చిత్త శుద్ధి లేని పూజ;-ఏ.బి ఆనంద్ఆకాశవాణిPh.no- 94928 11322
 అమ్మ వంటకాన్ని పరిశీలించడానికి వంటగదికి  వెళితే మనకు ఏం కనిపిస్తుంది? ఆ పూట శాకపాకములు ఏర్పాట్లు ఏ కూర చేయదలచుకున్నదో ఆ పదార్థాన్ని తీసి పూర్తిగా కడిగి  దానిని ఆరబెట్టి,  కత్తిపీట తీసి దానిని శుభ్రం చేసి కడిగి, తుడిచి అప్పుడు ముక్కలు కోయడం ప్రారంభిస్తుంది. అదే ఆకుకూరయితే బాగా  నీళ్లలో నానబెట్టి  మట్టి  పోయేటట్లుగా కలిగి  తనకు కావలసిన  పద్ధతిలో తరుగుతుంది  వంట చేయడానికి పాత్రను తీసుకుని  దానిని కూడా పూర్తిగా కడిగి తుడిచి పొయ్యి మీద పెట్టి అప్పుడు ప్రారంభిస్తుంది కూర చేయడం. ఇదంతా ఎవరి కోసం చేస్తోంది తమకోసం, తమసుఖం కోసం,తమ ఆరోగ్యం కోసం, తమ కుటుంబం క్షేమంగా ఉండాలని  ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆమె కోరిక. అమ్మ మనసు ఎంత కమ్మటిదో మహా కవులు కూడా ఆవిష్కరింప లేకపోయారు అలాగే నాన్న  ఉదయాన్నే  కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పట్టు బట్టలు కట్టి  దేవత అర్చనకు కూర్చోబోయే ముందు  ఆ స్థలాన్ని పూర్తిగా ఊడ్చి  ఒడిలిపోయిన పూలను  ప్రక్కనున్న చెత్తాచెదారం మొత్తం దూరంగా పారేసి కొంచెం నీళ్ళు చల్లి ముగ్గు వేసి  పసుపు కుంకుమలతో అలంకారం చేసి,  దీపపు కుందిలో నూనెపోసి,  కొత్త  ఒత్తిని  తయారుచేసి  పక్కనే అగ్గి పెట్టి పెట్టుకొని అప్పుడు మిమ్మల్ని పిలుస్తాడు.
నాన్నగారు పిలిచారు కనక వెళ్లి  పూజ చేసుకున్నట్లుగా నటిస్తాము తప్ప  నిజంగా మనసు పెట్టి  ఆ దేవిని మనసులో ప్రతిష్టించుకోము. నాన్నగారు పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచారో నీ మనసును కూడా అంత శుభ్రంగా ఉంచుకోక పోతే నీవు చేసిన  పూజ ఎందుకూ పనికిరాదు. ఎడ్డిమడ్డిగా  అమ్మ వంట చేస్తే  ఆ పదార్థాలు తింటే ఏమవుతుంది?  దానిని దృష్టిలో పెట్టుకునే కదా అమ్మ అంత కష్టపడేది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో మనం కొన్ని అంశాలను ఆచరించాలి. ముందు ఆత్మను పరిశుభ్రంగా ఉంచుకొని ఆ తర్వాత రంగంలోకి దిగాలి  అప్పుడు మన పెద్ద వాళ్ళు ఎందుకు అవి  ఏర్పాటు చేశారో దాని ఫలితం దక్కుతుంది లేకుంటే మామూలే. ఎవరూ ఎవరినీ ఈ భగవంతుడ్నే పూజించండి అని చెప్పరు. ఏ పేరుతో, ఏ ప్రాంతంలో చేసినా ఆయనకే దక్కుతుంది తప్ప మరొకరికి కాదు అన్న విషయం స్పష్టంగా పెద్ద వారికి తెలుసు అందుకే వారు దీనిని నిషేధించారు.  అర్థం చేసుకొని ఆచరిస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది  లేకపోతే దుష్పరిణామాలు  తప్పవు. ఈ విషయాన్ని వేమన చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా అని ప్రశ్నించాడు మీరూ కొంచెం ఆలోచించండి  మీకే అర్థమవుతుంది?

కామెంట్‌లు