తాజా గజల్ ;-ఎం. వి. ఉమాదేవి
నేడేకద  ప్రహ్లాదుని కాపాడెను  నరసింహుడు 
అసురీయత అవివేకము దునుమాడెను నరసింహుడు 

వైశాఖము చతుర్దశిన శనివారపు  సంజెపుట్టె 
అరిఎదుటను భయంకరపు మాటాడెను నరసింహుడు 

వెతనిండిన లీలావతి  సుతునిగాంచి కుములుతుంది 
పసిబాలుని ముగ్ధభక్తి ఆటాడెను నరసింహుడు 

హరిశత్రువు జయవిజయుల జన్మవైర వైనముకద
హిరణ్యకుని గడపమీద రాపాడెను నరసింహుడు 

సుతునెంతో బుజ్జగించి దండించిన ఫలములేదు 
ఏడనుండె దేవుడనగ వెంటాడెను నరసింహుడు 

స్థంభములో ఉద్భవించి నరమృగమే శ్రీహరి కథ 
ఉరముజీల్చి ఉగ్రమయ్యి చెండాడెను నరసింహుడు 

ప్రహ్లాదుని స్తుతులతోటి ప్రసన్నుడై స్వామి నిలచె 
రమాదేవి సమేతమై నడయాడెను నరసింహుడు !


కామెంట్‌లు