగా సన్మానించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ భారత దేశ పర్యటనకు వచ్చినప్పుడు జి. రామనాథన్ ని గౌరవించేరీతిలో ఓ వెండి వీణను బహుమతిగా అందించడం విశేషం.కామెంట్‌లు