కృతవర్మ.పురాణ బేతాళ కథ..; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు కృతవర్మగురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా కృతవర్మ యాదవ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన కృష్ణుని సమకాలికుడు. మహాభారతం, విష్ణుపురాణము, భాగవతం, హరివంశము వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో కృతవర్మ ప్రసక్తి కనిపిస్తుంది.
కృతవర్మ యాదవకులంలోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాతైన హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా, ఈయనకు కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. శమంతకమణి వ్యవహారములో కృష్ణుని మామ అయిన సత్రాజిత్తును హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో, కృతవర్మ కౌరవుల పక్షాన చేరి పాండవులకు వ్యతిరేకంగా యాదవ సైన్యాన్ని (దీన్నే నారాయణి సేన అని కూడా అంటారు) నడిపించాడు. మొత్తం కౌరవ సైన్యంలో కెల్లా సజీవంగా మిగిలిన ముగ్గురిలో కృతవర్మ ఒకడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఉపపాండవులను హత్య చేయటమనే నీచకార్యములో అశ్వత్థామకు సహకరించాడు. హత్యగావించబడిన వాళ్లలోపాండవపక్షసర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నునితో పాటు శిఖండి, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈఘట్టము మహాభారతంలోని సౌప్తిక పర్వంలో వర్ణించబడింది. మహాభారత యుద్ధానంతరం కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మహాభారతంలోని మౌసల పర్వంలో తెలియజేసిన విధంగా యాదవ వినాశన కాలములో కృతవర్మ ద్వారకలో సాత్యకి చేతిలో మరణించాడు ' అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు