*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - (౦౧౦-010)*
 *చంపక మాల:*
*కనకవిశాలచేల భవ | కానన శాతకుఠారధార స*
*జ్జన పరిపాలశీల దివి | జస్తుత సద్గుణకాండ కాండ సం*
*జనిత పరాక్రమక్రమ వి | శారద శారద కంద కుంద చం*
*దన ఘనసార సారయ | శ దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దశరధ కుమారుడివి, సముద్రమంత దయను నీదిగా చేసుకున్న రామచంద్రా! నువ్వు బంగారు తీగలతో, వెడల్పుగా వున్న అంచులతో నేయబడ్డ పట్టు వస్త్రాలు కట్టుకున్న వాడివి. పుట్టుక అనే అడవిని నరికి వేయగల పదునైన గొడ్డలి వంటి వాడివి. మంచి వారిని పరిపాలించే వ్రతమును పట్టిన వాడివి. దేవతల చేత కీర్తించ బడిన వాడివి. మంచి గుణముల సమూహాన్ని నీలో నిలుపుకున్న వాడివి. నీటియందు పుట్టిన అగ్ని (బడబాగ్ని) ని కూడా ఆర్పి వేయగల పరాక్రమము కలవాడవు. శరదృతువు లో వచ్చే దట్టమైన మేఘంలా, మల్లెపూలు, గంధము, పచ్చకర్పూరము వంటి కీర్తి తో ప్రకాశిస్తున్నావు ........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*రాముడు దయాసాగరుడు కదా! మాట మీద నిలబడి వుండే సత్యవాక్పరిపాలకుడు కూడా! వనవాసం చేస్తున్న తన వద్దకు వచ్చిన భరతుడు, "నీవు లేని, నువ్వు వద్దు అనుకున్న రాజ్యం నాకూ వద్దు. నేను పాలించలేను. నీవు తిరిగి రాజ్యాధికారం తీసుకోమని" అడిగితే తండ్రికి ఇచ్చిన మాటను గుర్త చేసి 14సం. పూర్తి అయిన తరువాత మాత్రమే రాజ్యానికి వస్తాను అని నచ్చ చెపుతాడు. భరతుడు అక్కడితో ఆగకుండా, అన్నగారికి అడవిలో నడిచేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన లేకుండా, నీ పాదుకలను ఇవ్వమని, నీ ప్రతినిధిగా పాలిస్తాను అని అడిగాడు. వెంటనే పాదుకలు ఇస్తాడు రామభద్రుడు. మరి మనం ఏమి చేస్తున్నాము. రామాయణం, రాముడు చూపిన దారిలో నడుస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలేమో! ఇటువంటి మంచి లక్షణాలతో గడప గలిగే అవకాశాన్ని మనకు ఇమ్మని ఆ రావణవైరిని ప్రార్థిస్తూ....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు