*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౯౧ - 091)*
 
*కర్మ పద్ధతి*
చంపకమాల:
*శిధిలత లేనిభక్తినతి సేయుదు వేల్పుల, కాసుపర్వులున్*
*విధివశవర్తు, లావిధియు విశ్రుతకర్మఫలప్రదాత, య*
*య్యధికఫలంబు కర్మవశ, మట్లగుంటం బనియేమివారిచే?*
*విధి కధికంబు గర్మ మని వేమరు మ్రొకగకి భజింతుఁగర్మమున్.*
*తా:*
దేవతలకు నమస్కారం. ఆ దేవతలు కూడా విధి కి లోబడి వున్నారు. ఆ విధి మనము చేసే కర్మలను అనుసరించి ఫలితమును ఇస్తుంది. కాబట్టి, దైవము, విధి కంటే గొప్పదిగా కనిపిస్తున్న కర్మనే మనము నమ్ముకుని వుండటం మంచిదేమో. చివరగా ఫలము కర్మను బట్టి వస్తుంది. దేవతలు కూడా దాటలేని కర్మకు నమస్కారం చేద్ధాము....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మనిషి జీవనం సాగించడానికి పరమాత్ముడు ఇచ్చిన వరం "బుద్ధి". అయితే, ఈ బుద్ధి కర్మానుసారిణి. మనము ఈ జన్మ లో చేసే పనులకు అన్నిటికీ ఇతః పూర్వం మనచే చేయబడిన కర్మయే కారణము. కర్మ అనేది, చేతలతో చేయబడినది మాత్రమే కాదు. మానసికంగా, ఆలోచనల పరంగా కూడా చేసిన కర్మలు కూడా వుంటాయి. అందువల్ల, మనం పదిమందికి పనికి వచ్చే పనులు చేసేలా, మానసికంగా ఎదుటి వ్యక్తి గురించి మంచి ఆలోచనలు చేసేలా, తద్వారా మనకు వచ్చే కర్మఫలం మనకు ఆనందాన్ని కలుగించేదిగా, ఆ పరమాత్మడు మనల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు