ఇడ్లీ ....ఇడ్లీ....ఇడ్లీ....;-- యామిజాల జగదీశ్
 ఇడ్లీ సాంబార్ అనగానే మద్రాసు గుర్తుకు రావడం సహజమే. ఓ రెండు రకాల చట్నీలు, సాంబారుతో ఇడ్లీలను లాగించడం మామూలే. సాంబార్ ఇడ్లీ, కుష్బూ ఇడ్లి అందరికీ తెలిసిందే. కానీ ఇడ్లీ చరిత్ర చాలా మందికి తెలియకపోవచ్చు.
సుమారు ఏడు వందల సంవత్సరాల.క్రితం మన భారతదేశానికి పరిచయమైనదే ఇడ్లీ. ఏడవ శతాబ్దంలో ఇడ్డరిక్ అని, పన్నెండో శతాబ్దంలో ఇడ్డు అవీ అని చెప్పుకున్న మాటలే తర్వాతి కాలంలో ఇడ్డలీగా మారింది. అనంతరం ఇది ఇడ్లీ అయినట్టు చరిత్రపుటలు తిరగేస్తే తెలిసొస్తుంది.
పూర్వకాలంలో ఇడ్లీ తయారీకి, ఇప్పుడు తయారుచేస్తున్న ఇడ్లీ గురించికూడా అలనాటి పుస్తకాలలో ఉంది. మన దేశంలో ముఖ్యంగా తమిళనాడునే ఇడ్లీకి సూచిస్తాం. అందులోనే మదురై ఇడ్లీలకున్న ప్రత్యేకత వేరు.
 
మదురై ఇడ్లీలలాగే చెట్టినాడు ఇడ్లీ, తంజావూరు ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ కూడా ప్రసిద్ధమే. 
ఇడ్లీకి ముఖ్యంగా కావలసినవి బియ్యము, మినపప్పు. వీటిలో ఉన్న విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకపదార్థాలున్నాయి. ఆవిరితో తయారయ్యే ఇడ్లీ సులభంగా జీర్ణమవుతుంది.అరగకపోవడమనే సమస్య ఉండదు. డెబ్బై అయిదు గ్రాములు చొప్పు నాలుగు  ఇడ్లీలో లేక యిభై గ్రాముల చొప్పున ఆరు ఇడ్లీలు తింటే అమీనో అమ్లాలు రెట్టింపవుతాయి.
ఇడ్లీలలో తట్టే ఇడ్లీ (కర్నాటక), ముథే ఇడ్లీ (మంగళూరు), రవా ఇడ్లీ (కర్నాటక), కాకుండా తమిళనాట చన్నాస్ ఇడ్లీ (కోవై), కాంజీవరం ఇడ్లీ, మదురై ఇడ్లీ, రాకి ఇడ్లీ, చెట్టినాడు ఇడ్లీ, సగ్గుబియ్యం ఇడ్లీ, సేమియా ఇడ్లీ, కుట్టి ఇడ్లీ, పొడి ఇడ్లీ,  సాంబార్ ఇడ్లీ, రస ఇడ్లీ, మెంతుల ఇడ్లీ, ఫ్రైడ్ ఇడ్లీ, మసాలా ఇడ్లీ, చిల్లీ ఇడ్లీ, బోలెడు రకాలున్నాయి.
భారతదేశం, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, మలేసియా, అమెరికా వంటి దేశాలలో రకరకాల ఇడ్లీలు తయారుచేస్తున్నారు.
నిజానికి ఇడ్లీ తమిళనాడు వంటకం కాదు. దీని మాతృదేశం ఇండోనేషియా. చైనా యాత్రికుడు యువాన్ చువాంగ్ ఏడవ శతాబ్దంలో ఆవిరితో ఉడికించే పాత్ర ఇండియాలో తయారవలేదన్నాడు. కనుక ఇడ్లీ మాతృక భారతదేశం కాదన్నది పరిశోధకుల మాట.
క్రీస్తుశకం 1130లో ఓ చాళుక్య రాజు మానసోల్లాస అనే పుస్తకంలో ఇడ్డరికా అనే మాట గుర్తించి చెప్పాడు. ఇడ్లీ అనే మాట ఇందులో నుంచే పుట్టిందంటారు. అదలా ఉంచితే పదో శతాబ్దంలో తమిళనాడుకొచ్చి నివాసాలేర్పరచుకున్న సౌరాష్ట్రీయులు చేసే అల్పాహారం ఇడాడా నుంచే ఇడ్లీ అనే మాట వచ్చినట్టు మరికొందరి అభిప్రాయం. 
కోయముత్తూరుకి చెందిన ఇనియన్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే చదువు మానేసాడు. ఆటోడ్రైవరుగా మారాడు. అప్పుడు ఇనియన్ అనుకోకుండా ఇడ్లీలు తయారుచేయడంలో పేరుపొందిన ఓ మహిళ నుంచి ఇడ్లీల గురించి తెలుసుకున్నాడు. అక్కడితో ఆగక ఇడ్లీలు చేయడం మొదలుపెట్టాడు. 2013లో ఇనియన్ 128 కిలోల బరువున్న ఓ ఇడ్లీని చేసి గిన్నిస్ రికార్డు సంపాదించాడు. అప్పుడు తమిళనాడు ఆహార తయారీ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాజామణి అయ్యర్ ఇడ్లీ రోజంటూ సంబరాలు జరపడానికి నలుగురితో కలిసి ఆలోచించారు. మార్చి ముప్పయ్యో తేదీని "ఇడ్లీ డే" గా ప్రకటించారు.   
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పౌష్టికాహార పదార్థాలలో ఒకటిగా ఇడ్లీకి చోటిచ్చింది. ఆ మేరకు 2015 నుంచి ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది.
ఇలా చెప్పుకుంటే పోతే మల్లెపూవు తెలుపులో కనిపించే ఇడ్లీ గురించి బోలెడన్ని వివరాలు తెలుస్తాయి. 
 కామెంట్‌లు