*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౯౦ - 090)*
 *దైవ పద్ధతి*
తేటగీతి:
*ఎవ్వనికి నిజ్జగంబున నెంతఫలము*
*దైవకృతమగునది వొందుఁ దప్ప కతనిఁ,*
*గారణము గారు పెనుఁబ్రాపు ఘనునిఁ జేరు*
*చాతకమువాతఁబడు నల్పజలకణములు*
*తా:*
ఈ భూమి మీద ఎవరికి ఎంత ఇవ్వాలి అని దేవుడు ముందు నిర్ణయం చేసిన తరువాత మనల్ని భూమి మీదకు పంపాడు. కాబట్టి మనకు రావలసినది, మనము ఎవరి పంచన వున్నాము అన్నదానివల్ల రాదు. మనకు రావలసినది మనకు వస్తుంది. అకాశం నుండి పడే వర్షం లో కొన్ని వేల బిందువులు పడతాయి కానీ, చేతక పక్షి నోటిలో పడాల్సిన ఒకటి రెండు చుక్కలు ఏవో అవే పడతాయి....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*వాలి తనకు వున్న దానితో తృప్తి పడక సుగ్రీవుని రాజ్యాన్ని కూడా కోరుకున్నాడు. మొత్తం రాజ్యాన్ని, తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. సీతమ్మ తనది కాదు అని తెలిసినా, రావణ బ్రహ్మ కోరుకున్నాడు. ఏమైంది, రాజ్యము, ప్రాణాలు రెండూ పోయాయి. ధార్తరాష్ట్ర కుమారుడు రారాజు, తనకు ఉన్నదానితో తృప్తి పడక, పాండవుల సర్వస్వాన్ని కోరుకున్నాడు. తనను, తనకు ఉన్నదానిని కూడా కోల్పోయాడు. ఎంత ప్రయత్నించినా మనది కానిది ఎప్పటికీ మనకు రాదు. కుచేలుడు కృష్ణమూర్తి వద్దకు వెళ్ళి ఏమీ అడగలేదు కానీ, ఆతనికి ప్రాప్తమున్నవి అన్నీ ఇచ్చాడు పరమాత్ముడు. కాబట్టి, రావలసినది రాక మానదు. మనకు రావలసినది వచ్చినా, రాకపోయినా అంతా దేవుని నిర్ణయం గా ఒప్పుకుని వుండాలి.ఇలా వుండగల స్థిరత్వాన్ని పరమేశ్వరుడు మనకు ఇవ్వాలని ప్రార్థిస్తూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు