ఊరిస్తున్న కారుమేఘాల కదలికలు
రాబోయే కుంభవృష్ఠికి సూచనలవ్వాలి
బీటవారినట్టి భూమిని స్పర్శించిన వానచినుకులు
ఉగ్గుగిన్నెతో పాలుపట్టించడం
కాదు.. ఏనుగు తొండమై జలధారలు పడితేనే
పగుళ్లువారిన నేలా, రైతు మనసూ మెత్తగయ్యేది
ఒక చల్లని పవనం ఊరిమీదుగా బయలుదేరాక
పరుగులు తీసే మేఘాలని
ఫేటేల్మని చెంపదెబ్బల్లా...
కొన్ని ఉరుములు,భయపెట్టే కాగడాల్లా మెరుపులు..
కలిసే చేసే వర్షతాండవ హేల..
కరువు కమ్మిన చోట కమనీయదృశ్యంగా,
మూటలు విప్పిన విత్తనాలతో
ముదితల నడుముచుట్టూ దోపిన చీరకొంగయి...
రైతు మనసులో భాగీరథీహోరు
అంతస్థులలో అన్నం దొరకడం
ఆగినప్పుడుగానీ...
జలసామ్రాజ్యవైభవం గుర్తురాదు...
అందాకా... నదీ గర్భంలో
నాయకుడి భవనం...
వనాలనరికిన చప్పుడే వసుధనిండా... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి