“నా రచనలన్నీ నాకూ ఇష్టమే!”
మాతృదినోత్సవం (8-5-22) సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటి, భాషా సాంస్కృతిక శాఖవారు సంయుక్తంగా “షష్టిపూర్తి కలాలకు మాతృమూర్తివందనం” కార్యక్రమం నిర్వహించింది. ఏడు పదులు నిండిన ‘31 మంది సాహితీ స్త్రీ మూర్తులు’’ సన్మానం అందుకున్న వారిలో ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి తమిరిశ జానకి గారు కూడా ఒకరు. వారిని ఆ సందర్భంగా కలిసినపుడు వారి సాహితీ ప్రయాణం గురించి తెలుసుకోవటం జరిగింది.
• నమస్తే జానకి గారు ! పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మరియు తెలంగాణా భాష సాంస్కృతిక శాఖ వారు నిర్వహించిన షష్టిపూర్తి కలాలకు మాతృవందనం లో మీకు సన్మానం జరిగినందుకు అభినందనలు. మీ సాహిత్యం గురించి తెలిపే ముందు మీ ఊరు బాల్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
మా ఊరు నర్సాపురం. పశ్చిమ గోదావరి జిల్లా. పుట్టిన ఊరు మచిలీపట్నం కృష్ణాజిల్లా. బి. ఏ. వరకు చదువుకున్నాను. ..
• సాహిత్య ప్రయాణం ఎప్పుడు మొదలయింది.?
నేను ఎస్. ఎస్. ఎల్. సి. చదివేటప్పుడు నా మనసులో కలిగే ఎన్నో భావాలు, ఆలోచనలు, స్పందనలు కాగితాలమీద పెడుతూ వుండేదాన్ని. వాటినే చిన్న చిన్న కవితల రూపంలో మలిచి రాసేదాన్ని. అవి మా నాన్నగారికి చూపించేదాన్ని. వారు బాగా ప్రోత్సహిస్తూ ‘బాగా రాస్తున్నావు. ఇలాగే రాసి పత్రికలకి పంపిస్తూ వుండు’ అని అనేవారు. అలాగే స్థానిక పత్రికలకి పంపేదాన్ని. అలా నా రచనా వ్యాసంగం కవితలతో మొదలైంది.
చదువుకునే రోజుల్లోనే చిన్న చిన్న కథలు రాయటం మొదలు పెట్టాను. కాలేజీ మాగజైన్స్ కి కథలు పంపేదాన్ని. “మంజువాణి” అనే పత్రిక వారు విద్యార్ధులకు నిర్వహించిన కథల పోటీలో నా కథకు బహుమతి వచ్చింది. అప్పటి నుంచి వై. జానకి పేరుతో రచనలు వచ్చా వచ్చాయి . అప్పుడే అన్నీ ప్రముఖ పత్రికలలో నా రచనలు ప్రచురించాయి. నాకు 1965 లో వివాహం అయినప్పటి నుంచీ రాసిన రచనలు తమిరిశ జానకి పేరుతో రాస్తున్నాను. 1993 లోనే కెనడాలో కూడా తెలుగు అసోసియెషన్ వారు సత్కారం చేశారు.
• తొలిసారి రాసిన తొలి కవిత?
నేను రాసిన తొలి కవిత పేరు "అమ్మ".
"అమ్మ అనే పేరులోనె
దైవత్వం ఉన్నదిలే!
దేవుడనేవాడు ఎక్కడో లేడులే
కన్నతల్లి రూపంలో
ప్రకృతిమాత రూపంలో
సేదదీర్చు మనిషిని
తన ఒడిని చేర్చుకుని !
అమ్మనీ ప్రకృతినీ ఆదరించి గౌరవిస్తే
ఆశాభంగం ఉండదు మనిషికి !
• చాలా బాగుంది “అమ్మ” మీద కవిత. తొలి కవితే అమ్మ మీద రాశారు.
మీరు రాసిన నవల ‘విశాలి’ గురించి .. అది సినిమాగా వచ్చినపుడు మీ అనుభూతులు.
నేను రాసిన మొదటి నవల ‘విశాలి’. అది 1971-72 మధ్య ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. ఆ నవలని “విశాలి” అనే పేరుతోనే సినిమాగా తీశారు. సీరియల్ ముగిసిన రోజే ఒక నిర్మాత, ఒక దర్శకుడు మద్రాసునించి కార్లో మా ఇంటికి వచ్చారు. మేము అప్పుడు కోయంబత్తూరు దగ్గర ఉన్న "మదుక్కరై" అనే ఊళ్ళో ఉన్నాము. నిజం చెప్పాలంటే వాళ్ళు "విశాలి నవల సినిమా తీస్తాము, కొనుక్కోవడానికి వచ్చాము" అని అడిగినప్పుడు అదేదో చాలా మామూలు విషయం అన్నట్టుగా అనిపించింది తప్ప పెద్దగా నాలో ఏమీ ఎగిరి గంతేసే స్పందన కలగలేదు. ప్రీవ్యూ షోకి హైదరాబాద్ ఆహ్వానించారు. కుటుంబంతో కలిసి వచ్చాను. ఎన్.టి.ఆర్.గారిని ముఖ్య అతిథిగా పిలిచారు వాళ్ళు. బసవతారకం గారితో కలిసి ఎన్.టి.ఆర్.గారు వచ్చారు. ఆ సినిమాకి కథా రచయిత్రిగా నన్ను వాళ్ళకి పరిచయం చేశారు. ఆ సినిమాలో కృష్ణంరాజు, శారద, శ్రీధర్ నటించారు. విశాలి నవలని ఎం.ఎస్. కో. వారు రెండుసార్లు ముద్రించారు.
• ఇంతవరకు మీరు రచించిన నవలలు, కథలు కవితల గురించి వివరాలు.
కథలు నాలుగు వందల వరకు రాశాను. పదిహేను నవలలు, మూడు వందల యాభై కవితలు రాశాను. ఇవి కాకుండా పుస్తక సమీక్షలు, ముందు మాటలు, రేడియో లకి స్వీయ రచనలు చేశాను. ఇప్పటికీ రచనలు చేస్తూనే వున్నాను.
• మీ రచనలే కాకుండా వివిధ సాహితీ సంస్థలలో కూడా వున్నారు. వాటి గురించిన వివరాలు.
ప్రముఖ రచయిత్రులచే ఏర్పడిన ‘సఖ్య సాహితీ సంస్థ’ లో లైఫ్ మెంబర్ గా గాను, ‘లేఖిని’ మహిళా చైతన్య సాహితీ సంస్థ లో లైఫ్ మెంబర్ గా మాత్రమే కాకుండా ప్రధాన కార్యదర్శి గానూ, ఆతర్వాత ఉపాధ్యక్షురాలిగానూ ఉండేదాన్ని. ఇప్పుడు మూడుసంవత్సరాలుగా ‘మహిత సాహితీ సంస్థ’ కు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నాను. తరచూ సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటాము.
• ప్రస్తుతం వస్తున్న సాహిత్యం చదివే పాఠకులు వున్నారా?
సాహిత్యం కాలానుగుణంగా సాగిపోతూ ఉంటుంది. అంటే కాలానికి తగ్గట్టుగా రచనలు వస్తూ ఉంటాయి. పాఠకులు ఉన్నారు.
• అంతా ఎలక్ట్రానిక్ మీడియా ఉపయోగిస్తున్నారు. తెలుగు సాహిత్యానికి ఆదరణ వుందంటారా ?
అంతటా ఆధునికత సంతరించుకున్నట్లే మన తెలుగు సాహిత్యం కోసం ఎన్నో ఆన్ లైన్ పత్రికలు వచ్చాయి. దానివల్ల ఎక్కడ నుంచైనా మన సాహిత్యం చదివే వీలు కలిగింది. చదివే పాఠకులూ చాలా మందే వున్నారు. తెలుగు సాహిత్యానికి ఆదరణ ఎప్పుడూ ఉంది. కానీ అది నిలబడాలి అంటే ఈ తరం యువత మీద ఆధారపడి ఉంటుంది.
• మీకు నచ్చిన మీ రచన అంటే ఏది చెబుతారు.?
ఏ తల్లి అయినా తన బిడ్డల్లో ఏబిడ్డ అంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే ఏం చెప్పగలదు ? నా రచనలన్నీ నాకు ఇష్టమే.
• మీకు ఎవరి రచనలైనా స్పూర్తి వున్నదా?
నామీద ఏ రచనల ప్రభావం గానీ , ఏరచయిత /ఏరచయిత్రుల ప్రభావంగానీ లేదు. నా శైలీ, నా రచనా విధానం,నాఆలోచనాధోరణీ నాదే.
• మీకు ఎవరి రచనలు అంటే ఇష్టం?
అసభ్యకరంగా రచనలు చేయని వారందరి రచనలూ నాకు ఇష్టమే. అవి కవితలైనా,కధలైనా,నవలలు అయినా మానవత్వాన్ని చాటిచెప్తూ అంతర్లీనంగా మంచి సందేశాన్ని పాఠకులకి అందించే రచనలు చేసే రచయితలు/రచయిత్రులు ఎవరైనా ఇష్టమే. ఫలానా రచయిత, రచయిత్రి అని చెప్పలేను.
• షష్టిపూర్తి కలాలకి మాతృవందనం కార్యక్రమంలో అందుకున్న ఆత్మీయ సత్కారం గురించి మీ స్పందన?
ఇంత గొప్ప సాహితీ కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు ఆ భగవంతుడికి, మా అమ్మా నాన్నగార్లకి నా హృదయ పూర్వక అభివందనాలు చెప్పుకుంటున్నాను.ఇంతపెద్ద గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి, భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణా ప్రభుత్వం వారికి, చిత్రవాణి ఆడియో వీడియో విభాగం వారికి నా కృతజ్ఞతా పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.ఆత్మీయురాలు శ్రీలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఇదీ తమిరిశ జానకి గారితో జరిపిన సంభాషణ.
*
ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకిగారి సాహిత్యంలో మంచి కథలు వున్నాయి. కథాంశాలు కూడా గజిబిజి కాకుండా కుటుంబ నేపధ్యంలోనే సాగుతాయి. చదువరులు ఆసక్తిగా చదివే కథలు అవి. . “వీడిన మబ్బులు” వీరి రెండవ నవల ఆంధ్రపత్రికలో సీరియల్ గా వచ్చింది 1973 లో. రేడియోల్లో వీరి పుస్తకాలపై సమీక్షలు, కథలు, నాటికలు ప్రసారమయ్యాయి. కవితలు, కథలు, స్వీయపఠనం లో ప్రసారమయ్యాయి. ఇప్పటికీ ఆలిండియా రేడియో వనితావాణిలో స్వీయకథాపఠనం చేస్తున్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారి పురస్కారాన్నిరెండుసార్లు అందుకున్నారు. ‘గృహలక్ష్మి స్వర్ణకంకణం’ మద్రాసు కేసరి కుటీరం వారిచే అందుకున్నారు.
1993 లో అమెరికాలో తెలుగు అసోసియెషన్ వారి సత్కారం అందుకున్నారు.
కృష్ణాజిల్లా రచయితల సంఘం వారిచే మచిలిపట్నంలోనూ, విజయవాడలోనూ రెండుసార్లు సన్మానించారు.
వరంగల్, ఒంగోలు విజయనగరం, మచిలీపట్నం ,రాజోలు,విజయవాడ, హైదరాబాద్ లలో అనేక సంస్థలు సత్కరించాయి.
హైదరాబాద్ దూరదర్శన్ వారు ఇంటికి వచ్చి ఇంటర్వూ చేశారు. ఇంకా రెండు టీ.వీ.ఛానల్స్ కూడా ఇంటర్వూ చేశాయి. ఆకాశవాణి విజయనగరం కేంద్రం వారు, ఆస్ట్రేలియా నుండి టోరీ రేడియో వారు గంటసేపు లైవ్ ఇంటర్వూ చేశారు.
డా. అమృతలత గారు వీరిని జీవన సాఫల్యం పురస్కారమిచ్చి సత్కరించారు. 59 నుంచి ఇప్పటి వరకూ వీరి రచనలు ప్రచురితమవుతూనే వున్నాయి. వీరి సాహిత్యం అంతా
26 పుస్తకాలుగా వచ్చాయి. (నవలలు, కథలు, కవితలు)
సాహిత్య సెమినార్లలోనూ పాల్గొన్నారు. వీరి సాహిత్యంపై విధ్యార్ధులు ఎం. ఫిల్. చేశారు.
అటు ముద్రణా రంగంలోనూ, ఇటు అంతర్జాల పత్రికలలోనూ తమిరిశ జానకి గారి సాహిత్యం వచ్చాయి. వీరిని అన్నీ సాహిత్య, సాంస్కృతిక సంస్థలు, సన్మానించాయి.
• సాహిత్య అకాడమీ దక్షిణ విభాగం వారి ఆహ్వానం పై మద్రాసులో జరిగిన మూడురోజుల సెమినార్లో పేపర్ ప్రెజంట్ చేశారు.
• సాహిత్య అకాడమీ దక్షిణవిభాగం వారు హైదరాబాద్ లో లేఖిని సంస్థ ద్వారా జరిపిన సమావేశంలో వీరి కధలపై మరొక రచయిత్రి పేపర్ ప్రెజెంట్ చేశారు.
తమిరిశ జానకిగారి రచనలు:
• నవలలు:
(1) విశాలి 2)వెన్నెల విరిసింది (3)వీడినమబ్బులు
(4) ఇది ఏ రాగమో (5)అందానికి సమాధి (6)మలుపు
(7)బొమ్మలు (8) జీవితచక్రం (9)కధలాంటి జీవితం
(10)అశోకవనంలో సీత (11)ముఖారిరాగం (12) నీలిచందమామ
(13) రాజహంస (14) మనసుపాడింది సన్నాయిపాట (15) సాగరి
• కధాసంపుటాలు:
(1)మూగమనసులు (2) మనసిది నీ కోసం (3)మరొక తలుపు
(4)డా.రచయిత (5)ఎంతో చిన్నది జీవితం (6) తమిరిశ జానకి మినీకధలు (7)సైలెంట్ స్ట్రీమ్ (ఆంగ్లంలోకి అనువదింపబడిన కధలు) (8) ఆడది
• కవితాసంపుటాలు:
(1) కవితాసుమాలు (2) స్వప్నపుష్పాలు
ఆనాటి సినిమా “విశాలి” కథా (నవలా) రచయిత్రి తమిరిశ జానకి గారితో ముఖాముఖి: తమిరిశ జానకి గారితో ముఖాముఖి: ;-- మణి నాథ్ కోపల్లె --9703044410
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి