తెలియదు నాకు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 ఊహలు సైతం ఉప్పెనలా ముంచేస్తాయని...
సప్తవర్ణాలు సైతం ఎరుపుగా మారిపోతాయని...
మాటలు సైతం యుద్దానికి దారి తీస్తాయని...
పదాలు సైతం ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తాయని...
కలతకు జారే కన్నీరు సైతం కసిగా కదిలిస్తుందని...
శ్రీ శ్రీ పదజాలం పరిచయం అయ్యేవరకు...తెలియదు నాకు
శ్రమకు చిందిన చెమట సైతం నిప్పురవ్వలా మండుతుందని...
అడుగులను ఆపిన అలసట సైతం ఆయుధమై కదులుతుందని....
ఆకలికి లొంగని ఆత్మాభిమానమే అరాచకుల అంతుచూస్తుందని....
తలదించిన తత్త్వం సైతం తెగువ చూపి తెగించి ముందుకు సాగుతుందని…
బరువైన బానిసత్వం సైతం విజయ బావుటా ఎగరేస్తుందని...
శ్రీ శ్రీ అద్భుత అక్షరాల జల్లులలో తడిచేవరకు తెలియదు నాకు...
అలసిన బ్రతుకుల, గుప్పెడు మెతుకుల, పోరాట పటిమల,
చీకటి ప్రశ్నల, దించిన తలల, తీరని కలల ఉండిపోకంటూ,
ఆరాటాన్ని ఆపని అలల సాగిపోమంటూ, 
బంధువుల భరోసాను అందిస్తాయని…
ఉత్సాహం, ఉద్వేగం,ఆలోచన, అసంతృప్తి, ఓర్పు, ఓదార్పు, 
ప్రశ్న, ప్రయత్నం, ఓటమి, ధనికుల కూటమి, బాధ, భరోసా 
సైతం కవితలుగా కదిలొస్తాయని…
కవులను సైతం కలవరపెడుతాయని
శ్రీ శ్రీ ప్రశ్నలు సంధించే వరకు తెలియదు నాకు...
ఆరంభించిన ఆశయం…దానివల్ల ఆగిందంటూ, దీనివల్ల ఆగిందంటూ
కారణాలు చూపకూడదంటూ,
కూటికి జరగని జీవనం నీదైతే
కోటకు చేరే వరకు పోరాటాన్ని ఆపకూడదంటూ,
ఆరాటం తీరే వరకు,
ఆయుష్షు నిండే వరకు,
ఆఖరి శ్వాస విడిచే వరకు
ప్రయత్నాన్ని కొనసాగించమంటూ పదునైన పద ప్రయోగాలతో ప్రశ్నిస్తూ,
పలకరిస్తూ, లక్ష్యం దిశగా ప్రతి ఒక్కరిని ముందుకు సాగిస్తాయని...
తెలియదు నాకు...అసలు తెలియనే తెలియదు నాకు...


కామెంట్‌లు
Unknown చెప్పారు…
అద్భుతం అండీ