మదురై మణి అయ్యర్;-- యామిజాల జగదీశ్
 శాస్త్రీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక బాణీని కల్పించుకున్న గాన కళాధరుడు మదురై మణి అయ్యర్. 
మధుర మణి అయ్యర్ అని సంగీతాభిమానులు చెప్పుకునేవారు.
తమిళనాడులోని మదురైలో ఎం.ఎస్. రామస్వామి అయ్యర్ - సుబ్బులక్ష్మి దంపతులకు 1912 అక్టోబర్ 25వ తేదీన జన్మించారు మదురై మణి అయ్యర్. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సుబ్రమణియన్.
తండ్రిరామస్వామికి సంగీతమంటే మక్కువ. ఆరోజుల్లో ప్రముఖ సంగీతమేధావిగా పరిగణించబడే పుష్పవనం ఈయన సోదరులు. కనుక సంగీతజ్ఞానం అనేది మణి అయ్యరుకి కుటుంబ ఆస్తి. 
బాబాయ్ పుష్పవనం, మదురై పొన్నుసామి పిళ్ళై తదితరులకు గురువుగా ఉండినవారు ఎట్టయపురం రామచంద్ర భాగవతార్. ఆయన విద్యార్థి అయిన రాజం భాగవతార్ వద్ద శిష్యరికం చేసి మణి అయ్యర్ సంగీతం అభ్యసించారు.
రాజం భాగవతార్ ఇంట్లో ఓ భాగంలో అద్దెకు ఉండేది మణి అయ్యర్ కుటుంబం. కనుక ఆయన దగ్గర చేరితే తన కకుమారుడు మణి సంగీతజ్ఞానం పెంపొందుతుందని భావించారు తండ్రి రామస్వామి అయ్యర్.
హరికేశనల్లూర్ ముత్తయ భాగవతార్ వారి మదురై  త్యాగరాజ సంగీత విద్యాలయంలో మణి చేరారు. రాజం భాగవతార్ ఈ విద్యాలయంలో మాష్టారుగా ఉండేవారు.
మణి అయ్యర్ మొదటి కచేరీ ఆయన పన్నెండో ఏట జరిగింది. రామనాథపురంలోని అలవాకోట్టయ్ ఆలయ కుంభాభిషేక కార్యక్రమంలో జరిగిన ఈ కచేరీలో నత్తం సీతారామ అయ్యర్ (వయోలిన్), రాజగోపాల అయ్యర్ (మృదంగం) వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. దీంతో చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. 
1925లో దేవకోటలో కాంచి కామకోటి మహా పెరియవర్ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి సమక్షంలో చేసిన కచేరీ మణి అయ్యర్ సంగీత జీవితంలో ఓ కొత్తమలుపు అని చెప్పుకోవచ్చు. పెరియవర్ ఆశీస్సులు, ఇతరుల ప్రశంసల నడుమ స్వర్ణపతకం, పట్టు వస్త్రం పొందడం మరువలేనని అంటుండేవారు మణి అయ్యర్.
తమిళనాడులోని పలు ప్రాంతాలలో కచేరీలు చేసిన మణి అయ్యర్ ఆనాటి హేమాహేమీల సంగీత కచేరీలకు హాజరై వారి శైలిని వింటూ సంగీత జ్ఞానాన్ని మరింత పెంచుకున్నారు. 
1927లో చెన్నైలో సంగీత విద్వత్ సభ (దీనినే మ్యూజిక్ అకాడమీగాచెప్తున్నారు) ప్రారంభోత్సవంలో మణి అయ్యర్ తండ్రి రామస్వామి అయ్యర్ 72 మేళకర్త రాగాల గురించి ఓ ప్రసంగం చేశారు. అలాగే మణి అయ్యర్ కచేరీ జరిగింది.
ఆరోజుల్లో స్వరం పాడటంలో గొప్ప సంగీతజ్ఞుడిగా పేరుప్రతిష్ఠలు గడించిన సుబ్బరామ భాగవతార్ బాణీలో కొనసాగారు మణి అయ్యర్. రాగ భావంతోనూ కల్పనా స్వరంతోనూ మణి అయ్యర్ ఏ కీర్తనకైనా ఓ కొత్తదనం తీసుకొచ్చేవారు. చక్కని రాజా, నాద తనుమనిసం, కాన కన్ కోడి వేండుం, ఎప్ప వరువారో, తాయే యశోదా, వెల్లయ్ తామరై పూవిల్ ఇరుప్పాల్ వంటి పాటలు ఈయన నోటంటే వినాలని చెప్పుకునేవారందరూ.
హరికేశనల్లూర్ ముత్తయ భాగవతార్ రాసిన ఇంగ్లీష్  నొటేషన్స్ ని పాడి వాటికీ ప్రచారం చేసినవారు మణి అయ్యరే. 
