పరవస్తు చిన్నయసూరి -పంచతంత్రం;- బెహరా ఉమామహేశ్వరరావు.

 పరవస్తు చిన్నయసూరి రచించిన నీతి చంద్రికను
ఉన్నత పాఠశాల విద్యార్థులు నేటి వరకు ఏదో ఒక తరగతిలో ఒక్క పాఠంగానైనా చదువు తున్నారు.
     నీతి చంద్రిక లోని మిత్రలాభంలో చెలిమి  వలన
చేకూరు లాభాలు;ఆత్యాశ వలన కలిగేటటువంటి దుష్ఫలితాలు, తొందరపాటు వలన కలిగే నష్టాలు
సోదాహరణం వివరించారు.
     మిత్రభేదంలోని కరటక దమనకులు అనే నక్కల పాత్రలతో సామాజిక న్యాయం, రాజకీయ నీతిని
తెలియజేశారు. వాటితో స్నేహంలో గల మంచిచెడ్డలు వివరించి చెప్పారు. ఉపకారం చేయడం వల్ల కలిగే లాభాలు. స్వార్థం వల్ల వచ్చే దుష్ఫలితాలు, పరుల చెడు కోరే వాళ్ళకే చెడు జరుగుతుందని నీతి.  చంద్రికలో ఎంతో చక్కగా మలచారు.
      చిన్నయసూరి పేరు చెప్పగానే జ్ఞప్తికి వచ్చేది "బాల వ్యాకరణం". సంస్కృతంలో నన్నయ్య "ఆంధ్ర శబ్ద చింతామణి" అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించినట్లు తెలుస్తుంది. కేతన రాసిన "ఆంధ్ర భాషా భూషణం" తెలుగులో రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం. క్యాంబెల్,కేరి,  బ్రౌను వంటి ఆంగ్ల పండితులు
తెలుగు భాష వ్యాకరణాన్ని సులభశైలిలో రాశారు.
అయితే పరవస్తు చిన్నయ సూరి బాల వ్యాకరణం తరతరాలుగా నిలిచేటట్లు రాశారు.
      మొట్టమొదట ఆయన సంస్కృత, తెలుగు భాషలలో సారాంశాలు తీసుకుని పుస్తక రచన చేశారు. ఆ అనుభవమే బాలవ్యాకరణం రాయడానికి
ఎంతో ఉపయోగపడింది. ఈ గ్రంథం 1858లో వెలుగు చూసింది. బాల వ్యాకరణం ఎంత ప్రసిద్ధి చెందింది అంటే...
బాల వ్యాకరణం చదివారా, అనడానికి బదులుగా
చిన్నయ సూరిని చదివారా? అని అడిగేంత...
     దీనికి బాల వ్యాకరణం అని పేరు పెట్టినా
బాలల కంటే ఎంతో ఎక్కువ స్థాయిలో ఉంది. అయితే విశేషమేమిటంటే ఈ వ్యాకరణం లోని సూత్రాలు కంఠస్థం చేసేందుకు అనువుగా ఉండి దీనిని ప్రామాణిక గ్రంథంగా నిలిపాయి.

కామెంట్‌లు