శివ స్మరణ;-మచ్చ అనురాధ సిద్దిపేట
ఉత్పలమాల
1. 
శాంభవి నాథ నిన్ను మది; సన్నుతిజేయుచు సేవ జేసినన్ ,
కుంభిని  లోన భక్తులకు; కోర్కెలు దీర్తువు దేవ దేవుడా!,
జృంభితమైనభక్తియు ఋషీం ద్రులు నారద తుంబురాదులున్
శంభుని గొల్చుచుండెదరు; చక్కని కీర్తనతోడ నెప్పుడున్ .

2. ఉత్పలమాల
లోకములెల్లనేలెదవు;  లోకుల బాధలు దీర్చశంకరా! ,
నాకిల భోగభాగ్యములు;  నాదరి జేరియు నీయవేలరా! ,
వేకువ లేచి నీ పదము;  వేడుచు కీర్తన జేయుచుండెదన్ ,
శోకము నెల్లదీర్చియును చూపర నీ కృప  దీనబాంధవా! .

3 . చంపకమాల
పదెపదె యీశ్వరుండ నిను; ప్రార్థన  జేసెద పార్వతీశ్వరా ,
సదమల నీదు నామమును;  సంభ్రమమొప్పగ వేడుకొందునే,
కదిలియు రావ నాదరికి;  కాముని సంహర కాలభూషణా! ,
మదినిను నమ్మి గొల్చెదను;  మంజుల నాథ మహేశ శంకరా! .
4. చంపకమాల
హిమగిరి వాస నాదరికి;  యే లను రావయ తెల్యజాలరా! ,
ఢమరుక నాద రంజకుడ;  ఢంకవినోదక  దానవాంతకా! ,
యుమవర నుర్వి దేవుడవు;  నుండెద వెప్పుడు భక్తసన్నిధిన్ ,
శ్రమయనకన్ సదాశివుడ;  సన్నుతి జేసెదనయ్యశంకరా! .

5. ఉత్పలమాల
ద్వాదశ లింగ రూపుడవు;  దైవము నీవని నమ్మి యుంటిరా! ,
మోదము తోడ గావుమిల; మోక్ష ప్రదాయక భక్తవత్సలా!,
ఖేదములెల్ల బాపుమిక;   కీర్తియు , గౌరవ సౌఖ్యమీయవే! 
సాధుల సన్నుతించువర  శాంతిమనోహర నందివాహనా


కామెంట్‌లు