ఔ మల్ల!:- బాలవర్ధిరాజు మల్లారం
మొన్నటి కత ఆయింత సెపుతా ఇనుర్రి. గదేనుల్లా!
సదువుర్రి. 
ఆ పోరడు 
పొద్దుగాల లేసుడు
తానం గీనం జేసుడు
బువ్వ అండుకొని
సద్ది గట్టుకొని
కంపెనికి పోయి
పనిజేసి ఇంటికచ్చుడు
ఇంటికచ్చేటప్పుడు
తనకు అచ్చిన ఉత్తరాలను
తెచ్చుకొని ఆటికి జెవాబులు
రాసుడు. 
దినాం గిట్లనే జేసేటోడు.  

దినాం ఎంతలేదన్నా
పది,ఇరవై ఉత్తరాలన్నా రాసేటోడు.
ఒగో రోజు 
ఇంకా బగ్గనే రాసేటోడు. 
ఇటు సంగారెడ్డి నుంచి మొదలు వెడితే 
అటు సూరత్ దాకా
గటు కొత్త గూడెం నుంచి సురువు జేత్తే కలకత్తా దాకా
గంతే కాదుల్లా బొంబాయి నుంచి గుడ ఈ పిలగానికి
ఉత్తరాలు అచ్చెటివి.
ఇంతట్లనే ఒగ ఇసిత్రం జరిగిందుల్లా!
కొత్త గూడెం రామవరం నుంచి
ఒక పొల్ల కారట్లు రాసేది
ఈ పోరడు  అందరికీ రాసేనట్టే ఆ పొల్లకు గుడ జెవాబులు రాసెటోడు.
తొండ ముదిరి ఊసరెల్లి అయినట్టు మెల్ల మెల్లగా
సోపతి బగ్గ అయి
ఒకల్ల కొకల్లు కాయిష్  వడ్డరు
సూసుకోకుంటనే 
లగ్గం జేసుకుందమనుకున్నరు
సీన్మల లెక్కనే పొల్ల తరుపునోల్లు అద్దన్నరు.
గా పొల్ల ఇనలేదు.
గీ పిలగాడు గుడ 
" ముక్కూ మొకం తెల్వనోన్ని
కొంచెం కుడుక నమ్మద్దు.
ఆడు లంగనో , దొంగనో
రాసుడు మత్తుగ రాత్తరు
మాటలు మత్తు సెప్పుతరు
రాసినట్టు,మాట్లాడినట్టు
సరిగా ఎవ్వరూ ఉండరు
ఓ పొల్లా! 
ఆ పోరన్ని మరసి పో!
మీ వోళ్ళు సూసిన సంబందమే
సేసుకో " అని సిలుకకు సెప్పినట్టు సెప్పిండు.
అయినా ఇనలేదు గా పిల్ల.
పిల్ల ఇనేటట్టు లేదని
కొత్త గూడెం నుంచి
ఆ పోరడు ఉండే పట్నంకు అచ్చి బగ్గ బయపెట్టి,
బెదిరిచ్చిండ్రు.
అయిన గని ఆ పోరడు
అస్సలు అనుక లేదు,
జెనుక  లేదు.
అదో పెద్ద రామ కత
గిప్పుడు గదంత ఎందుకు గని
మొత్తానికి ఎన్నో తిప్పలు వడి పెద్దోల్లను ఒప్పిచ్చిండ్రు రిజిష్టర్ ఆఫీస్ ల తల్లిదండ్రుల ముంగట్నే లగ్గం జేసుకున్నరు.

గా పోరడు తాను
కాయిదాలల్ల రాసినట్టుగనే,
సోపతి గాల్లతో అన్నట్టుగనే
అర దచ్చిన తీసుకోకుంట
ఏరే కులం,ఏరే మతమోల్ల
పొల్లనే లగ్గం జేసుకున్నడు.
గీ ముచ్చట జరిగి  గిప్పటికీ ముప్పై ఏండ్లు దాటింది.
కైతలు రాసినట్టు,
మాటలు సెప్పినట్టూ 
ఉండుడు,బతుకుడు 
ఉత్త ముచ్చట గాదు ఔ మల్ల!


కామెంట్‌లు