కుటుంబం;-మాడుగుల మురళీధరశర్మ
కం-1
విద్దెలు,బుధ్ధులు,నేర్పెడు
సద్దైవము తల్లియనగ*
సాక్ష్యమునిదియే!
ముద్దలుతినిపించుచునే
నొద్దికగా బుద్దినేర్పు*
నోపికతోడున్!

కం-2
మాతృత్వ మహిమకనుమా!
పితృత్వముతోడునవగ*
ప్రేమలుపంచున్!
నేతృత్వపథినిధర్మము
దాతృత్వముజీవనమున*
దైవములెపుడున్!

కం-3
తల్లులకాతరభావము
పిల్లలపై చెడును పంచి*
బీడులచేయున్!
తల్లీ,దండ్రుల జాగృతి
నెల్లలులేనట్టివృధ్ధి*
నేగగ జేయున్!

కం-4
మానస,భౌతిక,దైవిక
మానసపరిపక్వ శ్రమలు*
మానితమొప్పన్!
మానినియనుదినమందున
తానుగతనువర్తనమున*
ధర్మము నిలుపున్!

కం-5
తండ్రియను ధర్మమార్గము
గుండ్రౌతుగనుండు గోప్య*
గురువుగ;సంతున్!
కోండ్రగ సాగుననడుపుచు
గాండ్రించుచు నదుపుజేయు*
గమనమునందున్!

కం-6
చుక్కానిగ తనయింటికి
నక్కజపథమందజేయు*
నార్ద్రత తండ్రై!
నిక్కపునిజ వర్తనునిగ
చక్కని సంసారనావ*
సారథితానౌ!

కం-7
భూతదయ,నీతి,నియమము
లీతరమునకందజేయు*
నీప్సితసిధ్ధిన్!
తాతల,తండ్రుల,సంతుగ
మాతా,గురు,దైవభక్తి*
మార్గము నేర్పున్!

కం-8
ఆకలి కన్నము తినుటను
వేకువనే నిద్రలేపి*
విద్యల పెంపున్!
లోకము పోకడలనుకని
సాకును సన్మాతలెపుడు*
సంసారమునన్!

కం-9
రాకాసిరూపమెత్తును
ప్రాకటముగహానిచేయు*
పరజీవులపై!
భీకర పోరును సలుపుచు
నేకొలదిగ రక్షజేయు*
నెలమిన శక్తై!

కం-10
బంధువులందరియందున
వందితసత్సంగమందు*
వసుధాస్థలిపై!
ముందుండగ యత్నించును
వందేమాతరము నీకు*
వందే! మాతా!

కం-11
సతిపతిసుతహితతతులుగ
అతులితవ్రతమతులుస తము*
నతిశయ గతులై!
యతిగణ,తతిఋతు పథ సం
చిత,జత,కృతకృతులు,రథులు*
క్షితి సితమతులున్!

కం-12
జలములు కలిసిన కలిమిన
వలపుల నెలమినను నిలిపి*
పలుమలినములన్!
విలవిల కలకలములకలి
వెలుపలి తలపులుగ నిలుపు*
వెలుగులజిలుగుల్!

కం-13
భార్యాభర్తలు నిరువురి
కార్యాకర్తనలనెపుడు*
కాంచుచుసంతున్!
నిర్యాణపుణ్యఫలమున
పర్యాప్తుగ ముందుకేగ*
ఫలితముపొందున్!

కం-14
జిలకరబెల్లముకలిపిన
వలపుల-వర వధువు కలిమి*
వసుధవసంతా!
లొలుకగతలపుచెలిమిచెలి
నలలుగననురాగమధుర*
మావిష్కృతమౌ!

కం-15
తొలిపలుకుల మలియలజడి
అలలుగసలలలితపు లలన*
నాలనపులుముల్!
జలజలజలములనులుములు
వలలుని వలపుల మెలికలు*
వాలుగ నిలుపున్!

కం-16
అహమను నవధిని వీడుచు
సహనము చూపించుమెండు*
స్వార్థరహితుగా!
దహియించగ చెడుభావన
ప్రహతము హితకరకుటుంబ*
ప్రతిభనుగొనుమా!
కం.17
ఉమ్మడికుటుంబజీవన
మిమ్ముగ భరతావనీన*
నీప్సితసుఖమౌ!
క్రమ్మిడి,ముమ్మడి
దురితము
లమ్మగ,నమ్మమ్మ,తాత*
లందరు తీర్చున్!

 కం.18
ధర్మపు పథమున నడుపెడు
 కర్మగ తగు చదువుసంధ్య*
సారముతెల్పున్!
మర్మములను
విడమరచుచు
నిర్మలమౌచిత్తశుధ్ధి*
నింపుగ నింపున్!

కామెంట్‌లు