పిల్లలు; -డా॥ కొండపల్లి నీహారిణి
పిల్లలు సూర్య కిరణాల వాడి, చంద్రకిరణాల హాయి
మనసనే ఆకాశవీధిలో విరిసే హరివిల్లు అందాలు పిల్లలు

పిల్లలు పిడుగులు, పిల్లలు బుడుగులు
చికాకు పుట్టిస్తారు, చికాకులు పోగొట్టేస్తారు.
పిల్లలు నవ్వుల హరివిల్లులు
పిల్లలు నడిచొచ్చే సంబరాలు నయా బచ్ పన్ నజరానాలు
మనకు విసుగు కారకులు
మనలోని విసుగును తుడిచే సాధకులు
వద్దు వద్దనుకున్నా వయసంతా వాళ్ళే అయ్యే
అలవికాని ఎమోషన్స్ పిల్లలు !
పిల్లలు కావాలనుకున్న ఆలోచనంతా వాళ్ళే అయ్యే
అందరాని ఎమోషన్స్ 
పిల్లలు !
బంధాలు వారే ! అనుబంధాలూ వారే !
పిల్లలు మన జాడలకు అడుగుజాడలు
పిల్లలు అందుకోలేని ప్రశ్నలకు
అడుగడుగున జవాబులు
పిల్లలు సతాయిస్తారు సంధానం చేస్తారు 
మన టైంను, మన  టెంపర్ ను
టైటానిక్ చేస్తారు
మునగని కాలానికి గాలం వేసి
మొత్తం గుత్తంగా తీసేసుకుంటారు
ఒకే ఒక్క నవ్వుతో
మనలోని విసుగునంత సుతారంగా తుడిచేస్తారు
ఇదే గొప్ప అభివృద్ధి 
ఇదే గొప్ప అనుబంధం
మన ఇంటి పిల్లలే ప్రతి ఇంటి ఉదాహరణలు
మన కంటి పిల్లలే ప్రపంచానికి సరంజామాలు
మనసంటూ ఉంటే మనం మారాలి 
మనకంటూ ఉంటే వాళ్ళను మార్చాలి
నేడు వాళ్ళే
రేపూ వాళ్ళే
నీవు నేనను రెండు భావాల మధ్య వంతెనలు
పిల్లలు ! 
మారాలనుకునే సమాజానికి ఎడతెగని వారధులు
పిల్లలు మారబోమనే సమాజాన్ని మార్చే రథ సారథులు

అందమైన జీవితానికి అర్థవంతపు ఆణిముత్యాలు
ఇప్పుడు మన పిల్లల్ని మారిస్తే
భావి బంగరు మాటౌతారు పిల్లలు
ఇప్పుడు పిల్లలే మారితే
మారుతున్న సంఘానికి ఎన్నుకోని నాయకులు
పిల్లలు పసిడి విలువల ధగధగలు
పిల్లలు ఎన్నుకున్న సత్యానికి అందాల్సిన తత్వాలు !
—-*——

కామెంట్‌లు