దట్టమైన దండకారణ్యంలో ఓ సింహం ఉండేది. ఆ సింహానికి నాల్గు పిల్లలు ఉన్నాయి. వృద్ధాప్యంలో వున్న ఆ సింహం నడవలేక తన పిల్లలను వెంటబెట్టుకుని అడవంతా తిప్పేది. కాని ముద్దంత ఆహారం కూడా దొరికేది కాదు.
సింహం నడవలేక నడుస్తుంటే దాన్ని చూసి జంతువులన్నీ పారిపోయి తప్పించుకుని ఊపిరి పీల్చుకునేవి. దీంతో సింహం ఆహారం దొరక్క అలమటించేది. దాని పిల్లలు కూడా పస్తులతో గడపాల్సి వచ్చేది.
సింహం చాలా రోజులుగా ఆహారం లేకపోవడంతో నీరసించి పైకి లేవలేకపోయింది. ఓ గృహలో నిస్సహాయంగా కూర్చుండిపోయింది. తల్లి పరిస్థితి గమనించిన పిల్ల సింహాలు ఉత్తర దిక్కుకు నడిచాయి. కొంత దూరం వెళ్లిన వాటికి నాలుగు ఎలుగుబంట్లు ఆహారం తింటూ కన్పించాయి. వాటి దగ్గరకు వెళ్లి ‘‘ మీకు దండాలు..వారం రోజులుగా మా అమ్మ ఆకలితో అలమటిస్తోంది.మేము కూడా తిండి లేక వెతుక్కుంటూ ఇటు వచ్చాము..ఇంత ఆహారం వుంటే పెట్టరాదూ..’’ అని చేతులెత్తి వేడుకున్నాయి.
ఎలుగు బంట్లకు జాలేసింది. తాము తింటున్న ఆహారంలో కొంత సింహం పిల్లలకు పెట్టాయి. తన తల్లికి కూడా ఆహారం ఇవ్వాలని అవి వేడుకున్నాయి. ఎలుగుబంట్లు ఆహారం తీసుకుని సింహం వున్న గృహ వద్దకు నడిచాయి. వాటిని చూడగానే సింహానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చంపి తినాలని తహతహలాడిరది. వాటి వెనుక తన పిల్లల్ని కూడా వెంటబెట్టుకుని రావడం చూసి కొంత వెనక్కి తగ్గింది.
సింహం దగ్గరకు వెళ్లిన ఎలుగుబంట్లు ఆహారం అందించాయి. ‘‘ అయ్యో పాపం లేవలేని స్థితిలో వున్నారు..మీ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి కదా..? వచ్చే వారం మా కొలను దగ్గర జంతువులన్నీ విందు భోజనం ఏర్పాటు చేసుకున్నాం.. అక్కడికి మీరూ పిల్లల్ని వెంటబెట్టుకురండి.. తృప్తిగా తిందురుగాని.. ’’ అన్నాయి ఎలుగు బంట్లు.
‘‘ అయ్యో మీరు చేసుకునే విందులో నా కడుపు ఏం నిండుతుంది.. నేను రోజుకో పది కేజీల మాంసం తినేదాన్ని..’’ అని గొప్పలు పోయింది సింహం.
‘‘ అవును నిజమే కదా.. మేమంతా శాఖాహారం తింటున్న వాళ్లం.. అయినా మీకు ప్రత్యేకంగా మాంసం తెచ్చి పెడతాం.. తప్పక రండి.. ఆ రోజు గజరాజు కొడుక్కి పెళ్లి వుంది..’’ అన్నాయి ఎలుగుబంట్లు.
‘‘ అయ్యో నాకేం కర్మ..ఈ అడవికి రాజును నేనే కదా.. గజరాజు దగ్గరికి రావాల్సిన కర్మ నాకేం పట్టింది? అయినా నా కిప్పుడేం ఆహారం తక్కువైందని..? కావాలంటే నేను వున్న గృహ వద్దకు రేపు మీ పరివారమంతా రండి.. మంచి మాంసాహారం, శాఖాహార భోజనం వడ్డిస్తాను.. తృప్తిగా తిని వెళ్దురుగాని..’’ అంది బడాయి సింహం.
మరుసటి రోజు ఎలుగుబంట్లు, జింకలు, కుందేళ్లు, గజరాజు తన పరివారంతో సింహం ఇచ్చే విందుకు బయలుదేరాయి.
ఇంకా జంతువులు రాలేదేమిటా అని ఎదురు చూడసాగింది సింహం. తన జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుని విందు చేస్కోవడాన్కి ఆశతో ఎదురుచూస్తోంది సింహం.
అల్లంత దూరంలో వస్తున్న జంతువులన్నింటిని చూసి ఇక తనకు పండుగే అనుకుంది సింహం.
‘‘ ఏదీ విందు.. వంటకాల వాసన రాలేదే?’’ అంది గజరాజు.
‘‘ అవును మంచి భోజనం తయారై లోపల సిద్ధంగా వుంది..అందరూ లోనికి రండి.. ఆహ్వానించింది..’ సింహం.
మొదట ఎలుగుబంట్లు వెళ్లాయి. దాని వెనుకే గజరాజు వెళ్లింది. ఆకలితో వున్న సింహం ఒక్క సారిగా ఎగిరి తన పంజా విసిరి ఎలుగుబంట్లపై దాడిచేసింది.
ఎలుగు బంట్లు ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయి చాకచక్యంగా తప్పించుకుంది. నిస్సత్తువ ఆవహించిన సింహం కూలబడిరది. నడుం, కాలు విరిగింది. తాను పన్నిన కుట్రకు ఎదురు దెబ్బ తగిలింది. తాను తీసిన గోతిలో తానే పడిపోయింది. బాధతో విలవిలాడుతూ గావు కేకపెట్టింది. ఇది చూస్తున్న గజరాజు ‘‘ నువ్వు చేసిన దుర్మార్గానికి జీవితాంతం పైకి లేవలేక, నడవలేక నరకం అనుభవించు..’’ అంది.
తల్లి అరుపులు విన్న సింహం పిల్లలు అక్కడికి వచ్చి ‘‘ మా అమ్మ చేసిన దుర్మార్గపు పనికి క్షమించండి..అలా వదిలి వెళితే మేము దిక్కులేని వాళ్లం అవుతాం..’’ దీనంగా చేతులు జోడిరచాయి.
వాటి దీనస్థితి చూసి గజరాజుకు జాలేసింది. ‘‘ నీ పిల్లల్ని చూసైనా బుద్ధి తెచ్చుకుని సన్మార్గం అలవరుచుకో..!’’ హితవు పలికింది గజరాజు.
ఆ తర్వాత తాను చేసిన పనికి తల దించుకుంది సింహం. ‘‘ నన్నిలా వదిలి వెళ్లకండి.. నా పిల్లలు అనాథలవుతారు..’’ అని సింహం బాధతో దు:ఖించింది.
జంతువులన్ని సింహం ఆవేదనను మన్నించాయి. రోజూ ఆహారం తెచ్చి పెడుతూ కాపాడాయి. సింహం పిల్లలకు కూడా ఆహారం తెచ్చిపెట్టాయి. కొద్ది రోజులకు సింహం కోలుకుని కుంటికుంటి నడవ సాగింది. తన దుష్ట బుద్ధి వీడి జంతువులన్నింటితో స్నేహంగా మెలగుతూ తన పిల్లలను సన్మార్గంలో నడిపించింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి