కళ్ళు తెరచిన పిల్ల!;-- యామిజాల జగదీశ్
 తెల్లవారుజాము ఎలా ఉంటుందో ఆ  ఎలుగుబంటి పిల్లకు తెలీదు. ఆరోజు పొద్దున్నే లేచిన ఆ పిల్ల ఎలుగుబంటి ఈ సమయంలో ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయింది.
రోజూ అర్ధరాత్రి వరకూ నిద్దరపోకుండా మొబైల్ ఫోన్లో గేములు ఆడుకున్న తర్వాత పడుకోవడంవల్ల పొద్దున్న మేల్కోవడం కుదరడం లేదు. 
ఈ అలవాటుని మార్చాలని ఆ పిల్ల ఎలుగుబంటి తల్లి ప్రయత్నించింది.  కానీ కుదరలేదు.
 కానీ ఈరోజు తనంతట తానే పిల్ల ఎలుగుబంటి నిద్ర లేచింది పొద్దున్నే.
తన తల్లితో కలిసి నడవటం మొదలుపెట్టింది. 
మంచుబిందువులు చెట్లపై దట్టంగా ఉన్నాయి. సన్నటి సూర్యుడి కిరణాల తాకిడితో మంచు బిందువులు కరుగుతున్న దృశ్యం మనసుని ఎంతగానో ఆకర్షించింది.
పక్షులు గుంపు గుంపులుగా ఆహారంకోసం బయలుదేరాయి. అలా బయలుదేరిన పక్షుల గుంపుల దృశ్యం మరీ మరీ అందంగా ఉంది.
 తల్లి ఎలుగుబంటి, పిల్ల ఎలుగుబంటి అక్కడక్కడ దొరికిన పండ్లను తింటూ నడుస్తున్నాయి ఉడుతకు కృతజ్ఞతలు చెప్పుకుని.
పిల్ల ఎలుగుబంటికి ఈ పొద్దు దృశ్యాలు ఎంతగానో నచ్చాయి.
దారిలో బోలెడన్ని విత్తనాలు కనిపించాయి.
"అమ్మా, ఎందుకిన్ని విత్తనాలు పడి ఉన్నాయి?" అని అడిగింది పిల్ల ఎలుగుబంటి.
"చెట్లు లేక అడవి లేదు. అడవి లేకుంటే జంతువులు లేవు. పక్షులు లేవు. క్రిమికీటకాదులు లేవు. ఇంకొన్ని సంవత్సరాలకు వయస్సు నిండిన చెట్లు కూలిపోతాయి. వాటి స్థానంలో కొత్త చెట్లు వస్తేనే మనకు మంచిది. కనుక అడవి అంతటా విత్తనాలు నాటే పనులు మొదలుపెడతాం. ఈ విత్తనాలు మొలకెత్తితే మనకే సమస్యా రాదు" అంది తల్లి ఎలుగుబండి విపులంగా.
"ఇన్ని విషయాలున్నాయా అడవిలో. నాకెందుకీ విషయాలు తెలీలేదు?" అని బాధపడింది పిల్ల ఎలుగుబంటి.
"నువ్వు ఎప్పుడుచూడూ మొబైల్ ఫోనుతోనే గడుపుతావు. అందుకే నీకు అడవి విషయందాకా ఎందుకూ మన ఇంటి విషయాలే నీకు తెలీదు" అంది తల్లి ఎలుగుబంటి.
"ఏంటమ్మా చెప్తున్నావు?" అడిగింది పిల్ల ఎలుగుబంటి.
"అందరూ అత్యవసరానికి ఫోన్ వాడుతారు.  కొందరు విజ్ఞానానికోసం ఫోన్ వాడుతారు. కొందరు కాలక్షేపానికి వాడుతారు. కానీ నువ్వున్నావు చూసావు...నీకు ఈ ఫోనే ప్రపంచం. నీకెంత చెప్పినాళమ అర్థం కావడం లేదు. అందుకే నీకు నిజ జీవితం గురించి ఏమీ తెలియడం లేదు. ఇకనుంచైనా అవసరానికి మాత్రమే ఫోన్ ఉపయోగించు. అప్పుడే నీకు మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుస్తుంది" అంది తల్లి ఎలుగుబంటు.
అప్పుడు పిల్ల ఎలుగుబంటి "అయ్యో...ఇప్పుడే నాకర్థమైంది. ఇకమీదట అవసరానికి తప్ప మొబైల్ ఫోను ఉపయోగించను" అని చెప్పింది.
"చనిపోయిన జంతువుల చర్మాలను సేకరించి ఉంచాను. వాటిని ఆ జింకలకు ఇస్తావా?" అడిగింది తల్లి ఎలుగుబంటి.
“ఇప్పుడే తీసుకొచ్చి వాటికిస్తానమ్మా" అన్నది పిల్ల ఎలుగుబంటి.
"ఇంతలో నేనూ నీతో వస్తాను" అని ఓ చెట్టుకొమ్మ మీదున్న ఉడుత దాని మాట విని.
పిల్ల ఎలుగుబంటి, ఉడుత వాటిని తీసుకువెళ్ళి ఇవ్వడంతోనే జింకలు ఆనందంతో ఆందుకుని కృతజ్ఞతలు చెప్పాయి.

కామెంట్‌లు