*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - (౦౦౨-002)*
 *ఉత్పలమాల:*
*రామ విశాల విక్రమ ప | రాజిత భార్గవరామ, సద్గుణ*
*స్తోమ, పరాంగనావిముఖ | సువ్రతకామ వినీల నీరద*
*శ్యామ, కకుత్థ్సవంశ కల | శాంబుధిసోమ సురారి దోర్బలో*
*ద్దామవిరామ భద్రగిరి | దాశరథీ కరుణాపయోనిథీ.*
*తా:*
మంచి గుణములన్నీ నీ సొంతము చేసుకున్న రామంచంద్రా! ఎందరో శత్రురాజులను తన యుద్దనైపుణ్యంతో గెలిచిన భార్గవరాముని ఓడించినవాడా! ఎటువంటి పరిస్థితులలో అయిన పరస్త్రీ వైపు కన్నెత్తి చూడకూడదు అనే ఉత్తమమైన లక్షణమును వ్రతముగా కలవాడా! నల్లని మేఘమువంటి శరీరము కలవాడా! కాకుత్సుడు అనురాజు పుట్టిన ఇక్ష్వాకు వంశమనే సముద్రంలో చంద్రకాతులు నింపే వాడా! దేవతలకు శత్రువులు అయిన రాక్షసుల బలగర్వమును అణచివేసినవాడా! దయ అనే సముద్రమునే సొంతము చేసుకున్నవాడా! రామభద్రా!....... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*సర్వ లక్షణ సమన్వితుడైన రామభద్రుని గుణములను కొనియాడము ఎప్పుడూ, ఎన్నడూ సంపూర్ణము అవ్వదు. ఎందుకంటే, ఆయన గుణాతీతుడైన సర్వగుణ సంపన్నుడు. నిరాకారుడై ఆజానుబాహుడైన సర్వాంగ సుందరుడు. బాలకాండలో యాగ రక్షణ తరువాత సీతా పరిణయ ఘట్ట సమాప్తికి ముందు పరశురాముడు శ్రీ రాముని ఎదురునిలిచి శివధనుర్భంగము చేసినావా అని నిలదీసి, నారాయణ ధనుస్సును ఎక్కపెట్టమంటే, ధనస్సు స్వీకరిస్తూ పరశురామ శక్తని కూడా తనలో కలుపుకున్న రామచంద్రుని అవిక్రమ పరాక్రమము గూర్చి, గుణగణాలను వివరించడం, పొగడటం అంతసులభమా! కాదు. కాకపోయినా, "నోరునొవ్వంగ హరికీర్తి నొడవవలయు" అన్నట్లుగా మన శక్తి మేర రామ భద్రుని కీర్తనలు పాడుకుంటూ... ఆనంద పరవశులమై... వారి సన్నిధి చేరుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు