*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౮౩ - 83)*
 *మహాప్రళయకాలమందు కేవలము సద్బ్రహ్మయొక్క శక్తిని ప్రతిపాదించుట - నిర్గుణ నిరాకార బ్రహ్మచేత యీశ్వరమూర్తి ప్రాకట్యము - సదాశివుని ద్వారా స్వరూపభూతశక్తి ప్రాకట్యము - వీరి ద్వారా ఉత్తమక్షేత్రమైన కాశీ లేక ఆనందవనము ప్రాదుర్భావము - శివుని వామాంగము నుండి విష్ణువు ఆవిర్భావము - వర్ణన*
*సదాశివుని యొక్క ఎడమ భాగము నుండి ఉద్భవించిన రెండవ పురుషుడు శివ పార్వతులకు నమస్కరించిన తమ అంశను చూచి, "వత్సా! నీవు ఈ విశ్వమంతా వ్యాపించి వుంటావు అందువలన నీవు " విష్ణువు "గా పిలవ బడతావు. ఈ విష్ణువు అనే పేరు కాకుండా, నీవు ఇంకా ఎన్నో పేర్లతో పిలవ బడతావు. నీ ఆ పేర్లు అన్నీ కూడా, ఈ సృష్టి లోని సకల చరాచర రాసులకు శుభమును చేగూర్చుతాయి. నీవు ఉత్తమమైన తపస్సు చేయి. ఈ తపస్సు, నీవల్ల అవ వలసిన‌ అన్ని పనులనూ సాధించడానికి మార్గం సుగమము అవుతుంది." ఇలా చెప్పిన తరువాత సదాశివుడు విష్ణువు కు శ్వాసమార్గం ద్వారా వేదవిజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ తరువాత, ఎప్పుడూ నాశనము కాని "అచ్యుతుడు" తన దివ్యమైన తపస్సుకు ఉపక్రమిస్తాడు. శక్తి తో కూడి మహాశివుడు, శివ పార్షదులతో కలసి అంతర్ధానము అవుతారు.*
*విష్ణువు చాలా కాలము ఎంతో శ్రమకు ఓర్చి సుదీర్ఘ తపస్సు చేసాడు. ఈ  విధంగా తపస్సు చేస్తున్నప్పుడు విష్ణువు శరీర భాగాలనుండి అనేక విధములైన జల ధారలు వచ్చాయి. ఈ జలధారలు శివమాయ వల్లనే ఏర్పడ్డాయి. ఇలా వచ్చిన జలధారలు విశ్వమంతా వ్యాపించి నిండిపోయాయి. ఈ జల స్పర్శ చేతనే అన్ని పాపాలు నశింప చేసేవిగా అయ్యాయి. తపస్సు చేసి అలసిపోయిన విష్ణువు ఈ జలధారలలో సేద దీరుతాడు. జలానికి ఇంకొక పేరు. "నారా". అందువల్లే, విష్ణువు కు " నారాయణుడు " అనే పేరు కూడా వచ్చింది.*
*అలా జలముపైన విష్ణువు పరుండినప్పుడు, ఈ చరాచర సృష్టి లో ఒక్క విష్ణువు మాత్రమే వున్నాడు. వేరు ఎవరూ లేరు. ఆ తరువాత సమయాను సారంగా అన్ని తత్వాలు  వెలువడ్డాయి. ఆ తత్వములు అన్నీ ఈ వరుసలో వెలువడ్డాయి.*
*ప్రకృతి నుండి మహత్తత్వము, దాని నుండి సత్వ రజస్ తమో గుణములు వెలువడ్డాయి. ఈ మూడు గుణములలో వున్న తేడా వల్లనే మూడు రకాల అహంకారములు పుట్టాయి. ఈ అహంకారముల నుండి, పంచ తన్మాత్రలు, వీటి నుండి పంచ భూతములు వచ్చాయి. ఆ పిదప, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏర్పడిన తత్వములు అన్నీ, ఒక్క పురుషుడు తక్క, ప్రకృతి నుండే ఏర్పడ్డాయి. అందువల్ల ఈ తత్వములు అన్నీ కూడా జడములు అవుతాయి. ఇటువంటి జడములు అయిన ఇరవైనాలుగు తత్వములను ఆ పరమపురుషుడు గ్రహించి నారాయణుడు సదాశివుని కోరికతో కూడిన ఆజ్ఞను అనుసరించి ఆ జలసమూహంలో శయనిస్తాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు