అమ్మంటే అలానే!!;- ... విశ్వైక- సికింద్రాబాదు
అమ్మా! ఎందుకో నువ్వు అంటే
నాకు నచ్చేది కాదు..

బారెడు పొద్దెక్కాక 
మంచం పై ఉన్న నాకు నీ 
తిట్లదండకం నచ్చేది కాదు 

తప్పులు చూసీచూడనట్లు
పోనీక ..నువ్వు వేసే శిక్షలు
నాకు నచ్చేవికావు

పరీక్షల్లో మార్కులు తగ్గితే
నువ్వు కొట్టే దెబ్బలు 
నాకు నచ్చేవి కాదు 

అతి సర్వత్ర వర్జయేత్ అంటూ
దేన్నీ అతి కాకుండా 
కంట్రోల్ చేసే నీ ధోరణి 
నాకు నచ్చేది కాదు 

ఏ పొరపాటు నైనా
అప్పటికప్పుడు ఖండించి
నువ్వు చెప్పే నీతులు 
నాకు నచ్చేవి కాదు 

క్షణం కూడా తీరిక ఇవ్వకుండా
పని మీద పని చేయించే నీ ఆజ్ఞలు 
నాకు నచ్చేవి కాదు 

నా స్వేచ్ఛను హరిస్తూ
సహనం ,ఓర్పు,
క్రమశిక్షణ నేర్పిస్తుంటే
నాకు నచ్చేది కాదు 

ఇష్టం ఉన్నా, లేకున్నా 
నీ మాటలు వినేలా చేసే 
నీ ఆదేశాలు
అస్సలు నచ్చేవి కాదు

కానీ..అమ్మా...

పెళ్లయి.. పిల్లలు పుట్టాక 
నాకు తెలిసింది 
అమ్మ అంటే ఏంటో... 
అప్పుడు నువ్వు వేసింది
 'శిక్ష' కాదని
అది నా భవిష్యత్తుకు 'శిక్షణ'
అని ఇప్పుడర్ధమైంది.

అప్పుడు నువ్వు నాకు నేర్పినవన్నీ 
అప్రయత్నంగా ఇప్పుడు నేను
నా పిల్లలకు నేర్పుతున్నాను.
 
అప్పట్లో అనిపించేది..
ఎందుకు అమ్మ 'ఇలా' అని
ఇప్పుడు తెలుస్తుంది 
అమ్మంటే 'అలానే' అని

అమ్మా!.. మరో మాట 
ఇప్పుడు నేను నా పిల్లలకు
నచ్చటం లేదు 😊

   

కామెంట్‌లు