"బతికుంటే....";-ఎం బిందుమాధవి
 పింకీ కి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. డాక్టర్ రావటం ఆలస్యం అయిందని మృదుల కంగారు పడుతున్నది.
మరొక కేసులో ఉన్నారని, వచ్చేస్తారని మృదులకి నచ్చచెబుతున్నది నర్స్.
డాక్టర్ శాంత వచ్చి పింకీని వెంటనే లేబర్ రూంకి తరలించి, డెలివరీ చెయ్యటానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది.
పింకీ తను ఉద్యోగం చేసే చోట బెంగళూరులో రెగ్యులర్ గా చూపించుకునే డాక్టర్ ప్రియంవద తన ఫ్రెండ్ శాంత హైదరాబాద్లో ఉంటుందని, కంగారు పడక్కరలేదని, అక్కడికి వెళ్ళమని చెప్పింది. ఆవిడ హస్తవాసి చాలా మంచిదని కూడా చెప్పింది.
అందుకే తమ ఇంటికి కొంచెం దూరమైనా ఇక్కడికే వచ్చారు మృదుల, పింకీ.
"ఆడపిల్లండి. బొద్దుగా, ముద్దుగా ఉంది" అంటూ చేతులు తుడుచుకుంటూ బయటికొచ్చి చెప్పింది డాక్టర్ శాంత.
మృదులని అప్పుడే చూస్తున్న డాక్టర్ శాంత "మిమ్మల్ని ఎక్కడో  చూసినట్టుందండి. బాగా ఆత్మీయమైన వారిని చూసినట్టుంది" అన్నది. "మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా నా దగ్గరకి వచ్చారా" అన్నది.
పురిటికి వచ్చిన పింకీని, డాక్టర్ విజిట్ కి అల్లుడు వికాస్ తీసుకెళ్ళటంతో, మృదుల ఈ రోజే మొదటి సారి ఆ హాస్పిటల్ కి వచ్చింది.
"లేదమ్మా! నాకూ  మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తోంది. చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. అందుకే చాలా మందిని కలిసినప్పుడు ఎక్కడో చూశామన్న భావన కలుగుతుంది. ఏ బస్సుల్లోనో, ఫంక్షన్స్ లోనో కలిశామేమో" అన్నది.
"కాదాంటీ...నాకు ఆంటీ అనాలనిపించింది, ఏమి అనుకోరు కదా!" ...అని "మిమ్మల్ని చూస్తే అంతకంటే దగ్గర వారిలాగా అనిపిస్తోంది" అన్నది.
ఇలా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళి మనవరాలిని చేతుల్లోకి తీసుకుంటూ..."మీకు ధన్యవాదాలమ్మా! తొమ్మిది  నెలలు బెంగుళూరు లో చూపించుకున్నాక ఇప్పటికిప్పుడు డెలివరీకి కొత్త డాక్టర్ అంటే భయపడ్డాం! నా మాట ఎలా ఉన్నా మా అమ్మాయి చాలా భయపడింది. మీ ఫ్రెండ్ చెప్పినట్టు మీ చేతి చలవ, నార్మల్ డెలివరీ చేసి నాకో బుజ్జిబంగారాన్ని చేతికిచ్చావు" అన్నది మృదుల అభినందన పూర్వకంగా చూస్తూ.
"ఆ:( గుర్తొచ్చింది ఆంటీ! నేను ఇక్కడే సెయింట్ ఆన్స్ స్కూల్లో టెంత్ చదువుతున్నప్పుడు, నా జీవితంలో జరగబోయిన ఒక ప్రమాదం నించి నన్ను కాపాడి, నాకు పునర్జన్మనిచ్చిన వ్యక్తి మీరు. అప్పుడు మీ అమ్మాయిని...ఆ:( ఈ పింకీయే అయ్యుంటుంది... తీసుకెళ్ళటానికి  స్కూల్ కి వచ్చారు. అప్పుడు మా వంక పరిశీలనగా చూశారు. మళ్ళీ రాత్రి 7.30 కి పాలు కొనటానికి సూపర్ బజార్ కి వచ్చారు. అప్పుడు.... గుర్తొచ్చిందా....నేను, మా ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాలకి అడ్డం పడబోతే, చెంప దెబ్బ కొట్టి కాపాడారు. నా అప్పటి ఫ్రెండే బెంగుళురులో మీ అమ్మాయిని చూసిన డాక్టర్ ప్రియంవద."
"మా ఈ జన్మ మీరు పెట్టిన భిక్షే ఆంటీ! మా జీవితంలో మీరెప్పుడైనా మళ్ళీ కలుస్తారో లేదో అనుకున్నాం. మీ ఋణం తీర్చుకునే అవకాశం భగవంతుడు ఇలా ఇచ్చాడు" అని వంగి మృదుల కాళ్ళకి నమస్కారం పెట్టింది పేరు మోసిన గైనకాలజిస్ట్ డాక్టర్ శాంత.
బట్టలు మార్చుకుని, పింకీకి, బుజ్జమ్మకి కావలసిన వస్తువులు తీసుకెళ్ళటానికి ఇంటికొచ్చిన మృదులకి, 'యాదృచ్ఛికంగా తన సహాయం పొందిన అమ్మాయిలు పెద్ద చదువులు చదివి మళ్ళీ తనకి తారసపడటం తల్చుకుంటే ఆశ్చర్యం, ఆనందం కలిగి గతం కళ్ళ ముందు కదిలింది.
@@@@@
మృదుల పింకీ ని తీసుకురావటానికి స్కూల్ కెళ్ళింది.
"అమ్మా ఈ రోజు రాను. ఎలాగోలా ఒక్క రోజు మీరే పాపని స్కూల్లో దింపి తీసుకురండి. రేపు ఖచ్చితంగా వచ్చేస్తాను" అన్నాడు భిక్షపతి.
పొద్దున పింకీని స్కూల్లో శ్యాము దింపారు. ఈ పూట పికప్ చేసుకునే డ్యూటీ మృదులది.  ఆఫీస్ నించి త్వరగా వచ్చి స్కూల్ కి వెళ్ళింది.
అప్పటికే స్కూల్ వదిలి పావు గంట అయినట్టుంది. పిల్లలని ఎక్కించుకుని ఆటోల వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యారు. పికప్ చేసుకోవటానికొచ్చిన తల్లిదండ్రులు కూడా ఇంటికెళుతూ కనిపించారు.
లేటయిందని కంగారుగా స్కూల్ కాంపౌండ్ లోకొచ్చిన మృదులకి ఇద్దరు అమ్మాయిలు...బహుశ టెంత్ క్లాస్ అయ్యుంటారు... ఎదురొచ్చారు.
ఒకరి భుజాల మీద ఒకరు చేతులేసుకుని, తలొంచుకునే ఓరగా, తమనెవరైనా గమనిస్తున్నారేమో నన్నట్టుగా అటు ఇటు సందేహంగా చూస్తూ రహస్యంగా, గుస గుసగా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.
మృదుల ఆలస్యమయిందని, కంగారుగా పెద్ద పెద్ద అంగలేస్తూ నడుస్తున్నది. ఆ అమ్మాయిలని చూసింది  గానీ అంతగా వారిని పట్టించుకోలేదు.
క్లాస్ రూం దగ్గరకి వెళ్ళి పింకీ బ్యాగ్ భుజానికి తగిలించుకుని, పింకీని చేత్తో పట్టుకుని బయటికొచ్చి స్కూటీ మీద కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తూ ఇంకా అక్కడే తచ్చాడుతున్న ఆ అమ్మాయిలని మళ్ళీ చూసింది.
వాళ్ళు మాట్లాడుకుంటూ తమనెవరూ గమనించట్లేదనుకుని, ఓ మూల చెట్టు కింద కూర్చున్నారు. 'ఏమిటి వీళ్ళు..ఇంటికెళ్ళే ఆలోచన లేనట్లు తీరుబడిగా చెట్టు కింద కూర్చున్నారు' అనుకుంటూ మృదుల 'లేటయితే పింకీకి ఆకలేస్తుంది' అనుకుని స్కూటీ పోనిచ్చింది.
@@@@@
పింకీ స్కూల్ కి హడావుడిగా బయలుదేరిన మృదుల వంట గది కిటికీ వెయ్యటం మర్చిపోయింది. పిల్లి పాలు తాగేసింది. మరునాడు పెరుగుకి ఇబ్బంది అవుతుందని రాత్రి 7.30 కి స్కూటీ వేసుకుని దగ్గరున్న సూపర్ బజార్ కి వెళ్ళింది.
దారిలో లెవెల్ క్రాసింగ్ గేట్ దగ్గర స్కూల్ దగ్గర కనిపించిన అమ్మాయిలు కనిపించారు. చుట్టూ చూసుకుంటూ గబ గబా పట్టాలకేసి పరుగులాంటి నడకతో వెళుతున్నారు.
ఏం జరగబోతున్నదో ఊహించిన మృదుల క్షణం ఆలస్యం చెయ్యకుండా ఒక్క ఉదుటున వాళ్ళ దగ్గరకెళ్ళి భుజం పుచ్చుకు లాగి, చెంప మీద ఒక్కటేసింది. ఈ అనూహ్య పరిణామానికి బెదిరిపోయిన ఆ పిల్లలు పెద్దగా ఏడుపు మొదలుపెట్టారు.
వెన్ను నిమిరి, పక్క షాపులో ఒక వాటర్ బాటిల్ కొని వారి చేత నీళ్ళు తాగించి పక్కకి తీసుకొచ్చి ప్లాట్ఫార్మ్ బెంచి మీద కూర్చోబెట్టి, "ఆ:( ఇప్పుడు చెప్పండి. మీరు ఎందుకు చావాలనుకుంటున్నారు? ఈ వయసులో హాయిగా చదువుకుని పైకి రావలసిన పిల్లలు ఈ పనులేంటి? లవ్వా? ఇంట్లో వాళ్ళు కోప్పడ్డారా" అని అనునయంగా అడిగింది.
"రోజూ స్కూల్ కి వచ్చేటప్పుడు ఎవడో మా  వెంటపడి ఏడిపించి, డ్రెస్...జడలు లాగి, అల్లరిపెడుతున్నాడు. రేపటి లోపు ప్రేమిస్తున్నానని చెప్పకపోతే తన రౌడీ ఫ్రెండ్స్ తో వచ్చి యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు" అని చెప్పారు.  "మా నాన్న  కోపిష్టి.  మా అమ్మ గట్టిగా మాట్లాడలేదు. ఇలా అల్లరి పెడుతున్నారని తెలిస్తే మా నాన్న నన్నే తప్పు పట్టి కేకలేస్తారు. అందుకే భయంతో చచ్చిపోవాలనుకుంటున్నాం" అని అందులో ఒకమ్మాయి చెప్పింది. 
మృదుల వాళ్ళని తన ఇంటికి తీసుకొచ్చి అనునయించి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది. వచ్చే ఆగస్ట్ 15 కి స్కూల్లో టీచర్ ఏదో పని చెప్పటం వల్ల వీరికి అక్కడే ఆలస్యమయింది. చీకటి పడిందని తను వెంటపెట్టుకొస్తున్నానని చెప్పింది.
దారిలో వాళ్ళకి భయం పోగొట్టటానికి కబుర్లు చెబుతూ..."పిల్లలూ మీకు రామాయణం తెలుసా. ఆంజనేయ స్వామి లంకలో సీతా దేవిని వెతికేటప్పుడు ఆవిడ ఎంతకీ కనిపించక పోయేసరికి చాలా దిగులు పడ్డాడు. మనందరం ఆంజనేయ స్వామి చాలా గొప్పవాడనీ, ఆయన శ్లోకాలు చదివితే భయం పోతుందనీ..బుద్ధి బలం పెరుగుతుందనీ, ఎంతటి వారినైనా తన తోకతో కొడతాడనీ అనుకుంటాం! అంతటి గొప్ప ఆయనకి కూడా ఒక సారి దిగులు కలిగింది."
"చాలా వెతికేశాక ఇక సీత కనిపించదు అనుకుని, అలా వెనక్కి వెళ్ళిపోతే రాముడికి, సుగ్రీవుడికి, తన ఇతర మిత్రులకి, పెద్దలకి మొహం ఎలా చూపించాలి అని చాలా దిగులుపడ్డాడుట. సీత కనిపించలేదని చెబితే రాముడు ప్రాణం వదిలేస్తాడేమో ...ఇప్పుడెలా..ఎలా అని  ఆయన కూడా మీ లాగే ఆత్మ హత్య చేసుకుందామనుకున్నాడు."
"బతికుంటే బలుసాకు తినచ్చు..ఎప్పటికైనా సీతని చూడచ్చు, ఏదయినా సాధించచ్చు. ఆత్మహత్య మహా పాపం.
' వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి...
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః ' "
అనుకుని తను తిరిగి కిష్కింధకి వెళ్ళకుండా ఆ లంకలోనే ఉండి మళ్ళీ మళ్ళీ వెతుకుతాను. లేదా సముద్రం పక్కన తపస్సు చేసుకుంటూ గడిపేస్తాను" అనుకున్నాడుట. అప్పుడు ఆయనకి అశోక వనం కనిపించిందిట."
"అలాగే.. కష్టం వచ్చినప్పుడు ఆలోచించాలి కానీ ఆవేశపడి జీవితాలు అంతం చేసుకోకూడదు" అని చెప్పింది.