మూడు స్థాయిలలోనూ చాల సరళంగా హాయిగా పాడి అందరి మన్ననలు పొందిన మణి అయ్యర్ తమ కచేరీలలో ముత్తుస్వామి దీక్షితర్ నవగ్రహ కృతులను తప్పనిసరిగా పాడేవారు.
మైసూర్ చౌడయ్యా, కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై, టి.ఎన్. కృష్ణన్, లాల్గుడి జయరామన్, ఎం.ఎస్. గోపాలకృష్ణన్, గోవిందరాజ పిళ్ళై, పాలక్కాడు మణి, పళని సుబ్మణ్య పిళ్ళై, మురుగభూపతి వంటి మేటి వాయిద్య కళాకారులు ఆయన కచేరీలలో వాయిద్యసహకారం అందించేవారు.
మరోవైపు చదువుసంధ్యలలోనూ మక్కువ ఉన్న మణి అయ్యరు స్కూలుకి వెళ్ళి సక్రమ పద్ధతిలో చదవని కారణంతో ఒక మాష్టారుని ఇంటికి రప్పించి ఆయన ద్వారా మణి అయ్యరుకి ఇంగ్లీషు పాఠాలు నేర్పించసాగారు. 
సాహిత్యంలోనూ మంచి పట్టున్న మణి అయ్యరుకి జానకిరామన్ వంటి ప్రముఖ రచయితలతో సాన్నిహిత్యముండేది.
ఆయన జీవితంలో మరచిపోలేని అపూర్వ సంఘటన ఒకటుంది.
ఓమారు కాంచి మహాపెరియవర్ చెన్నైకి వచ్చారు. 
ఓరోజు తెల్లవారుజామున స్వామివారి దర్శనం కోసం కాంచి మహాపెరియవర్ మైలాపూర్ వీధి గుండా పోతున్నారు. అక్కడికి దగ్గర్లోనే మణి అయ్యర్ ఇల్లు ఉందన్న సంగతి తెలుసుకుని ఆయన ఇంటి వాకిట్లో నిల్చున్నారు.
పెరియవర్ వాకిట్లో నిల్చునుండటం తెలుసుకుని ఆయన బంధువులందరూ బయటకు వచ్చి మహాపెరియవర్ కి నమస్కరించి ఆశీస్సులు పాందారు. కానీణి అయ్యర్ బయటకు రాలేదు.
"ఏమిటీ, మణి కనిపించలేదే. పిలవండి మణిని" అని మహాపెరియవర్ అన్నారు.
అప్పుడు మణిఅయ్యర్ సహాయకుడు, సోదరి భర్త అయిన వేంబు సన్నని స్వరంతో "ఆయన మిమ్మల్ని మడిగా దర్శనం చేసుకోవాలనుకున్నారు. అయితే ఇంకా స్నానం చేయలేదని బయటకు రాలేదు" అన్నారు. 
అంతట మహాపెరియవర్ "మడేంటీ తడేంటీ అతనికి సంగీతమే సర్వస్వం....పిలవండి అతనిని అన్నారు పెరియవర్.
వేంబు లోపలకు వెళ్ళి విషయం చెప్పడంతో మణి పరుగున వచ్చి పెరియవర్ కి పొదాభివందనం చేశారు.
వెంటనే తమ మెడలో ఉన్న గులాబీ మాల తీసి మణి అయ్యర్ మెడలో వేసి "ఒరేయ్, నీకు సంగీతమే మడి...తడి... ఆచారం .... పూజ అన్నీనూ" అని దీవించారు మహాపెరియవర్.
మరొకమారు మణి అయ్యర్ కచేరీ విన్న పెరియవర్ రాత్రి చాలా ఆలస్యమవడంతో తాళం వేసి ఉన్న ఓ దుకాణాన్ని తెరిపించి ఓ పట్టు వస్తాన్ని తెప్పించి మణికి దానిని కానుకగా ఇచ్చి దీవించారు.
సభలలోనే కాక ఆలయాలలోనూ వివాహవేడుకలలోనూ మణి కచేరీలు కొనసాగుతుండేవి.
పలు అవార్డులు రివార్డులు పొందిన మణి అయ్యర్ 1968 జున్ ఎనిమిదో తేదీన కాలధర్మం చెందారు. 
సంగీతం, తమిళ భాష కోసం జీవితాన్ని అంకితం చేసుకున్న మణి అయ్యర్ పెళ్ళి చేసుకోలేదు. తన సోదరి, శిష్యుడు అయిన టి.వి. శంకరనారాయణనే కొడుకుగా చూసుకున్నారు.
ప్రముఖ తమిళ రచయిత సు.రా. రాసిన ఇరవయ్యో శతాబ్ద సంగీత మేధావులు అనే రచన ఆధారంగా ఈ నాలుగు ముక్కలూ రాయగలిగాను.

కామెంట్‌లు