*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 016*
 *ఉత్పలమాల:*
*ముప్పునఁ గాలకింకరులు | ముంగిటవచ్చిన వేళ రోగముల్*
*గొప్పరమైనచోఁగఫము | కుత్తక నిండినవేళ బాంధవుల్*
*గప్పినవేళ మీ స్మరణ | గల్గునో గల్గదొఁనాటి కిప్పుడే*
*తప్పకచేతు మీ భజన | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయా సాగరుడవు అయిన, దశరధరామా! మసలి తనము వచ్చి నిలిచినపుడు, యమపురికి బయలుదేరే సమయము వచ్చింది అని యమభటులు ఇంటి ముందు నిలుచున్నప్పుడు, రోగములు ఎక్కవ అయి గొంతులో శ్లేష్మము అడ్డు పడుతున్నప్పుడు, ఇంటి నిండా బంధువులు చేరి నప్పుడు, నీ నామ స్మరణ చేయగలుగుతానో లేదో. అందువల్ల, ఇప్పుడే నేను నీ భజన చేస్తాను, కళ్యాణ రామా!........ అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఏకాలములోనైనా, పరిస్థితుల ప్రభావం మనిషి మనసు మీద ఎలా వుంటుంది అనే విషయం ఈ పద్యం లో రామదాసు వివరించారు. సత్యనారాయణ స్వామి వ్రతం లోని కథలో పిల్లలు కలగాలని కోరికతో వర్తకుడు పిల్లలు కలిగితే వ్రతం చేస్తానని, తరువాత పిల్ల పెళ్ళి లో చేస్తానని, అల్లుని వ్యాపారం అభివృద్ధి చెందితే చేస్తానని, స్వామి కి వాయిదాలు ఇవ్వడం మనమందరం తెలుసుకున్న విషయమే. మనిషికి భగవంతుడు మరపు అనే వరం ఇచ్చాడు. కానీ, ఆ మరపు వరాన్ని మనకు అనుకూలంగా మార్చుకో కూడదు. 60 సం. నిండి, ఉద్యోగ విరమణ చేసాక తీరికగా పరమాత్ముని పలుకరిద్దాము అనుకుంటే, అప్పటికి పళ్ళు వూడిపోయి మంత్రం నోటిలో తిరగదు. మోకాళ్ళ నొప్పులతో ఒకచోట స్థిరంగా కూర్చోలేము. కాల్షియం తక్కువ అయి చేతులు కాళ్ళు ఒణకడం మొదలు. అందుకే " దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టకో మన్నారు" పెద్దలు. కొంచెం ఓపిక, కంటి చూపు మిగిలి వుండగానే పరమాత్మ స్మరణ మనలో కలిగేటట్టు అనుగ్రహించమని ఆ సర్వేశ్వరుని వేడకుందాము......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు