*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 015*
 *చంపకమాల:*
*హరునకు నవ్విభీషణున | కద్రిజకున్ దిరుమంత్రరాజమై*
*కరికి నహల్యకున్ ద్రుపద | కన్యకు నార్తిహరించు చుట్టమై* 
*పరగిన యట్టి నీ పతిత | పావన నామము జిహ్వపై నిరం*
*తరము నటింపజేయు మిక | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
రఘువంశ తిలకా, కరుణా సముద్రము వంటి వాడవు,దశరధరామా! నీ పేరు పాపపు రాశిలో మునిగి వున్న వారిని కూడా పుణ్యపు రాశిలో ముంచి తేల్చుతుంది. ఇటువంటి నీ పేరు శివునికి, విభీషణునుకి, పర్వత రాజు కుమార్తె పార్వతీ దేవికి గొప్పదైన మంత్రముగా పని చేస్తుంది. గజరాజుకు, అహల్యకు, ద్రౌపదికి వారి వారి ఇబ్బందులు పోగొట్టే చుట్టమై వుంది. అంత గొప్పదైన నీ పేరు నా నాలుక మీద నాట్యము చేసేటట్టుగా చేయి........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"నామ" ప్రాభవాన్ని స్వయంగా అనుభవించిన శివుడు, విభీషణుడు, పార్వతీ దేవి, గజరాజు, ద్రౌపది, అహల్య మొదలగు దేవతలే స్వయంగా మనకు కనిపిస్తున్నారు. దేవతలే అవదల దాల్చిన ఇంతటి ఘనమైన నామాన్ని మనం మనసు నిండా నింపుకుని, మన శ్వాసగా మార్చుకుని, మన జీవిత నావకు చుక్కానిగా ఏర్పరుచుకొని ముందుకు సాగే ఘనమైన ప్రయత్నం చేద్దాం. మన ఈ ప్రయత్నానికి ఆ సుగ్రీవ సంరక్షకుడు తన అనుగ్రహం నిండుగా మెండుగా ఇస్తాడని నమ్ముతూ, ఇవ్వాలని కోరుతూ ప్రార్థన చేద్దాము .....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు