అవరోధాలు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 కలతల కన్నీటి కాష్టాన్ని,
కొరివి లాంటి నీ చూపులతో ఇక
కాల్చక తప్పదు...
నీ మాటల తూటాలను
మట్టు పెట్టిన, ఆ మౌనానికి 
ధిటుగా జవాబు, 
ఇక చెప్పక తప్పదు....
చచ్చుపడి పోయిన 
నీ చేతులకు, తొడిగిన 
సంకెళ్ళను ఇక తెగించి 
తెంచక తప్పదు...
కదలక ఇన్నాళ్ళు 
నిను బందీ చేసిన, 
నీ భయాన్ని ఇక 
భయపెట్టక తప్పదు....
నేటి నుంచి ఎవ్వరినీ
సాయం కోరక నీకు నువ్వుగా,
నీ లక్ష్యం దిశగా ఒంటరి
ప్రయాణాన్ని చేయక తప్పదు...
అడుగడుగునా
ఆనకట్టలు కడుతూ
అడ్డుపడుతున్న ఆ అవరోధాలను, 
ఇక నీ ఆలోచనలతో
అదుపు చేస్తూ
అధిగమించక తప్పదు....


కామెంట్‌లు