జగద్గురుశ్రీ శంకరాచార్యులు;-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ప్రక్రియ -ఇష్టపది 

అద్వైత భావనను ఆది శంకర స్వామి 
ఏక త్రాటినిదెచ్చి ఎల్లరను నలరించె 

కాలడిన జన్మించి కలికి నార్యమాంబకు 
శివగురువు పుత్రుడై శిష్టుడై పెరిగాడు 

ఉపనయన విద్యలను ఉపయోగమొనరించి 
పేదరాలింటనూ పెనుదరిద్రము తోడ

అమలకము నివ్వగా అమ్మనే యర్థిoచె 
కనకధారాస్తవము కనకమ్ము కురిపించె 

నీటికై వెళ్లి నది నీరుతెచ్చెడి తల్లి 
నిలువునా కూలగను నిటలాక్షు ప్రార్ధించి 

పూర్ణనది పాయ సం పూర్ణముగ ముంగిటిన
రప్పించి తల్లికై రాజిల్లె సత్సుతుడు 

సన్యాసమును దీక్ష సరికాదు యనగాను 
మొసలిపట్టుకొనగను ముముక్షత్వము గోరె 

తల్లి సమ్మతినీయ తక్షణమకరి యొదిలె 
గురువుగారిని జేరె  గోవింద స్వామికడ 

నర్మదా నదిపొంగ నాయలల తగ్గించి 
గురుతపసు కాపాడి గురుదీవెనలు పొందె 

వారణాసిని జేరి వాసిగా శివునాజ్ఞ 
ఉపనిషత్తులు సార ముకు భాష్యములు వ్రాసె 

ప్రస్థాన త్రయమనుచు ప్రసిద్ధిగ రచించి 
అల్పకాలము నందె అమరులై భాసించె !!

మనీషా పంచకము మరియెన్నొ స్తోత్రాలు 
ఆ శైలి యద్భుతము అనితరము సాధ్యమ్ము !!

అఖిలభారతమంత ఆయన పాద స్పర్శ
శక్తిపీఠాలలో శాంతి శ్రీ చక్రమ్ము 

సకలజీవులకొరకు సాధువై జన్మించి 
పావనిగ నిలిచారు పాపాల తొలగించ!!

కామెంట్‌లు