సమ్మోహననాలు (ముక్తపదగ్రస్థం );-ఎం. వి. ఉమాదేవి
సుదామా శ్రీ కృష్ణ 

కన్నయ్య తో చెలిమి 
చెలిమి ఎంతో బలిమి 
బలిమినిడి బంధమే సుదామకి ఓ వనజ 

సాందీప మునిచెంత 
చెంత చదివేనెంత 
చదువులో స్నేహమే ఒదిగింది ఓ వనజ !

పేద విప్రుడు ఒకరు 
ఒకరు యాదవచిగురు 
చిగురుమొగ్గలు తొడిగి స్నేహవనమో వనజ !

ఆరాధనా క్రమము 
క్రమము బాల్యపు సమము 
సమముగనె కడవరకు నిలిచింది ఓ వనజ !

చిరుగు చేలము గట్టి 
కట్టి సంతును బట్టి 
బట్టి సాయము నడుగ వెళ్ళేను ఓ వనజ !

మిత్రునికి కానుకగ
కాన్క ఏమని ఎరుగ
ఎరుగగుప్పెడు అటుకులే దొరికె నిక వనజ !

రాచ నగరుకు చేరి 
చేరి కృష్ణుని కోరి 
కోరి అంతఃపురము  ఆదరణయే వనజ !

ఎదురొచ్చి వేణుధర 
వేణువై మ్రోగెనుర 
మ్రోగు హృదయం తోటి మోదమున ఓ వనజ !

మిత్రమా కుశలమా 
కుశలమ్ము చెప్పుమా 
చెప్పుమని పాదపూజ చేసెను ఓ వనజ !

భోజనం భాజనము 
భాజనo రాజసము 
రాజమర్యాదలవి చేసేను ఓ వనజ !

వీవెనలు వీచేరు 
వీచ రాణులు వీరు 
వీరునూ ముచ్చటగ మురిసేరు ఓ వనజ !

నాకేమి తెచ్చితివి 
తెచ్చి దాచిన వేవి 
ఏవి యని  చేలమ్ము విప్పెహరి ఓ వనజ !

తీయనివి అటుకులును 
అటుకులే అందుకొను 
అందుకొని ఆశగా తినుచుండి ఓ వనజ !

మూడు గుప్పిళ్ళనే 
మించకనె ఆపెనే 
ఆపేసి రుక్మిణియు మర్మమున ఓ వనజ !

ఐశ్వర్య మందినది 
అంది శుభమిచ్చినది 
శుభములే స్నేహంగ నిలిచేను ఓ వనజ !


కామెంట్‌లు