ఆంగ్లేయ పంతుళ్ళకు వ్యతిరేకంగా నినదించిన విద్యార్థి;-- యామిజాల జగదీశ్

 అదొక సమావేశం. పెద్దవాళ్ళతో కూడిన సమావేశం. ఆ చిన్నోడూ పిడికిలి బిగించి నినదించాడు. సమావేశంలో నినాదాలు కొనసాగుతున్నప్పటికీ తరచూ అటూ ఇటూ చూసుకుంటున్నారు జనం, ఏ సమయంలో ఆంగ్లేయ పోలీసులు వస్తారోనని. అందరి ముఖాలలో ఒకింత ఆందోళన. దిగులు. కానీ పెద్దవాళ్ళల్లో ఈ భయం ఉన్నప్పటికీ  చిన్నవాడు మాత్రం ఏ మాత్రం భయపడలేదు. అప్పుడు ఆ చిన్నవాడి వయస్సు పదేళ్ళు. ఇది పంజాబులో 1917 నాటి ముచ్చట. అజిత్, స్వరణ్ సింగ్ తదితరులతో ఈ కార్మికుల సమావేశం ఏర్పాటైంది. 
ఆ చిన్నవాడి పేరు భగత్ సింగ్. 
1907 సెప్టెంబర్ 28న జన్మించాడు. తండ్రి పేరు కిషన్ సింగ్.  
స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని కటకటాలపాలైన భగత్ సింగ్ తండ్రి అప్పుడే జైలు శిక్షను పూర్తి చేసుకుని విడుదలయ్యారు. తండ్రి శూరత్వం, దేశభక్తి భగత్ లోనూ సహజంగానే అబ్బాయి.
భగత్ సింగ్ చిన్ననాటి నుండే దేనికీ భయపడని కుర్రాడుగా పేరు సంపాదించాడు. అతని తల్లి విద్యావతి పలుసార్లు ఆంగ్లేయ పోలీసుల నుండి కొడుకు భగత్ ని కాపాడుకోవలసి వచ్చింది. పంజాబీ రైతుల దగ్గర పన్నులు వసూలు చేయడానికి వచ్చిన వారిని రాళ్లు రువ్వి తరిమికొడుతుండేవాడు భగత్. 
స్థానిక పాఠశాలలో ఆంగ్లేయ మాష్టర్లను నియమించినప్పుడు వారికి వ్యతిరేకంగా రాసిన కాగితాలను స్కూలు గుమ్మంలో పంచిపెట్టినప్పుడు భగత్ సింగ్ వయస్సు తొమ్మిదేళ్ళు.
అదే సమయంలో అతను చదువులోనూ గట్టివాడని పేరుండేది. చాలా పుస్తకాలు చదివేవాడు. చదవడమంటే ఏదో పైపైన చదవడం కాదు. చదివిన దానిని లోతుగా అధ్యయనం చేసేవాడు. ఆర్యసమాజం నడిపిన ఇంగ్లీషు పాఠశాలలో భగతే చేరాడు. అక్కడ ఉన్న గురువులు భగత్ సింగ్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఆలోచనలో పడేవారు. తోటి విద్యార్థులను ఒక్కటి చేసి మురికివాడలలో ఉండిన పేదవారి పిల్లలకు చదువు సంధ్యలు చెప్పడానికి వెళ్తుండేవాడు. అప్పుడతని వయస్సు పదకొండేళ్ళు. 
ఓరోజు, భగత్ సింగ్ తండ్రి పొరుగున ఉన్న ఓ ఊరికి వెళ్ళి అక్కడ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగంచడానికి వెళ్ళారు. అది తెలుసుకున్న భగత్ సింగ్ తండ్రికి తెలియకుండా ఆ సమావేశానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నట్టుండి ఆంగ్లేయ సైన్యం వచ్చి కాల్పులు జరిపింది. 
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడటంలో ఎప్పూడూ వెనక్కు తగ్గని భగత్ రోజులు గడిచే కొద్దీ ధీటుగా గొంతెత్తేవాడు. భారతీయుల యువతకు స్ఫూర్తిప్రదాత అయిన భగత్ సింగ్ భారత దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలర్పించి చరిత్ర పుటలకెక్కిన మహావీరుడు. 

కామెంట్‌లు