సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్;-- యామిజాల జగదీశ్
 సంగీతాన్ని శ్వాసించారు
సంగీతంలో ధ్యానించారు
సంగీతంతో మమేకమయ్యారు
తన సంగీతాన్ని వినే ప్రతి ఒక్కరితోనూ పవిత్ర ప్రయాణంతో ఆలయదర్శనం చేయించారు
కంచి కామాక్షినీ
మదురై మీనాక్షిని
కళ్ళముందుకు తీసుకొచ్చే శక్తి
ఎం.ఎస్ స్వరఝరీకి ఉంది.
ఇన్ని విశేషాలున్న సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి సంబంధించి కొన్ని మాటలు....
మదురైలో సంగీత ప్రపంచ అద్భుతాలలో ఒకరుగా అవతరించారు. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ దగ్గర  కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, పండితూడు నారాయణ రావు దగ్గర హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్న ఈమె పదిహేడో ఏట సంగీత కావ్యంలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
పెళ్ళిళ్ళల్లో కచేరీ అయితే ఒకలా, ఆలయాలలో కచేరీ అయితే ఒకలా, సభలలో కచేరీ అయితే మరోలా అంటూ ఆమె ఎన్నడూ తేడాలు చూపలేదు తమ జీవితంలో. 
భరణిలో పుట్టారు...ధరణిని పాలించారు అని అంటుంటారు. అలా ఆమె భరణిలో పుట్టిన సంగీత సామ్రాజ్ఞిగా ధరణిని ఏలారు.
సంగీత ప్రపంచ మహారాణి ఓ వెలుగు వెలిగిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి, చలనచిత్రపరిశ్రమకూ మధ్య ఉన్న బంధం ఈతరం వారికి అంతగా తెలియకపోవచ్చు. 
సినిమాలలో వేయి మంది పాడి ఉండొచ్చు. కానీ సినిమాలలో ధ్వనించిన దైవీక స్వరం ఎం.ఎస్. సొంతం.
సంగీత సామ్రాజ్యానికీ, వెండితెర జగత్తుకీ 
ఆమె ఆలాపన ఓ ఆణిముత్యం.
సినీ పరిశ్రమలో ఆమె వంతు బహు తక్కువే అయివుండవచ్చు. కానీ పరిపూర్ణమైనది. ఈరోజు వరకు ఎం.ఎస్. సంగీతశిఖరాగ్రాన్ని ఎవరూ అందుకోలేదన్నదే వాస్తవం.
 
ఓమారు ముంబైలో కచేరీ చేయడానికి వెళ్ళినప్పుడు రైలులో పరిచయమయ్యారు సదాశివం. అప్పటికింకా ఆయన ఓ యువకుడే. ఎంఎస్ గాత్రానికి వీరాభిమాని. 
ఆమె ప్రతిభను ఇంకా ఇంకా బయటకు తీసుకురావాలని, ఆమె ఖ్యాతిని అత్యున్నతస్థాయికి తీసుకుపోవాలనీ ఆశించారు. తర్వాతి కాలంలో ఆమెను వివాహమాడారు.సంగీతంలోనూ సమాజంలోనూ తన భార్యకు ఓ ప్రత్యేక స్థానం ఉండాలనే లక్ష్యంతో ముందడుగువేశారు. తన సంగీత ప్రయాణానికి ఓ గొప్పతనాన్ని తన భర్త తీసుకొస్తారని తలచి ఆమె తన్మయు లయ్యారు. 
అనంతరం ఆమె పాడని పాటంటూ లేదు. ఆమె వెళ్ళని దేశమంటూ లేదు. పొందని బిరుదంటూ లేదన్నంతగా ఆమె ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. తాను పాడి సంపాదించిన డబ్బులో అధిక భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఇచ్చేసారు. దైవకార్యాలకు ఇచ్చారు.
 
ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన కృష్ణుడిని స్మరిస్తూ కరిగిపోయే భక్త మీరా కథను ఎల్లిస్ ఆర్. డంకన్ దర్శకత్వంలో వెండితెరకెక్కింది. ఈ సినిమాలో భక్త మీరాగా ఎం.ఎస్. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎస్.వి. వెంకట్రామన్ సంగీతంలో ఎం.ఎస్. పాడిన పాటలు వింటుంటే అది సినిమానా లేక మీరా ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారా అనిపించే స్థాయిలో ఆ పాత్రలో జీవించారు. 
ఎం.ఎస్. జీవితంలో ఈ భక్త మీరా ఓ మైలురాయి. సరోజినీ నాయుడు ఈ సినిమాను చూసాక భారతదేశపు గానకోకిల అని కీర్తించారు. ఆప్పటి దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాట్లాడుతూ ఈ సంగీత రాణి ముందు తానొక సాధారణ ప్రధాన మంత్రినని చెప్పుకున్నారు.
ఈతరం యువత మంచి సంగీతంతో మమేకమవాలని ఆశించిన ఎం.ఎస్. "తల్లులు రాబోయే తరానికి మంచి రసానుభూతిని కల్పిస్తే దేశంలో సంగీతం వృద్ధి చెందుతుంది...అంటే భక్తి పెరుగుతుంది. దేశ ప్రజలకు మంచి జీవితం లభిస్తుంది" అన్నారు.
సంగీతాభివృద్ధితో ప్రజల సంక్షేమం దేశ సంక్షేమం వృద్ధి చెందుతున్నది ఎం.ఎస్. విశ్వాసం.
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఎం.ఎస్. చెప్పిన మాటలు ఇప్పటికీ స్వీకరించవలసినవే. 
సంగీతంతోనూ, దైవకార్యంతోనూ, దానగుణంతోనూ భారతీయ స్త్రీమూర్తికో చిహ్నంగా విలసిల్లిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 2004 డిసెంబర్ 12వ తేదీన కాలధర్మం చెందారు.

 
కామెంట్‌లు