దొడ్డ మనసు! అచ్యుతుని రాజ్యశ్రీ

 రోజూ శివాలయంముందు ఎంతోమంది  బిచ్చగాళ్లు పిల్లాపీచుతో సహా కూచుంటారు.పాతికేళ్ళ పడుచుమొదలు పండుముసలిదాకా వచ్చేపోయేవారిని సతాయిస్తుంటారు.వేసిన డబ్బు చాలదని గొణుక్కుంటూ ఉంటారు. శివ రోజూ గుడికి వెళ్తాడు.లోపల తీర్థం ప్రసాదం తీసుకుని పండోఫలమో బైట కాలులేని ఓదివ్యాంగుడికి ఇస్తాడు. ఇది మిగతా వారికి కడుపుమంట!డబ్బు ని దుర్వినియోగం చేసి బీడీ మద్యం కొంటారు చాలా మంది. కాలులేని రాము ఎప్పుడూ దైవస్మరణతో పాడుతూ కాలక్షేపం చేస్తాడు."అరే రాముగా!నీవు నడవలేనోడివి.ఆపైసలిస్తే నీకు ఇడ్లీ తెస్తా!"అని ఒకడు అంటాడు. "అన్నా! ఇంటి కాడ నీకు  ఉడుకుడుకు బువ్వ పెడ్తా! ఆపైసలు నాకియ్యి" ఆమె అంటుంది. వారి సతాయింపులు వింటున్న శివా  అందుకే బిస్కెట్టు పాకెట్ బ్రెడ్ రాముచేతిలో పెడతాడు.ఆరోజు అంతా గోలగోలగా అరుస్తూంటే ఓమూల ఒదిగి కూచున్న ఓముసలివగ్గుకి శివా ఇడ్లీ పొట్లాం చేతిలో పెట్టాడు. "తాతా!నీవు తిను.రోజూ ఎవరైనా ఇస్తే తింటావు.లేకుంటే అలా కళ్ళు మూసుకుని కూచుంటావు." అని చేతిలో ఐదు రూపాయలు పెట్టాడు. అంతే! అక్కడ ఉన్న వారంతా"అరె ముసలోడా! ఆబుడ్డోడికి ఇవ్వరా!రంగీ!నీవు తీస్కో! ఆకుంటోడికివ్వు"ఇలా తలా ఒక మాట అనసాగారు.దూరంగా నిలబడి శివా చూస్తూ ఉన్నాడు.తన వలన పాపం ఆతాతని అంతా పీక్కుతింటున్నారు"అని మనసు లో గుంజాటన పడసాగాడు.ఇంతలో  ఆతాత ఇలా అన్నాడు " నేను రాలే పండుటాకుని! కరెంటు తీగతగిలి కాలు పోగొట్టుకున్న  రాము మనందరికీ దిక్కు! తన కర్ర చెక్కకాలుతో వచ్చి  భజనలు పాడుతా ఉంటాడు. రంగీ! నీపిలగాడ్ని ఆడిస్తడు.ఆడికే ఇస్తా"అని తను ఒక ఇడ్లీ మాత్రమే తీసుకుని మిగతాది  ఐదురూపాయలతో సహా రాముచేతిలో పెట్టాడు. తాత దొడ్డ మనసు కి శివాకళ్ళు చెమ్మగిల్లాయి.🌹
కామెంట్‌లు