ఆంధ్ర గీర్వాణ భాషలు; --బెహరా ఉమామహేశ్వరరావు

    ఒకప్పుడు ఆంధ్ర గీర్వాణ భాషా పండితులనే వారు. అంటే అతడు  తెలుగు భాష‌ లోను సంస్కృత భాష లోను పండితుడని అర్థము. అలాగే ఉభయ భాషా ప్రవీణ కోర్సులు ఉండేవి. ఉభయ భాషలు అంటే  తెలుగు భాషతో పాటు సంస్కృత 
భాషగల కోర్సులు.
      నన్నయకు పూర్వం తెలుగు భాష సజీవమైన ప్పటికి, రాజుల పరిపాలన శాసనాలు, గ్రంధాలు, సంస్కృతంలోనే రాయబడి ఉండేవి.
      తెలుగు వారు కూడా  తెలుగుతో పాటు సంస్కృత భాషా ప్రావీణ్యం  సంపాదించే వారు.
గత శతాబ్దంలో కూడా ఈ పరిస్థితులు సమాజంలో 
మనకు గోచరిస్తాయి.నాడు తెలుగు బాలలచే ఆంధ్రము, అమరము అనే గ్రంథాలలోని శ్లోకాలు కంఠస్థము  చేయించేవారు. ఆ రెండింటిని నేర్చిన వారికి ఎంత క్లిష్టమైన పద్యమైనా శ్లోకం అయినా సులభంగా అర్థం, భావం చెప్పగలిగే సామర్థ్యం ఉంటుంది.
  మన తెలుగు ప్రాంతంలో బాలలకు సంస్కృత భాషా ప్రాబల్యం ఉందనడానికి ఇదో చక్కని ఉదాహరణ:
     బొబ్బిలి మండలమున గల అజ్జాడ అగ్రహారంలో
"ఆదిభట్ల"వారు అనే శిష్ట వంశీయులు ఉండేవారు. ఆ ప్రాంతంలో పేరు కెక్కిన పండితులు వారు.
       పార్వతీపురానికి సమీపమున "గుంప" 
అనే దివ్య శివ క్షేత్రము ఉంది. ఈ క్షేత్రము బలరాముని ప్రతిష్ట అని అంటారు. పురాణ ప్రసిద్ధి చెందిన క్షేత్రమే ఇది. నాగావళి మరియు ఝంఝావతి నదుల సంగమమైన చోట వెలసింది.
ఇక్కడ  పూర్వం నుండి కూడా శివరాత్రి పర్వదినాన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
 సుమారు నూరు సంవత్సరాల క్రిందటి  మాట.
       అజ్జాడ నుండి గుంపేశ్వరస్వామి ఆలయానికి కొన్ని కుటుంబాలు శివరాత్రి మహోత్సవాలకు వెళ్లారు.
గుంపేశ్వరుని దర్శించి, రాత్రి జాగరణ చేసి, అజ్జాడ తిరుగు ప్రయాణం అయ్యారు. పార్వతీపురం ముఖ్య  రహదారిలో ఆగారు. పొట్ట వారి దుకాణం ఉంది.
అక్కడ  సామాగ్రి అంతా దొరుకుతుంది.
      ఆదిభట్ల వారు కూడా ఎడ్ల బండిని దిగి సామాన్లు కొనసాగారు. వారిలో ఎనిమిదేళ్ళ బాలుడు. వాల్మీకి రామాయణం చూసి, ఆ పుస్తకం కొనమని అల్లరి చేయసాగాడు. తల్లిదండ్రులు చిరాకు పడిన వినలేదు. అప్పుడు ఆ షాపు యజమాని చూసి, "అబ్బాయి, ఇది తెలుగు పుస్తకం కాదు.సంస్కృత
 వాల్మీకి రామాయణం  బాబూ! అది నీకెందుకు
నీవు చదవగలవా, ఏమిటి?"అంటూ కోపం అయ్యాడు.
"ఆ బాలుడు నేను చదవగలను ఇవ్వండి."అన్నాడు.
"ఏది చదువు?"అంటూ పుస్తకం తీయసాగాడు.
ఆ పుస్తకం ఇవ్వకముందే అందులోని శ్లోకాలు,
ఏకధాటిగా  బాలుడు చక్కగా చదవసాగాడు. ఆ బాలుడు చదివినవన్నీ వాల్మీకి రామాయణం లోని శ్లోకాలే! అనర్గళంగా చదువుతున్న ఆ పిల్లవాడ్ని  చూసి షాపు యజమాని నిర్ఘాంతపోయాడు.
వెంటనే ఆ వాల్మీకి రామాయణం పుస్తకం, మరియు పది రూపాయలు కానుకగా బాలుని చేతిలో షాపు యజమాని పెట్టాడు. ఆ బాలుడు, ఎవరో కాదు ఎనిమిదేళ్ళ వయసులో గల ఆదిభట్ల నారాయణ దాసు.
      ఆనాడు తెలుగుతో పాటు సంస్కృతం, పిల్లలకు నేర్పేవారు. తెలుగు బాలల చదువులలో సంస్కృతం కూడా ఒక భాగమై ఉండేది.
     
కామెంట్‌లు