వారిని ఇంటి దగ్గర దింపి, ఆ అమ్మాయి తండ్రికి జరిగిందంతా వివరంగా చెప్పి...  పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇమ్మని చెప్పి, తను కూడా తన ఆఫీస్ కొలీగ్ ద్వారా "షి టీంస్" వారికి ఆ స్కూల్ దగ్గర మఫ్టీలో ఎవరినైనా ఏర్పాటు చెయ్యమని చెప్పింది.
@@@@@
తరువాత సంవత్సరం శ్యాము  కి వేరే చోటికి బదిలీ అయింది. మృదుల కూడా ఆ సంఘటన గురించి మర్చిపోయింది.
ఇన్నేళ్ళకి వాళ్ళు మళ్ళీ ఇలా కలవటం సంతోషంగా ఆశ్చర్యంగా ఉంది మృదులకి.
పింకీని డిస్చార్జ్  చేసి తీసుకెళ్ళటానికి వచ్చిన మృదుల దంపతులతో
"ఆ రోజు మీరు ఆ రౌడీ వెధవల మీద పోలీస్ కంప్లెయింట్ ఇమ్మని మా నాన్నకి చెప్పారు కదా! అలా వెళ్ళిన మా నాన్నకి, వాళ్ళని అప్పటికే లాకప్ లో వేసి దేహ శుద్ధి చేస్తున్న పోలీస్ కనిపించారు. వాళ్ళ మీద అప్పటికే చాలా కేసులున్నాయిట."
"మీరు చెప్పిన ఆంజనేయ స్వామి కధ మా మీద చాలా ప్రభావం చూపింది ఆంటీ! సాక్షాత్తు ఆయనకే ఇబ్బంది వస్తే, మేమెంత అనుకుని...వాడి గొడవ వదిలిపోయిన సంతోషం, ధైర్యంతో ...మా ధ్యాస అంతా చదువు మీద పెట్టి టెంత్ డిస్టింక్షన్ తో పాస్ అయి కోచింగ్ తీసుకుని ఇద్దరం మెడిసిన్ లో చేరాం! తను బెంగుళూరులోను, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాం ఆంటీ!"
"ఇక నించి ఖాళీ దొరికినప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటానాంటీ! అలాంటి క్లిష్ట సమయాల్లో మనని మనం సంభాళించుకునే అవకాశం ఒక్క క్షణం ఉన్నా ఎన్నో విలువైన జీవితాలు నిలబడతాయాంటీ. నేను కూడా మీ లాగే రోడ్డు మీద వెళుతూ గమనిస్తూ ఉంటాను. మన జీవిత కాలంలో ఒక్కరిని కాపాడినా సమాజానికి ఒక మంచిడాక్టర్నో, ఒక గొప్ప వ్యక్తినో అందించామనే తృప్తి కలుగుతుంది" అన్నది ఊపిరి తీసుకుంటూ!
గతంలో యధాలాపంగా జరిగిన ఒక సంఘటన ఇంత గొప్పదవుతుందని ఊహించని మృదుల తన కూతురిని, మనవరాలిని తీసుకుని తృప్తిగా హాస్పిటల్ నించి బయటికి బయలుదేరింది.
['బతికుంటే బలుసాకు తినచ్చు' అనే సామెత తరుచు వింటుంటాం! బలుసాకు అనేది ఒక ఓషధి అని, అతి సారానికి వాడతారని, అందులో ఐరన్ పుష్కలంగా లభ్యమవుతుందని...కానీ అరుదుగా దొరుకుతుందని ఈ మధ్యే ఒక వార్తా పత్రికలో చదివాను. దీని శాస్త్రీయ నామం ‘వెబెరా టెట్రాండ్రా - కాంథియం పార్విఫ్లోరమ్’ అని తెలిసింది. జీవితం చాలా విలువైనది. మనకి తాత్కాలికంగా వచ్చే కష్టాలతో పోలిస్తే, జీవితం చాలా పొడుగైనది, విలువైనది. కష్టం వచ్చిన ప్రతివారూ ఆత్మహత్య చేసుకుంటే, భూమి మీద ఎవరూ మిగలరు. ఒక్క నిముషం తమాయించుకుని, నిబ్బరంగా ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుందని నమ్మాలి. ఎవరో పెద్దలు చెప్పినట్టు...భగవంతుడు  చెవి లేకుండా తాళం ఎలా తయారు చెయ్యడో ...పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. వెతకాలి అంతే!]

కామెంట్‌లు