వికృత సౌందర్యం!(కవిత);- కొత్తపల్లి ఉదయ బాబు, సికింద్రాబాద్
లేత అరిటాకు మొవ్వహృదయం
నీ తుమ్మముల్లు చేష్టతో
రక్తస్రావమైనపుడే తెలిసింది
నీ సౌందర్య విహీనత.

వృద్ధఅన్నార్తుడు తన
వయసును మరచి నీ
ముందు చాచిన చేయిని
కిందకు తొక్కినప్పుడే
ఒక ఆకృతి మొదలైంది
నీ సౌందర్య విహీనతకు.

కనిపెంచిన అమ్మానాన్నలు
నిలువు దోపిడీకి గురై
కన్నీళ్ల గంగమ్మ చెరువులై
ప్రవహిస్తుంటే
నీ సమర్ధింపు సమాధానాలే
నీ సౌందర్య విహీనతకు
నిజాప్రతిబింబాలు.

ఈ క్షణం తిన్న తిండి,కట్టిన బట్ట
కాదురా బ్రతకమంటే.
నీ బిడ్డల దేవుని మందిరంలో
రేపటిదినం చిత్రించబడే
చెదలపటం కుక్కలు
చింపిన విస్తరైనపుడైనపుడే...
నిజమైన నీ సహజ సౌందర్య
విహీనభవిష్యత్తు ఛాయాచిత్రంపై
నీ కంటి రక్తపు చుక్కలు రాలి
పడినప్పుడు చూసుకో!

సమాప్తం

కామెంట్‌లు