బడులు తెరిచారు. మాటలపుట్ట ఖుషీ చిలకలా కబుర్లు పాటలతో "నేనూ బడికి పోతా"గొడవ చేస్తోంది. అమ్మా నాన్నలు ఆఫీసుకి అక్క బడికి వెళ్తే తోచక టి.వి.చూస్తుంది."కళ్ళు పాడవుతాయి"అని అమ్మమ్మ స్విచ్ ఆఫ్ చేస్తుంది. "బాసరలో అక్షరాభ్యాసం చేశాక బడికి వెళ్దువుగానీ" అని అంటే"కాదు ..ఉహు"అని ఒకటే గొడవ!పక్కనే ఉన్న బడికి వెళ్ళమంటే "ఉహు..నేను దూరం గా ఉన్న అక్క బడికి పోతా!"అని మొండికేసింది.ఇక ఆమె పోరు
పడలేక బాసరవెళ్లి పలక చేతిలో పెట్టినా క గానీ ఆపాప ఖుషీ గా నవ్వలేదు.ఇక పేచీ మొదలైంది "అక్క లాగా నేను నాన్న తో స్కూటర్ పై వెళ్లి చదువు కుంటా!""హమ్మో!మిమ్మల్ని మధ్యాహ్నం వదిలేస్తే నాకు రెండు ఫర్లాంగులు నడిచే ఓపిక లేదు." "ఆటోలో వస్తా".ఖుషీ మడతపేచీకి ఇంట్లో అంతా ఖంగుతిన్నారు.అక్క బడిలో పెద్ద తోట బోలెడు మంది పిల్లలు ఉంటారు అని అక్క మాటలు విని పంతం పట్టింది.ఫీజు బోలెడంత!నర్సరీ లో సీటుదొరకటం కష్టం! కానీ ఆపసిదానికి ఇవేమీతెలీదు. చెప్పినా అర్ధం కాదు. రెండు ఇళ్ల పక్కనే నర్సరీ కె.జి.క్లాసుల బడిఉంది.అందరూ తెల్సిన టీచర్లు. అందరూ ఎంత గా నచ్చ చెప్తూంటే ఖుషీ మొండి గా ఏడ్పు లంకించుకుంది.ఆరోజు అమ్మా నాన్నలతో అక్కబడిలో ఎడ్మిషన్ కోసం బయలుదేరింది.కొల్లేటి చాంతాడంత క్యూ!వీరు వెళ్లి వెయిటింగ్ రూం లో కూచున్నారు. ఓగంట గడిచేప్పటికి ఖుషీకి విసుగు వచ్చింది. "అక్క ఏది? అక్క కావాలి " గొణుగుడు మొదలుపెట్టింది. "అక్క బైటకి రాకూడదు. ఎవరూ సాయంత్రం దాకా ఇటువైపు రారు"అమ్మ చెప్పింది.అక్కడి కొచ్చిన కొందరు పిల్లలు గీ..బా..అంటూ ఆరున్నొక్క రాగాలు అందుకున్నారు. అది చూశాక ఖుషీ బేజారు ఇంకా ఎక్కువైంది. "ఇంటికి పోదాం. ఇక్కడ వద్దు. మన ఇంటి దగ్గర బడికే పోతా"అని గుణుస్తూ ఆఖరి అస్త్రం గా ఏడవసాగింది.ఇంటర్వ్యూ కి లోపలికి రమ్మన్నారు. ఏడ్పుమొహంతో అమ్మా నాన్నలతో గదిలోకి వచ్చిన ఖుషీకి టీచర్లు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా నాన్న ఒళ్ళో కూచుంది.ఓ పదినిముషాలు చూసి "థాంక్స్!రిజల్ట్ రేపు చెప్తాం"అన్నారు టీచర్లు. అంతే మర్నాడు నాన్న పక్కనే ఉన్న బడిలో ఖుషీ ని దింపి వెళ్తుంటే "బై అక్కా!బై నాన్నా!" అని లోపలికి వచ్చింది.ఓగంట పోయాక అమ్మమ్మ వచ్చింది ఖుషీ ని తీసుకుని వెళ్దామని!"అమ్మ మ్మా!నేను రాను.ఇక్కడే ఆడుకుంటా!లంచ్ బాక్స్ ఇవ్వు"అంది.నర్సరీ టీచర్ పిల్లలతో ఆడుతూ దగ్గర ఉండి అన్నం తినిపించటం చూసిన ఖుషీ కి తను కూడా అక్కడ తింటేనే బాగుంటుంది అనే ఊహ వచ్చింది. ఆసాయంత్రం అమ్మమ్మ ఖుషీ అమ్మతో అంటోంది "పిల్లలకి వద్దు అన్న పని చేయాలనిపిస్తుంది. నెమ్మదిగా చెప్పాలి.కసిరితే పెద్ద అయ్యాక మొండి గా అవుతారు.లాలన బుజ్జగింపు తో వారికి ధైర్యం నమ్మకం కలుగుతాయి"🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి