*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 019*
 *ఉత్పలమాల:*
*శ్రీరమ సీతగాఁగ నిజ | సేవక బృందము వీరవైష్ణవా*
*చార జనంబుగాఁగ విర | జానది గౌతమిగా వికుంఠము*
*న్నారయ భద్రశైల శిఖ | రాగ్రముగాఁగ వసించుచేతనో*
*ద్ధారకుఁడైన విష్ణుఁడవు | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయ కరుణ అనే గుణాల రూపమైన దశరధ రామా! లక్ష్మీ దేవి నీకు సీతగా వచ్చింది. నీకు సేవలు చేసే నీ పరవారము అందరూ మంచి వైష్ణవాచారములు పాటించే భక్తులుగా వచ్చారు. విష్ణు లోకములో ప్రవహించే పుణ్య విరజానది గౌతమి గా, గోదావరిగా నేలకు వచ్చింది. జీవిస్తున్న అన్ని ప్రాణులను కాపడి ఉద్దరించే రాముడిగా వైకుంఠమునే భద్రగిరి శిఖరము మీదకు తెచ్చి నీవే వచ్చావు...... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*పరమేశ్వర తత్వం వైకుంఠం లోనూ వుంది. భద్రగిరి శిఖరం మీదా వుంది. ఆనందనిలయమైన శివలోకంలో వుంది. సతగయ లోకమైన బ్రహ్మ లోకంలో వుంది. మణిద్వీప నివాసిని కూడా అయి వుంది. ఆ పరాత్పర తత్వము ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి సాధ్యంకాదు కదా! పోతానామాత్యుడు చెప్పారు కదా! "భాగవతం" లో. "ఇందుగల డందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు" అని. సృష్ఠి కి మూలము తానై, అంతటా, అన్నిటా తానే అయి వున్న ఈ పరతత్వము మనకందరకు సులభతరంగా అంది మన మోక్ష మార్గానికి చుక్కానిగా వుండేలా, పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు అనుగ్రహించాలని వేడుకుంటూ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు