*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౮౯ - 089)*
 *దైవ పద్ధతి*
చంపకమాల:
*దొసఁగులు వచ్చువేళ గుణ ధుర్యులధైర్యగుణంబు సర్వముం*
*బసచెడు నంచుఁజూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ*
*వ్యసనము మాను మాను, ప్రళ యంబున వీతనిజక్రమంబు లై*
*నసి సెడ వించుకంతయును సాగరముల్ గులపర్వతంబులున్.*
*తా:*
ధైర్యము వుండి, మంచి గుణమును పాటిస్తూ వుండే వారికి కష్టాలు వచ్చినప్పుడు, వారి ధైర్య గుణాన్ని వారు వదలివేసే పరిస్థితులు కల్పించే నీ చెడు అలవాటు మానుకో దేవా! కష్టాలు వచ్చింత మాత్రమున ధైర్య వంతులు ధైర్య గుణాన్ని వదులుకోరు. ఎందువలన అంటే, ప్రళయము వచ్చినప్పుడు ఎత్తైన కొండలు, లోతైన సముద్రాలు వాటి వాటి స్వరూపాన్ని మార్చుకోవు........ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*కర్ణుడు తాను కుంతీ కుమారుడు అనే విషయం తెలిసి, తాను పంచపాండవుల తో కలసి హాయిగా రాజ్య సౌఖ్యాలు అనుభవించవచ్చు అని తెలిసినా, పాండవులతో కలువ లేదు, రారాజు పక్షం వదల లేదు.  శిబి చక్రవర్తి, నారాయణుడు బాల వటుడుగా తన ముందుకు వచ్చి మూడడగుల చోటు అడిగినప్పుడు, ఆ వచ్చి వాడు దైత్యవైరి లక్ష్మీ నారాయణుడు అని కులగురువు చెప్పినా, తన దాన గుణాన్ని వదలు కోకుండా రెండు అడుగులతో భూమి ఆకాశాలను కొలిచిన వైకుంఠుడు మూడవ అడుగు చోటు చూపమంటే, తాను చంప బడతాను అని తెలిసి కూడా తన తలను చూపుతాడు, బలి. ఇవి కదా ధీర గుణానికి మచ్చుతునకలు. ఇటువంటి అచంచలమైన ధీర గుణాన్ని మనకందరకు అనుగ్రహించాలని ఆ కమాలక్షుని వేడుకుంటూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు